సంపాదకీయం

నేతాజీకి న్యాయం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతాజీ సుభాస్ చంద్రుడు అమరుడు...అమరుడు అని చెప్పడం ప్రతీక-సింబాలిక్-మైన అభివర్ణన కాదు, భారత జాతీయ చారిత్రక జీవన వాస్తవం! ఈ వాస్తవం శనివారంనాడు మరోసారి సమావిష్కృతమైంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద దస్త్రాలను ప్రధాని నరేంద్ర మోదీ సార్వజనీకరించడం ఈ నూతన ఆవిష్కరణ! దేశరాజధానిలోని ఆధికారిక పురాపత్ర భాండాగారంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ దస్త్రాలను వెల్లడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంచలనాన్ని సృష్టిస్తోంది! నేతాజీ బ్రిటిష్ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా జరిపిన సమరం గురించి, క్రీస్తుశకం 1945 ఆగస్టు 18 తరువాత జరిగిన ఆయన జీవన ప్రస్థానం గురించి మళ్లీ చర్చ మొదలైంది. మరోవైపున రాజకీయపు రచ్చ కూడ మొదలైంది! కొందరు హర్షోల్లాసాలతో ఈ దస్త్రాలలోని-ఇంకా పూర్తిగా వెల్లడికాని అంశాలను చర్చిస్తున్నారు, మరికొందరు స్వయం స్వీకృత అపరాధ భావంతో రచ్చ చేస్తున్నారు? నూట పద్దెనిమిది ఏళ్ల క్రితం జనవరి 23న జన్మించిన నేతాజీకి శనివారం నూట పద్దెనిమిదవ జయంతి జరిగింది. ఆయనకు వర్ధంతి మాత్రం లేదు! అందుకే ఆయన అమరుడు, భారతీయ ఇతిహాసంలో మాత్రమే కాదు..్భరతీయుల హృదయ సీమలలో కూడ ఆయన సజీవంగా నడయాడుతునే ఉన్నాడు! ఆయనను జాతినేత-లీడర్ ఆఫ్‌ది నేషన్-గా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంద దస్త్రాలు వెల్లడి అయిన తరువాత శనివారం కోరారు! ఇది కోరిక కాదు, దశాబ్దుల పూర్వమే నిర్థారణ జరిగిపోయిన జాతీయ సత్యానికి పునరుద్ఘాటన! ఆయనను జాతినేతగా క్రీస్తుశకం 1930వ దశకంలోనే దేశ ప్రజలు గుర్తించారు! బ్రిటిష్ ముష్కర మూకలకు వ్యతిరేకంగా భారత జాతి జరిపిన సమరానికి పరాకాష్ఠ నేతాజీ, స్వాతంత్య్ర సమరయోధులందరిలోను ఆయన అగ్రగణ్యుడు! మరి ఆయనకు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయడం ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి? కాంగ్రెస్ వారు అభ్యంతరం చెప్పడం అందువల్ల అర్ధరహితమైన ఆత్మన్యూనతా పూరితమైన స్వభావానికి నిదర్శనం.. గుమ్మడి కాయలను దొంగిలించినవారు భుజాలను ఎందుకని తడుముకోవాలి! స్వాతంత్య్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన మరో మహానాయకుడిని అప్రతిష్ట పాలు చేయడానికై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడీ దస్త్రాలను బహిర్గతం చేస్తోందట! ఈ దస్త్రాలను ప్రభుత్వం కల్పించిందని, అవి నకిలీ పత్రాలని కూడ కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించడం విస్మయకరం! అవసరమైతే తాము న్యాయస్థానాలలో అభియోగాలను కూడ దాఖలు చేస్తామన్నది కాంగ్రెస్ వారు చెప్పిన మాట! దస్త్రాలలోని వాస్తవాలు బయటపెడితే కాంగ్రెస్ వారికి నష్టం ఏమిటి? నేతాజీ 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా కనబడకుండా పోయిన తరువాత ఆయన ఎక్కడ ఉన్నాడు? దేశానికి ఎందుకని తిరిగి రాలేదు! అన్న వాస్తవాలు బయటపడితే ఎవరికేమి కష్టం? ఈ దస్త్రాలవల్ల జవహర్‌లాల్ నెహ్రూకు అప్రతిష్ఠ కలుగుతుందని కాంగ్రెస్ వారు ఎందుకు భయపడుతున్నారు? అంటే అప్రతిష్ఠకు గురి అయ్యే కలాపాలను తమ మహానాయకుడు నెహ్రూ 1946వ 1964వ సంవత్సరాల కాలంలో నిర్వహించాడని కాంగ్రెస్ వారే భయపడుతున్నారా?
