నల్గొండ

అర్హులందరికీ డబుల్ బెడ్‌రూంలు మంత్రి జగదీశ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 17: అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజల కోసం రూ.50.88కోట్లతో 14 ఎకరాల విస్తీర్ణంలో మండలపరిధిలోని కేసారం గ్రామంలో 1000 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పేదలకు అన్ని వసతులతో పైసా ఖర్చులేకుండా ఇంటిని నిర్మించి అందించే డబుల్ బెడ్ రూం పధకం సీ ఎం కేసీ ఆర్ కలల పధకమన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో సూర్యాపేట జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక పధకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేద ప్రజల పెన్నిదిగా నిలుస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నింటిని నేరవేర్చడంతో పాటు హమీలివ్వకుండానే మిషన్ భగీరధ, కళ్యాణ లక్ష్మి లాంటి పధకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లభించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, ఆర్డీవో మోహన్‌రావు, ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, గ్రామసర్పంచ్ పంతం రేణుక, ఎంపీటీసీ వాంకుడోతు సుక్కు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పిల్లలమర్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్‌కట్ చేశారు. ఈసందర్భంగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు షూలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో డీఈవో వెంకటనర్సమ్మ, సర్పంచ్ సోమగాని లింగస్వామి, తహశీల్ధార్ మహమూద్ అలీ, ఎంఈవో గ్లోరి, హెచ్‌ఎం సుమతిబాయి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్
పేదల ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు
పేటలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
కేక్‌కట్‌చేసి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 17: తెలంగాణ జాతిపిత, అభివృద్ది ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్దిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 64వ జన్మదిన వేడుకలను శనివారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మంత్రి ఆత్మకూర్ (ఎస్) మండలపరిధిలోని సుప్రసిద్ద నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని గొల్లబజార్‌లో ఇటీవల ముఖ్యమంత్రి కేసీ ఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన రెండుపడక గదుల గృహసముదాయంలో లబ్దిదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా 64 కిలోల కేక్‌ను కట్‌చేసి పంపిణీ చేశారు. సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అదేవిధంగా ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డులు పంపిణీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్‌కట్ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవం నిలిపిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. డబుల్ బెడ్‌రూం పధకం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టని రాష్ట్రంలోని గూడులేని పేదలందరికి పైసా ఖర్చులేకుండా రెండుపడక గదుల ఇండ్లను నిర్మించి ఇవ్వడమే లక్ష్యమన్నారు. తెలంగాణ రాకుంటే, సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టకుంటే నేడు తెలంగాణ పరిస్థితి ఏలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుందన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ది పధకాలను చేపడుతూ కొత్తరాష్ట్రంలో గొప్పపాలన అందించిన నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. పేదింట ఆనందం నింపడమే లక్ష్యంగా వినూత్న సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నికలు ముందు ఇచ్చిన హమీలను అమలుచేసిన వారు ఎవరూ లేరని సీ ఎం కేసీ ఆర్ ఇచ్చిన హమీలన్నింటిని అమలుచేయడంతో పాటు హమీలివ్వకుండనే అనేక పధకాలను అమలుచేసిన మహనీయుడన్నారు. నిరంతరం తెలంగాణ ప్రజల కోసం పరితపించే కేసీ ఆర్ నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చర్లగూడెం మరోమారు ఉద్రిక్తం
పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు
మర్రిగూడ, ఫిబ్రవరి 17: మండలంలో నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో శనివారం మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మండలంలోని శివన్నగూడెం గ్రామ శివారులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన చర్లగూడెం ప్రాజెక్టు ముంపుగ్రామాలైన నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండాల ప్రజలతో పాటు భూములను కోల్పోతున్న రైతులు తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు కొనసాగించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక దీక్ష 174వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటంతో నిర్వాసిత రైతులు పెద్ద సంఖ్యలో రిజర్వాయర్ కట్ట వద్దకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. పనులను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వబోమని, ప్రభుత్వం చెల్లించవలసిన పరిహారం అందాలని, ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కల్పనపై స్పష్టత ఇచ్చాకే ప్రాజెక్టు నిర్మించాలని బాధితలు డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు నర్సిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వాసితులతో గ్రామ సభ నిర్వహించారు. తహశీల్దార్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం అందేలా చూస్తామని, రైతులు పనులకు సహకరించాలని కోరగా, అందుకు విబేధించిన రైతులు పరిహారం అందేంత వరకు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేది లేదన్నారు. డిసెంబర్‌లో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య జరిగిన లాఠీఛార్జీ ఘటనలో 21 మంది భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి
రైతులు సహకరించాలి
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, ఫిబ్రవరి 17: ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరారు. డిండి ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా కిష్టరాయిన్‌పల్లి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న 18 మంది రైతులకు 4 కోట్ల రూపాయల నష్టపరిహారం చెక్కులను శనివారం స్ధానిక ఆర్డీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురౌతున్న వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వర్తింప చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కిష్టరాయిన్‌పల్లి రిజర్వాయర్ నిర్మాణంలో 1243 ఎకరాల భూమి ముంపునకు గురౌతుండగా అధికారులు ఇప్పటి వరకు 600 ఎకరాల భూమిని సేకరించారని చెప్పారు. సేకరించిన భూమికి ఎకరానికి 5.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించినట్లు చెప్పారు.
విద్యుతాఘాతంతో
గిరిజన రైతు మృతి
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 17: మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రకాల్వతండాకు చెందిన నూనావత్ రమేష్ (35) విద్యుతాఘాతానికి గురై శనివారం నాడు మరణించారు. నరేష్‌కు అర ఎకరం వరి పొలం ఉంది, పొలం వద్ద వ్యవసాయబోరు బావి విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన అతనికి విద్యుతాఘాతానికి గురైనాడు. దీంతో అక్కడనే పడిపోవడంతో గమనించిన వారు వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స జరిపగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్సకై హైద్రాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. వెంటనే మృతదేహాన్ని ఎర్రకాల్వతండాకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని టీపీసీసీ కార్యదర్శి డీ.స్కైలాబ్‌నాయక్, టీడీపీ నాయకులు మాన్యనాయక్, సైదానాయక్‌లు సందర్శించారు. మృతుని కుటుంబానికి సంతాపం, సానుభూతిని తెలిపారు. నిరుపేద గిరిజన రైతును ఆదుకోవాలని కోరారు.

