జాతీయ వార్తలు

మరిన్ని సంస్కరణలు తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ సిటీల నిర్మాణంలో పాలుపంచుకోండి
సింగపూర్ పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ ఆహ్వానం
వచ్చే ఏడాదినుంచి జిఎస్‌టి అమలుపై ఆశాభావం

సింగపూర్, నవంబర్ 24: భారతదేశాన్ని విదేశీ పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా చేయడానికి మరిన్ని సంస్కరణలు చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. అంతేకాదు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) 2016లో అమలులోకి వస్తుందన్న ఆశాభావాన్ని సైతం ఆయన వ్యక్తం చేసారు. మంగళవారం ఇక్కడ భారత్-సింగపూర్ ఆర్థిక సదస్సులో ప్రధాని మాట్లాడుతూ భారత్‌లో రెండు విమానాశ్రాయాల అభివృద్ధికి సింగపూర్ చాంగి విమానాశ్రయంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తోందని చెప్పారు. తమ దేశంలో స్మార్ట్ సిటీల సిర్మాణంలో పాలుపంచుకోవాలని సింగపూర్ కంపెనీలను మోదీ ఆహ్వానించారు. ‘గత 18 నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లడానికి అవసరమైన రన్‌వేలను తయారు చేసాం. పెద్దఎత్తున సంస్కరణలు అమలవుతున్నాయి. అవి ఇప్పుడు చిట్టచివరి మైలుకు చేరుకుంటున్నాయి. సక్రమంగా పని చేయడానికి వీలుగా వ్యవస్థను మార్చడమే సంస్కరణ. ప్రజలు తమ కలలను సాకారం చేసుకోవడం కోసమే సంస్కరణలు తీసుకువస్తున్నాం. అంటే దాని అర్థం ప్రజల ముఖాల్లో మరింత వెలుగు, ఆఫీసుల్లో తక్కువ పత్రాలు కనిపించాలనేదే మా ఉద్దేశం. అంతేకాదు ఆర్థిక మార్కెట్లను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మోదీ అన్నారు. ‘గత ఏడాది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు సంబంధించిన చట్టాలను సరళీకృతం చేయడం ప్రారంభించింది. ఇటీవలే మేము ఎఫ్‌డిఐ నిబంధనలను మరింత సరళీకృతం చేసాం. దీంతో భారతదేశం ఇప్పుడు ఎఫ్‌డిఐలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన దేశంగా మారింది’ అని ప్రధాని చెప్పారు. 2016లో జిఎస్‌టి విధానాన్ని అమలు చేయగలమని ఆశిస్తున్నామని మోదీ చెప్పారు. కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఎఫ్‌ఢిఐలు 40 శాతం పెరిగాయని, భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఉన్న పెట్టుబడిదారుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయి ఇప్పుడు సానుకూల ఫలితాలుగా మారుతున్నాయని ఆయన చెప్పారు. రెగ్యులేటరీ, పన్నుల విధానానికి సంబంధించిన అనుమానాలను తొలగించడానికి తీసుకున్న 14 నిర్ణయాత్మక చర్యలను సైతం ప్రధాని వివరిస్తూ భారతదేశం ఇప్పుడు చౌకగృహాల నిర్మాణం మొదలుకొని స్మార్ట్ సిటీల దాకా, రైల్వేలు మొదలుకొని, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి వరకు అనేక రంగాల్లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తోందని చెప్పారు.
నవరత్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి
పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నవరత్న పిఎస్‌యులలో పెట్టుబడులు పెట్టాలని ఆయన సింగపూర్‌లోని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ, భారత్‌లో కనీసం 20 స్మార్ట్ సిటీల నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్‌తో పాటుగా పలువురు సింగపూర్ నేతలతో అనేక అంశాలపై జరిపిన చర్చల్లో ప్రధాని భారత్‌లో ఎన్నో సింగపూర్‌లను సృష్టించాలన్న తన మనసులోని ఆలోచన అని స్పష్టం చేసారు. అంతేకాదు సింగపూర్‌లో రూపాయి బాండ్లను, ఇన్‌ఫ్రాస్టక్చర్ బాండ్లను జారీ చేయాలని కూడా ఆయన కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాలను విక్రయించడం ద్వారా దాదాపు 70 వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం అనుకుంటున్న విషయం తెలిసిందే.
సింగపూర్ ప్రధానితో జరిపిన సమావేశంలో సింగపూర్ సాయంతో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై మోదీ చర్చించినట్లు సింగపూర్ నేతలతో ప్రధాని సమావేశాల వివరాలను మీడియాకు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాధ్వా చెప్పారు. ప్రధాని సింగపూర్ నేతలతో జరిపిన చర్చల్లో ప్రధానంగా స్కిల్స్ డెవలప్‌మెంట్, పట్టణాభివృద్ధి, పర్యాటకం, పౌర విమానయానం, ఫైనాన్షియల్ సర్వీసులులాంటి 14-15 అంశాలు స్థూలంగా చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు.
భారత్‌కు విమాన సర్వీసులను రెట్టింపు చేయాలని సింగపూర్ ప్రధాని కోరగా, భారత్‌లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో సింగపూర్ ప్రధానపాత్ర పోషించాలని మోదీ కోరినట్లు చెప్పారు. కాగా, మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి భారత్ ముఖ్యంగా గుజరాత్ సందర్శించాలని మోదీ సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌ను ఆహ్వానించినట్లు వాధ్వా చెప్పారు.
(చిత్రం) సింగపూర్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను పరస్పరం మార్చుకుంటున్న భారత, సింగపూర్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, లీ సీన్ లూంగ్