నేతాజీ సోదరుడు సురేశ్ చంద్రబోస్ వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా 1962లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ వ్రాసిన ఉత్తరం ఇప్పుడు బయటపడింది! నేతాజీ 1945 ఆగస్టు 18న జరిగినట్టు ప్రచారం అవుతున్న విమాన ప్రమాదంలో మరణించలేదన్నది 1962 నాటికే ధ్రువపడిన అంశం! అందువల్లనే ఇతర జాతీయ నాయకులకు జరిగినట్టుగా నేతాజీకి భారత ప్రభుత్వం వర్థంతిని జరుపలేదు! తథాకథిత విమాన ప్రమాదంలో సుభాస్ చంద్రుడు మరణించినట్టు తాను విశ్వసించడం లేదని, ఆయన జీవించి ఉన్నట్టుతన అంతరంగం చెబుతుందని మహాత్మాగాంధీ 1945లోనే చెప్పిన మాట! కాంగ్రెస్ పార్టీ వారు కాని మరే రాజకీయ పార్టీ వారు కాని నేతాజీకి వర్ధంతిని జరపలేదు. అందువల్ల ఆయన మరణించలేదన్న వాస్తవాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో పార్టీవారు విశ్వసించారన్నది దశాబ్దుల క్రితం స్పష్టమైపోయింది. అందువల్ల, సుభాస్ సోదరుని ఉత్తరానికి సమాధానంగా నేతాజీ మరణించాడని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు అని జవహర్‌లాల్ నెహ్రూ సమాధానం వ్రాయడం సహజం! ఆ ఉత్తరం ఇప్పుడు వెల్లడైంది. 1965లో నేతాజీ కుటుంబ సభ్యులు అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీకి వ్రాసిన మరో ఉత్తరం కూడ వెల్లడైంది! ఇలా వెల్లడి కావడం పట్ల నేతాజీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వారికి అభ్యంతరం ఎందుకు?
వెల్లడయినవి నకిలీ పత్రాలని అంటున్న కాంగ్రెస్ వారు నిర్లజ్జగా అబద్ధాలు చెబుతారన్నది స్పష్టమైంది! జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ఉత్తరం మాత్రమే నకిలీదా? ఆయన ఆ ఉత్తరం వ్రాయలేదా? సంతకం ఆయనది కాదా? లేక మొత్తం వంద ఫైళ్లు నకిలీవేనా?-కాంగ్రెస్ వారు చెప్పడంలేదు! జవహర్‌లాల్ నెహ్రూ వ్రాసిన ఉత్తరంలో ఆయనను అప్రతిష్ఠపాలుచేయగల కొత్త విషయాలు లేవు! ఆయన రావలసిన అప్రతిష్ఠ ఇదివరకే వచ్చింది! పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2015 అక్టోబర్ 18వ తేదీన నేతాజీకి సంబంధించిన అరవై నాలుగు ఫైళ్లను సార్వజనికం చేసింది! 1945 తరువాత నేతాజీ జీవించి ఉన్నాడని ఆ దస్త్రాల ద్వారా ధ్రువపడింది కూడ! జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం నేతాజీ కుటుంబ సభ్యులపై నిఘా వేసి ఉంచిందన్నది అక్టోబర్‌లో వెల్లడైన దస్త్రంలోని ప్రధాన సమాచారం! ఇలా నిఘా వేసి ఉంచడం జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం నేతాజీకి వ్యతిరేకంగా పనిచేసిందనడానికి నిదర్శనం. అందువల్ల నెహ్రూకు చెడ్డపేరు అప్పుడే వచ్చింది! ఇప్పుడు బయటపడిన నెహ్రూ ఉత్తరంలో అలాంటిదేమీ లేదు! అప్పుడు దస్త్రాల వెల్లడికి అభ్యంతరం తెలపని కాంగ్రెస్ ఇప్పుడెందుకని గగ్గోలు పెడుతోంది! నేతాజీ మరణించినట్టు స్పష్టమైన ఆధారాలు లేవని మాత్రమే నెహ్రూ భావించినట్టు ఆయన ఉత్తరం సారాంశం! మరి 1945లోనే నేతాజీ మరణించినట్టు కాంగ్రెస్ వారు ఇప్పుడు విశ్వసిస్తున్నారా?
నిజానికి భరతమాత వరాల బిడ్డడైన నేతాజీకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ప్రతినెల ఇరవై ఐదు చొప్పున దాదాపు వెయ్యి దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం సార్వజనికం చేయనున్నదట! కానీ రష్యాలోను, బ్రిటన్‌లోను జపాన్‌లోను నిక్షిప్తమై ఉన్న నేతాజీ సంబంధిత పత్రాలు వెల్లడయ్యే వరకూ ఆయనకు న్యాయం జరగదు! ప్రభుత్వ నిర్వాహకులు ఏ రాజకీయ పార్టీ వారయినప్పటికీ ఇన్ని దశాబ్దుల పాటు నేతాజీ పత్రాలు వెల్లడి కాకపోవడం ఆ జాతీయ వీరునికి జరిగిన అవమానం, జాతికి సిగ్గుచేటైన వ్యవహారం! ఇప్పుడైనా పత్రాలు వెల్లడి కావడం మొదలైంది. 1943లో స్వతంత్ర భారత ప్రధమ ప్రభుత్వం ఏర్పడింది. అది ప్రవాస ప్రభుత్వం కావచ్చుగాక! ఆ ప్రభుత్వ అధినేత సుభాస్ చంద్రుడు. ఈవాస్తవం ప్రాతిపదికగా స్వాతంత్య్ర చరిత్రను పునర్‌నిర్మించాలి! స్వతంత్ర భారత్‌కు తొలి అధినేత నేతాజీ అన్న వాస్తవం ఆధికారికంగా రావాలి!