వైద్య ఉద్యోగుల సమస్యలను
తక్షణమే పరిష్కరించాలి
మాజీ మంత్రి ఆర్డీఆర్
సూర్యాపేట, ఫిబ్రవరి 17: వైద్య ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్‌వో కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఎంతో కాలంగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలని కోరారు.
ఈవిషయాన్ని సీ ఎల్‌పీ నేతల దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా కృషిచేస్తానన్నారు. ఈధర్నాకు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, జేఎసీ కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, వివిధ కార్మిక సంఘాల నాయకులు సత్యనారాయణ, దంతాల రాంబాబు, వెలుగు కర్ణాకర్, కొండపల్లి సాగర్‌రెడ్డి, డాక్టర్ వడ్డేపల్లి రవి తదితరులు సంఘీభావం తెలిపారు.

ఇంటర్ పరీక్షలను
పకడ్భందీగా నిర్వహించాలి: జేసి
భువనగిరి, ఫిబ్రవరి 17: ఈ నెల 28నుండి మార్చి 16వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తిచేయాలని యాదాద్రిభువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ రవిగుగులోతు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో వివిధ అనుబంధశాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.మహేందర్‌రెడ్డితోకలిసి జాయింట్ కలెక్టర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 14,361మంది 26పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరుకానున్నారని విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరయ్యేలా రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించి గట్టిబందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జీరాక్స్‌సెంటర్లను మూసివేయాలని, మాస్‌కాపీయింగ్ నివారించేందుకు అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ప్రాథమిక వైద్యసౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

