ఈ వారం కథ

ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే ఎనిమిదైంది. నా ఖర్మ కాకపోతే ఇవాళే సమయం ఇలా పరిగెత్తాలా? అనుకుంది ప్రభావతి. కోడలు అనన్య ఇంకా ఇంటికి రాలేదు. ఇన్నాళ్లూ అంతగా పట్టించుకోని కొడుకు హరి ఇవాళెందుకో రెండు, మూడుసార్లు- ‘ఇంకారాలేదా? రోజూ ఇలాగే వస్తోందా’ అని అడిగాడు. ఇవాళ హరి త్వరగా వచ్చాడు. అందుకే ప్రభావతికి దడగా వుంది. ఈ పిల్ల త్వరగా వస్తే బాగుండు అనుకుంటూ వీధి చివరకు చూసింది. ఆవిడకి తెలుసు- తనకున్న భయంలో కాసింత కూడా అనన్యకి ఉండదని. హరి హాల్లో కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నా, అతడి ధ్యాసంతా భార్య కోసమేనని ప్రభావతి గ్రహించింది. తలుపు రెక్క ఒకటి తెరిచి అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని రోడ్డువైపు చూస్తోంది ఆవిడ.
రెండ్రోజుల క్రితం టీవీలో చూసిన సంఘటన ఆవిడ మనసులో ఆందోళన కలిగిస్తోంది. స్నేహితులుగా ఉంటూనే రాత్రిపూట పార్టీనుంచి వస్తూ ‘లిఫ్ట్’ ఇస్తామంటూ ఓ మహిళ పట్ల కొందరు మగాళ్లు పశువుల్లా ప్రవర్తించిన ఘటన అది.
అప్పటిదాకా వర్షం కురిసి ఆగిందేమో చల్లగాలి వీస్తోంది. చీకటి పడినా శ్రావణమాసం అవడం చేత, అందులోనూ శుక్రవారం అవడంతో ఆడవాళ్లు, పిల్లలు పేరంటానికి వెళ్లొస్తూ కాలనీలో సందడిగా తిరుగుతున్నారు. భర్త పోయాక ప్రభావతి ఎక్కడికీ వెళ్లడం లేదు కానీ, శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలు ఎవరో ఒకరింటికి పేరంటానికి వెళ్లివస్తూ, కబుర్లు చెప్పుకుంటూ కాలనీలో సందడిగానే తిరిగేది. కోడలొచ్చాక నోములు చేయించి నలుగురు పేరంటాళ్లని పిలిచి వాయినాలు ఇప్పిస్తే సరదాగా వుంటుందని ఆశపడింది. ఆదిలోనే హంసపాదన్నట్టు కాపురానికి రాగానే కోడలి వేషధారణతో ప్రభావతికి మతిపోయింది. మెడలో మంగళసూత్రాలు బీరువాలో దాచేసి, మ్యాచింగ్ అంటూ చీర రంగుకి సరిపడే పూసల దండ వేసుకుని ఆఫీస్‌కి బయలుదేరిన కొత్తకోడల్ని చూసి విస్తుబోతూ అడిగింది. ‘మంగళసూత్రం ఏదమ్మా?’ అని.
‘ఉందిలెండి.. దాచిపెట్టాను లోపల’ అంది నిర్లక్ష్యంగా అనన్య.
‘లోపల దాచడం ఏంటమ్మా తప్పుకదా’ అందావిడ ఆగలేక.
‘నేను మంగళసూత్రాలు, నల్లపూసలు తీయగానే మీ అబ్బాయికి ఏదన్నా అవుతుందని భయమా? మీరేం కంగారు పడకండి. ఆయనకే కాదుగా నూరేళ్ల జీవితం నాకూ కావాలి. మరి నా ఆయుష్షు పెరగడానికి మీ అబ్బాయేం చేయాలి?’ అంది నవ్వుతూ. ఆ మాటలు గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి ప్రభావతికి.
