విశాఖపట్నం
విశాఖపట్నం, జూన్ 3: సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా, ఏవిధమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కల్యాణ మండపాలపై జివిఎంసి కనె్నర్రచేసింది. కనీస సదుపాయాలే కాదు ప్రమాదాలు సంభవిస్తే బయటపడే ప్రత్యామ్నాయాలు లేని 24 కల్యాణ మండపాలను మూసేయాలంటూ అధికారులు తాఖీదులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భద్రతా ప్రమాణాలు పాటించని కల్యాణ మండపాలను 48 గంటల్లోగా మూసివేయాలని ఆదేశించినట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ సోమవారం తెలిపారు. జివిఎంసి పరిధిలోని హనుమంతవాకలోని లక్ష్మీనారాయణ ఫంక్షన్‌హాల్, పిఎం పాలెం జామి ఫంక్షన్‌హాల్, ఉషోదయ జంక్షన్‌లోగల ఉషోదయ ఫంక్షన్‌హాల్, ఐశ్వర్య ఫంక్షన్‌హాల్, మయూరి ఫంక్షన్‌హాల్, పద్మశ్రీ ఫంక్షన్‌హాల్, ఎంవిపి కాలనీ సెక్టార్ 6లోగల జమ్మిస్ ఫంక్షన్‌హాల్, ఇసుకతోటలోని అపూర్వ ఫంక్షన్‌హాల్, టౌన్‌కొత్తరోడ్డు సమీపంలోని కర్లపాటి రాధాకృష్ణ ఫంక్షన్‌హాల్, నటరాజ్ ఫంక్షన్‌హాల్, సూర్యాబాగ్‌లోని శ్రీశుభం ఫంక్షన్‌హాల్, మెయిన్‌రోడ్డులోని శ్రీశ్రీనివాస కల్యాణ మండపం, అక్కయ్యపాలెం, న్యూకాలనీ, మర్రిపాలెం ప్రాంతాల్లోని గౌరీ కల్యాణ మండపాలు, కైలాసపురంలోని సీతారామ కల్యాణ మండపం, మాధవరధారలోని కనకదుర్గ కల్యాణ మండపం, ఆర్‌అండ్‌బి సమీపంలోని నాయుడు కల్యాణ మండపం, మర్రిపాలెంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్, గాజవాకలోని మోహిని ఫంక్షన్‌హాల్, శ్రీబాలాజీ కల్యాణ మండపం, ఎన్‌ఎడి జంక్షన్‌లోని సాయివిల్లా కల్యాణ మండపం, గోపాలపట్నంలోని వైష్ణవి కల్యాణ మండపం, ప్రహ్లాదపురంలోని అరుణ కల్యాణ మండపం వీటిలో ఉన్నాయి. ఈకల్యాణ మండపాల నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవని, కొన్నింటికి పార్కింగ్ స్థలాలు అందుబాటులో లేవని గుర్తించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కల్యాణ మండపాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనే పరికరాలు లేవని అధికారులు గుర్తించారు. వీటిని తక్షణమే మూసేయాల్సిందిగా ఆదేశించినట్టు కమిషనర్ తెలిపారు.
జననమరణ ధృవీకరణకు ప్రత్యేకమేళా
నగరంలోని అన్ని జోన్లలో జననమరణ ధృవీకరణ వివరాల నమోదు, పత్రాల జారీ వంటి అంశాల్లో ప్రజానీకం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వీటిని సరిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జననమరణ ధృవీకరణ, పత్రాలు జారీకి సంబంధించి ఈనెల 10 జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక మేళా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పాత కౌన్సిల్‌హాల్‌లో జననమరణ ధృవీకరణ మేళా ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
పచ్చదనం పెంపునకు వుడాతో ప్రణాళిక
నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు విశాఖ నగరాభివృద్ధితో కలసి ప్రత్యేక ప్రణాళికను చేపట్టనున్నట్టు కమిషనర్ తెలిపారు. నగర పరిధిలోని వుడా, జివిఎంసి, రెవెన్యూకు చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆరు జోన్లలో 166 పార్కులు, 361 ఖాళీస్థలాలు, 427 ట్రాఫిక్ ఐలాండ్స్, 483 రోడ్డు సెంట్రల్ డివైడర్లు, 880 చెరువులు, కుంటల్లో మొక్కలు పెంచనున్నట్టు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పక్కాప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే బిఆర్‌టిఎస్ రహదారి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మెట్రోరైల్ ప్రాజెక్టునకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చును భరిస్తాయని తెలిపారు. మెట్రోరైల్ ప్రాజెక్టులో భాగంగా ఒక కిలోమీటరు మార్గం ఏర్పాటు చేసేందుకు 250 కోట్లరూపాయలు ఖర్చవుతుందని తెలిపారు.
Add new comment