పగిలిన కృష్ణా పైపులైను
పట్టింపులేని అధికారులు
చిట్యాల, ఫిబ్రవరి 17: కృష్ణ..కృష్ణా..కృష్ణాజలాలు సరఫరా చేసే పైపులైను పగిలిపోయి విలువైన కృష్ణాజలాలు వృధాగ పోతున్నా పట్టింపులేదు. మాకెందుకులే అనుకుంటుండటంతో ఎంతో విలువైన కృష్ణాజలాలు వృధాగపోతున్నాయి. పగిలిన పైపు నుండి కృష్ణాజలాలు ఉబికిరావడాన్ని చూస్తే బాధాకరం. మండలంలోని వెలిమినేడు శివారులో రహదారి పక్కన రత్న ఆగ్రో రసాయన పరిశ్రమ వద్ద కృష్ణాజలాలు సరఫరా చేసే పైపులైను ద్వంసపై కృష్ణాజలాలు ఉబికివస్తున్నాయి. నీరంతా ఉబికి వస్తూ వృధాగ పోతున్నా పట్టింపులేకపోవడంతో వచ్చే వేసవికాలంలో తాగునీటికి ఇబ్బందులు పడకతప్పదు. ఎంతో విలువైన కృష్ణాజలాలు పైపుపగిలి ఉబికి వస్తూ వృధాగపోతున్నా పట్టించుకునేనాథుడు లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. రత్న ఆగ్రో పరిశ్రమ వద్ద కృష్ణాజలాల పైపులైను అప్పుడప్పుడు ద్వంసమవుతుండటంతో స్వల్ప మరమ్మత్తులు చేస్తుండగా కొన్నిరోజులకు మళ్ళీ ద్వంసమవుతుందని వెలిమినేడు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇంటింటి తాగునీటినందిస్తామని ప్రయత్నాలు చేస్తుంటే అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరనున్నదా అనే సందేహాలు వ్యక్తంకావొచ్చు. కృష్ణాజలాలు సరఫరా చేసే పైపులైన్లను పర్యవేక్షించకపోవడంతో పైపులు ద్వంసమవుతూ కృష్ణాజలాలు మండల పరిధిలో వృధాగ పోతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అధికారులు ఇప్పటికైనా రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని కృష్ణాజలాలను సరఫరా చేసే పైపులు, గేట్‌వాల్వ్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ద్వంసంకాకుండా జాగ్రత్తలను తీసుకుని కృష్ణాజలాలు వృధాకపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పండగలా సీఎం జన్మదినం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 17: సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంబరంగా జరుపుకున్నాయి. కేక్‌లు, స్వీట్ల పంపిణీ, ఆశ్రమాల్లో, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, అన్నదానాలు, రక్తదాన కార్యక్రమాలలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు కెసిఆర్ జన్మదిన వేడుకలతో సందడి చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో టిఆర్‌ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి సారధ్యంలో భారీగా కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ ఇన్‌చార్జి బడుగుల లింగయ్య యాదవ్, బ్రాహ్మణపరిషత్ సభ్యులు చకిలం అనిల్‌కుమార్‌లు కేక్ కట్ చేసి పావురాలను ఎగురవేసి అనంతరం నిర్వహించిన సభలో కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు ఏకరవు పెట్టారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో కంచర్ల, బడుగుల, ఎంపిపి పాశంరాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిలు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి నివాసంలో ఆయన కెసిఆర్ జన్మదిన వేడుకల కెక్ కట్ చేశారు. టిఆర్‌ఎస్‌వి, టిఆర్‌ఎస్‌కెవి, తెలంగాణ జాగృతి తదితర సంస్థల ఆధ్వర్యంలో సైతం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గుత్తా
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 17: సీఎం కెసిఆర్‌ను శనివారం ప్రగతిభవన్‌లో కలిసిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్ ఆయురారోగ్యాలతో బంగారు తెలంగాణ సాధనలో విజయవంతం కావాలంటు గుత్తా ఆకాంక్షించారు.

గాంధీ గుడి సమీపంలోని గుట్టపై అగ్నికీలలు
చిట్యాల, ఫిబ్రవరి 17: మండలంలోని పెద్దకాపర్తి గ్రామపరిధిలోనిని గాంధీ గుడి సమీపంలో ఉన్న గుట్టలపై శనివారం సాయంత్రం మంటలు వ్యాపించాయి. గుట్టలపై ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగలు కమ్ముకోగా అగ్నికీలలు ఎగిసి పడుతుండటంతో వాటిని చూసిన వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది మండలను ఆర్పివేశారు. నీటివేగానికి మంటలు కాస్త ఆరినట్లుగా కనపడ్డా మళ్ళీ అంటుకుంటూనే ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ధూమపానం కోసం అగ్గిపుల్ల లేదా సిగేరేట్, బీడీ, చుట్టను వేయడంతో మంటలు వ్యాపించినట్లుగా సిబ్బంది తెలిపారు.
ఆర్టీసీ బస్సులో గుంటెపోటుతో ప్రయాణీకుడి మృతి
చిట్యాల, ఫిబ్రవరి 17: బస్సు ప్రయాణించే ప్రయాణీకుడు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎలికట్టెకు చెందిన సోమనబోయిన రాములు(80) నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లిలో ఉండే తన కూతురు నివాసానికి వెళ్ళేందుకు ఎలికట్టె నుండి చిట్యాలకు ఆటోలో వచ్చి గోపలాయపల్లికి వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సును ఎక్కాడు. బస్సు సీటులో కూర్చున్న రాములుకు ఒక్కసారిగా గుండెపోటురావడంతో పక్కన కూర్చున్న ప్రయాణీకుడిపై ఒరగడంతో బస్సులోని ప్రయాణీకులు బస్సును ఆపమని డ్రైవర్‌కు సూచించారు. బస్సు స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ వద్దకు వచ్చేసరికి గుండెపోటుకు గురైన రాములును పరిశీలించేలోపునే మృతిచెందాడు. బస్సు డ్రైవర్ బస్సును పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకువచ్చి బంధువులకు సమాచారాన్ని అందించి మృతదేహాన్ని అప్పగించారు.