ప్రభావతికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు గిరి, అతని భార్య ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకిద్దరు పిల్లలు. రెండో కొడుకు హరి డాక్టర్. కోడలు అనన్య ప్రభుత్వ సంస్థలో పర్సనల్ ఆఫీసర్‌గా చేస్తోంది. కొడుకులిద్దరివీ ప్రేమ వివాహాలే. పెళ్లిళ్లు తన చేతులమీద చేసి పెద్దరికం నిలుపుకుంది ప్రభావతి. ప్రభావతి భర్త హనుమంతరావు అకౌంటెంట్‌గా చేసేవాడు. అతను చనిపోయి ఎనిమిదేళ్లయింది. ఇరవై ఏళ్ల క్రితమే స్థలం కొని ముచ్చటైన ఇల్లు కట్టించాడు. ఉద్యోగరీత్యా దూరంగా వుంటున్నా గిరికి తల్లి అన్నా, తమ్ముడన్నా అంతులేని ప్రేమ. హరికి కూడా తల్లన్నా, అన్నగారన్నా గౌరవం. గిరి భార్య విదిత కూడా మంచి పిల్ల. ఆమె చదువే కాదు, సంస్కారం కూడా ఉన్నతమైందే. అత్తవారింట్లో అందరినీ అభిమానిస్తుంది.
అనన్య కోడలిగా వచ్చాక శాంతి మాయమవుతున్నట్లుగా అనిపిస్తోంది ప్రభావతికి. అనన్య స్వభావం ఆ ఇంట్లోవారికి పూర్తిగా భిన్నం. తాను చేయదల్చుకున్నది ఎవరు వద్దన్నా చేస్తుంది, ఇష్టం లేకపోతే ఎవరు చెప్పినా చేయదు. ఇంటికి పెద్ద దిక్కయిన ప్రభావతి ఏదన్నా చెప్పబోతే ‘మీకెందుకండీ అనవసర విషయాలు, నాకు తెలుసు- ఏం చేయాలో, ఏం చేయకూడదో’ అంటుంది. చాలా విషయాల్లో భార్య ఏం చేసినా హరి ఏమీ అనకపోగా, తల్లి ఏమన్నా అంటే- ‘పోనీలేమ్మా.. తను చిన్నదేకదా ఏవో సరదాలుంటాయి వదిలెయ్’ అని భార్యనే వెనకేసుకొస్తూ వచ్చాడు. సాధారణంగా అనన్య రోజూ ఆఫీసు నుంచి ఆలస్యంగానే వస్తుంది. ఇంట్లో అటు గ్లాసు ఇటు పెట్టదు. ఇంటికి రావడం ఆలస్యం కావడంతో ఓ రోజు ప్రభావతి- ‘ఏంటమ్మా లేట్ అయింది’ అని అడిగింది.
‘అవుతుందండీ.. ఒకసారి బైటికెళ్లాక టైమ్ మన చేతుల్లో వుంటుందా? అయినా.. ఆఫీస్ కాగానే ఇంటికొచ్చి ఏం చేయమంటారు? కాసేపు స్నేహితులతో గడిపే హక్కు లేదా?’ అనేసరికి ఆవిడ తెల్లబోయింది.
‘అదేంటమ్మా.. ఆడపిల్లవు అలా వెళ్లడం ఏంటి?’ అని అడిగితే- గయ్యిమని లేచిన అనన్య- ‘ఆడపిల్లవు అది చేయకూడదు, ఇది చేయకూడదని ఇంకోసారి అనకండి.. నాకు చిర్రెత్తుకొస్తుంది. ఆడపిల్ల మనిషి కాదా? మీ అబ్బాయి బార్‌కి వెళ్లచ్చు కానీ నేను రెస్టారెంట్‌కి వెళ్లకూడదా’అంది. దాంతో ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. చాలా తక్కువగా హరి పార్టీలకి వెళ్తాడు. వెళ్లినా సభ్యతకోసం ఒకే పెగ్గు తాగుతాడు. అలాంటి హరి గురించి ఇలా అంటుంటే బాధగా అనిపించింది ఆవిడకి.
‘నా స్వేచ్ఛని ప్రశ్నించేవాళ్లంటే నాకు మంట. ఇంకోసారి నా స్వవిషయాల్లో కలగచేసుకోకండి..’ అంటూ అల్టిమేటమ్ ఇచ్చింది. కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వని కోడలి స్వభావంతో ఆవిడకి దిగులు పట్టుకుంది. ఆదివారం వస్తే చాలు. ‘వీకెండ్ ఎంజాయ్ చేయాలి? బయట భోంచేసి, సినిమాకో ఏదన్నా అవుటింగ్‌కి వెడదాం’ అని భర్తతో అనన్య అంటుంది. హాస్పటల్‌లో ఏదన్నా పనుండి అతను ‘ఇవాళ వద్దు.. ఇంకోసారి వెడదాం’ అని అనకూడదు. ‘నువ్వు వెళ్లు.. నాకు పనుంది’ అని అనకపోతే అదో రభస. అలాంటప్పుడు ఒక్కటే వెళ్లిపోతుంది. అది పగలైనా, రాత్రైనా సరే.
‘అసలే రోజులు బాగాలేవు. ఆడపిల్ల అర్ధరాత్రి, అపరాత్రి తిరగడం ఏంటిరా’ వణికిపోతూ అంటుంది ప్రభావతి కొడుకుతో. ‘దానికి లేని భయం నీకెందుమ్మా? తను చాలా ధైర్యస్థురాలు. నీ మానాన నువ్వు భోంచేసి పెందలాడే పడుకో, ఆరోగ్యం పాడుచేసుకోకు’ అంటాడు హరి. ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ప్రశాంతంగా పడుకోగలదా?
అనన్య నెలకు నాలుగైదుసార్లు షాపింగ్‌కి వెళుతూ ఒకటో, రెండో చీరలు కొంటుంది. అయినా ఎవరూ అడక్కూడదు. ఒకసారి సరదాకి అడిగాడు హరి ‘ఏంటి అనన్యా.. నీ జీతం మొత్తం చీరలు కొనేస్తావా?’ అని.
‘నా జీతం నా ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకునే హక్కు లేదా? ప్రతిదీ నీకు చెప్పి చేయాలా? నిన్ను అడుగుతున్నానా? నీ సంపాదన ఏం చేసావు’ అంటూ ఓ రోజు ఆమె కడిగిపారేసరికి హరికి కన్నీళ్లు ఒక్కటే తరువాయి. ఆ రాత్రి హరి హాల్లో టీవీ చూస్తూ తెల్లవార్లూ గడిపినా అనన్య గదిలోంచి బైటికి రాలేదు, ‘సారీ’ చెప్పి సంధి ప్రయత్నాలూ చేయలేదు. అయినా మర్నాటి నుంచీ హరి మామూలుగానే వున్నాడు.
ఇదంతా చూస్తుంటే ప్రభావతికి భయమేస్తుంటుంది. ‘నాకెందుకులే’ అని ఊరుకున్నా, పెద్దరికం మాత్రం- ‘చెప్పకపోవడం నీ బాధ్యతారాహిత్యం..’ అని హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వేచ్ఛ ముదిరితే విచ్చలవిడితనం అవుతుందన్న వాస్తవం అనన్య విషయంలో జరుగుతోంది. హరిలో సహనం చచ్చిపోతోంది. వారానికి నాలుగుసార్లు పార్టీలు, గెట్ టు గెదర్‌లు అంటూ అనన్య ఇంటికి ఆలస్యంగా వస్తోంది. ఆలస్యంగా వచ్చినపుడల్లా ఎవరో ఒకరు బైక్‌మీదో, కారులోనో దింపడం, అది చుట్టుపక్కలవాళ్లు గమనించడం ప్రభావతికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ‘పొద్దుపోయాక పరాయి మగాడితో బండిమీద రావడం మర్యాద కాదమ్మా, మనం మధ్యతరగతి వాళ్లం, ఎటొచ్చి ఎటుపోయినా మనకే నష్టం’ అంది.
‘బండెక్కగానే వాడితో లేచిపోతున్నట్టా? స్నేహానికి ఆడా, మగా ఏంటండి? కాలంతోపాటు మీరు మారకపోయినా ఫర్వాలేదు, మమ్మల్ని వెనక్కి లాక్కండి’ అంటూ అత్తగారిని అనన్య ఎడాపెడా దులిపేసింది.
అయినా ఆ విషయం ప్రభావతి హరికి చెప్పలేకపోయింది. అననే్య తను చేసింది ఘనకార్యం అన్నట్టుగా చెప్పేయడంతో మొదటిసారిగా భార్యపై పిచ్చికోపం వచ్చింది హరికి. సీరియస్‌గా అడిగాడు- ‘మా అమ్మని అంత మాట అనేముందు నీకు కొంచెం కూడా బుద్ధి పనిచేయలేదా?’ అని.
‘నాకు బుద్ధి పనిచేయలేదా? అని అడుగుతున్నావా? నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వెప్పుడూ నీతో పనిచేసే లేడీ డాక్టర్స్‌కో, నర్సులకో లిఫ్ట్ ఇవ్వలేదా? నేను ఎవరితో బండిమీద వెళితే వాళ్ళతో నాకు అఫైర్ ఉన్నట్టేనా?’ రెచ్చిపోతూ అడిగింది.