అభివృద్ధి ప్రధాత కేసీఆర్
ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఫిబ్రవరి 17: తెలంగాణరాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తార్కాణమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 64వ జన్మదినోత్సవ వేడుకలను శనివారం మండలంలో టీఆర్‌ఎస్, జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చిట్యాల ఎంపీపీ బట్టు అరుణఅయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మిసైదులు, ప్రమజాప్రతినిధులు టీఆర్‌ఎస్ నాయకులు ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే వేముల వీరేశం కేకును కట్‌చేసి సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ సంబరాల వేడుకలను జరుపుకుని నాయకులకు తినిపించి సీఎం కేసీఆర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలోకి తీసుకెళుతున్నారన్నారు. అనంతరం పేదలకు వస్తద్రానం, పండ్లు పంపిణీ చేశారు.

యాదగిరీశుని
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట,్ఫబ్రవరి 17:యాదగిరిశుని బ్రహ్మోత్సవాలు శనివారం వేదమంత్రాలు మంగళవాయిద్ద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.నృసింహుడి కళ్యాణ బ్రహ్మోత్సవాల శ్రీకారంగా శ్రీ స్వామి వారిని బంగారు నగలు,వివిద రకాల పుష్పాలు,పట్టు వస్త్రాలతో,శోభాయమానంగా అలంకరించారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు నిర్విగ్నంగా సాగేందుకు విశ్వక్ష్సేనుడికి ముందుగా పూజలు నిర్వహించారు.స్వస్తివాచనము,పుణ్యాహవచనము,రక్షాబంధనము,వంటి కళ్యాణ తంతు పూజాధికాలను యజ్ఞాచార్యులు,శాస్త్రోక్తంగా చేపట్టారు. అంతకు ముందు పవిత్ర జలాలతో అర్చకులు ఆలయ మండపం,పరిసరాలు,కొండపై నలు దిక్కుల పుణ్య జలాలు చిలకరిస్తూ సంప్రోక్షణ నిర్వహించారు.చతుర్వేదాలు, ఉపనిషత్తులు,పంచసూక్తాలు,రామాయణ,్భగవతాలను,క్షేత్ర మహత్యాన్ని మూల మంత్ర జపాలను వేదపండితులు ఆలయ అర్చకులు పఠించారు. ఈ సందర్బంగా అధికార్లు ఆలయాన్ని రంగు రంగు విద్ద్యిత్ ద్దీపాలు,వివిద రకాల పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.పూల అలంకరణతో కళ్యాణ శోభను సంతరించుకోగా ఆలయం, ఆలయ పరిసరాలు బ్రహ్మోత్సవ శోభతో ధ్విగుణీకృత మైంది. ఆలయంలో సాయంత్రం అంకురారోపణ,మత్స్యంగ్రహణం,నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహ్మాచార్యులు,కారంపూడి నర్సింహ్మాచార్యులు,కాండూరి వెంకటాచార్యులు,అర్చక బృంధం నిర్వహించగా కార్యక్రమంలో దేవస్ధానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత,అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి,జిల్లా కలెక్టర్ అనితా రామచంధ్రన్,రాచకొండ సిపి మహెశ్‌భగవత్,్భవనగిరి ఆర్‌డి ఓ భూపాల్ రెడ్డి,గుట్ట తహసిల్ధార్ రామకృష్ణ, ఏ ఈ ఓలు ఆకునూరి చంధ్రశేఖర్,దోర్బల భాస్కర్‌శర్మ,వేములు రామ్మోహన్,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో నేడు.
యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఆదివారం ఉదయం 11.00 గంటలకు ధ్వజారోహణం,సాయంత్రం 6.00గంటలకు భేరి పూజ,దేవతాహ్వాణం,హవణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.