‘నమ్మకం లేదా? అని బాధపడేముందు మనం నమ్మకం కలిగేలా ప్రవర్తిస్తున్నామా? అని ఆలోచించుకోవాలి. మన నమ్మకాలు కాదు ఇక్కడ ముఖ్యం, చుట్టుపక్కల వాళ్ళ గురించీ ఆలోచించాలి. సమాజానికి దూరంగా బతకడం లేదు కదా! ఇంటి పెద్ద, అత్తగారు అయిన ఆవిడను గౌరవించడం నేర్చుకో. స్వేచ్ఛని నియంత్రించడం నా ఉద్దేశం కాదు. అర్థం చేసుకుంటావని చెప్తున్నా’ అన్నాడు.
‘మీ అమ్మని ఒక్కమాట అన్నందుకు నాకు ఇన్ని సూక్తులు చెప్తున్నావంటే నీకు నా మీద కన్నా మీ అమ్మ సిద్ధాంతాలమీద గౌరవం అన్నమాట. నా మీద నమ్మకం లేని భర్తతో నేనెందుకు కలిసి బతకాలి?’ తీవ్రంగా అంది. అనన్య అంతలేసి మాటలు అనడంతో హరి,ప్రభావతి నిర్ఘాంతపోయారు. ఆ రాత్రి కూడా వౌనంగా హాల్లో పడుకున్నాడే కానీ ఏమీ మాట్లాడలేదు హరి.
ఆ రోజునుంచీ ఇదంతా దేనికి దారితీస్తుందో, వీళ్ల సంసారం ఏం అవుతుందో అని భయపడుతోంది ప్రభావతి. అనన్య ధోరణిలో ఇంకా మార్పు రాకపోగా, ఇవాళ తొమ్మిది అవుతున్నా ఇంటికి రాలేదు. శుక్రవారం వరలక్ష్మి పూజ అని నలుగురు పేరంటానికి కోడలిని పంపమని చెప్పి వెళ్లినా, ఈ పిల్లకి ఏమీ పట్టదు అనుకుంది ప్రభావతి నిట్టూరుస్తూ.
ప్రభావతి పెళ్లికాకముందు కొంతకాలం టీచర్‌గా ఉద్యోగం చేసింది. కానీ, సంప్రదాయాలను, అత్తమామలను గౌరవించింది. భర్త కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోకపోయినా కష్టసుఖాలు పంచుకునే స్నేహితుడిగా ప్రేమించింది. చుట్టుపక్కల వారితో స్నేహ సంబంధాలు కలుపుకోవడానికి నోములు, వ్రతాలు చేసింది. ఇప్పటిలా అప్పుడు పుట్టినరోజని, పెళ్లిరోజని, ఇంకో రోజని పార్టీలు చేసుకునేవాళ్లు కాదు. పెళ్లిళ్లు, సీమంతాలు, పూజలు వంటివి మాత్రమే నలుగురినీ ఒక దగ్గర చేర్చేవి. ఇవాళ హరి ఎందుకో కోపంగా ఉన్నాడు. సహజంగా అతడికి కోపం రాదు. వచ్చిందంటే దాని పరిణామం ఊహించడం కష్టమే. ఏదో జరుగుతుందని ఆందోళన చెందడం కన్నా, వౌనంగా ఉండడమే ఉత్తమమని ఆలోచిస్తూ ప్రభావతి తన గదిలోకి వెళ్లిపోయి మంచంపై వాలింది.
***
బయట కారాగిన శబ్దం. ‘బై.. గుడ్‌నైట్..’ అంటూ అనన్య స్వరం.
‘గుడ్‌నైట్..’ అంటూ ఓ వ్యక్తి చెప్పాక- కారు కదిలిన శబ్దం.
‘అనన్యా..!’ అంటూ అరిచాడు హరి. అయినా ఆమె ఏ సమాధానం చెప్పలేదు.
‘ఎక్కడికెళ్లావు?’ అని భర్త ప్రశ్నించినా ఆమె నుంచి జవాబు లేదు.
‘ఎక్కడికెళ్లావు ఇప్పటిదాకా? టైమెంతో తెలుసా?’ కొంచెం తీవ్రంగా అడిగాడు.
‘అబ్బా.. ఏంటి నీ దబాయింపు? నీ భార్యనా? ఇంటి నౌకరునా?’ అంది.
‘నువ్వెందుకు నౌకరు అవుతావు? నీకు అన్నీ అందించే మా అమ్మే నౌకరు అవుతుంది. ఎక్కడికెళ్లావో నా ప్రశ్నకి సమాధానం చెప్పు’
‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’
‘వినాల్సిన అవసరం నాకుంది’
‘నా స్వేచ్ఛని ప్రశ్నిస్తున్నావా?’
‘స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి చర్చించాలనుకోవడం లేదు. గతంలో మన మధ్య గొడవలు జరిగినపుడు చాలాసార్లు వెనక్కి తగ్గాను. ఇప్పుడు సహనం చచ్చిపోయింది. దేనికైనా కొన్ని లిమిటేషన్స్ వుంటాయి’.
‘నేను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నానా?’
‘హద్దులేమిటో, అవి ఎందుకో చదువుకున్నదానివి.. నీకు చెప్పవలసిన అవసరం లేదు. భర్తగా నాకు నీ పట్ల హక్కుల సంగతెలా వున్నా బాధ్యతలున్నాయని అడుగుతున్నాను. జవాబు చెప్పడం బాధ్యత అని నువ్వు అనుకుంటే చెప్పు’.
‘చెప్పను, ఏం చేస్తావు?’
‘చేయడానికి ఏం ఉంది? ఇన్నాళ్లు ఏం చేసాను?’
‘నేను ఆధునిక యువతిని, సంపాదనాపరురాలిని. మొగుడి అదుపాజ్ఞల్లో ఉండే అవసరం నాకు లేదు. నేనిలాగే ఉంటాను. నీకు ఇష్టమైతే కలిసి ఉందాం, లేదంటే విడిపోదాం. ప్రతిరోజూ ఈ తగాదాలు, నిర్బంధాలు భరించలేను’.
‘నీ నిర్ణయం అదే అయితే- రేపటిదాకా ఎందుకు? ఈ క్షణమే విడిపోదాం.. మనల్ని విడదీయడానికి లాయర్ అవసరం లేదు.. ఒక్క ద్వారం చాలు.. ద్వారం దాటితే నువ్వెవరో, నేనెవరో..’
‘నన్ను ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నావా? నీకెంత పొగరు? ఇది నీ ఇల్లనేగా? ఇపుడే వెళ్తున్నా.. వెళ్లిపోవడమే కాదు.. పెళ్లి చేసుకోబోయే ప్రతి ఆడపిల్లకూ చెప్తాను. పెళ్లి అయిన వెంటనే అత్తారింటికి వెళ్లద్దు.. నీకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాకే పెళ్లిచేసుకో అని.. ఇక గుడ్‌బై..’
***
‘అనన్యా.. వెళ్లవద్దమ్మా.. వెళ్లకు..’ గట్టిగా అరిచింది ప్రభావతి.
‘అమ్మా.. ఏమైంది నీకు?’ హరి కుదుపుతుంటే బలవంతంగా కళ్లు తెరిచింది ప్రభావతి.
‘ఏమైంది? ఏదన్నా పీడకలా?’ ఆవిడ మీదకు ఒంగి ఆప్యాయంగా అడిగాడు హరి.
ఆవిడ నాలుగు వైపులా చూస్తూ ‘అ.. అనన్య..’ అంది.
‘అనన్యని పిలవనా?’ అంటూ హరి తలెత్తేసరికి గుమ్మంలో నిలబడి ‘ఏమైంది?’అని అడుగుతోంది అనన్య.
ప్రభావతి అనన్య వైపుచూసి కన్నీళ్లతో అంది ‘అనన్యా నువ్వు ఎక్కడికీ వెళ్లవద్దమ్మా.. ఈ ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లవు కదూ...’’
అనన్య ఆవిడ మంచం వద్దకు చేరుకుని వింతగా అడిగింది- ‘నేను వెళ్లడం ఏంటండి? ఎక్కడికి వెళ్తాను? ఇది నా ఇల్లు.. నేనెక్కడికి వెళ్తాను?’
అనన్య మాటలకి తెల్లబోతూ కొడుకువైపు చూసింది.
‘అనన్యా.. అమ్మకేదో పీడకల వచ్చినట్టుంది... నిద్రలోంచి లేచింది కదా... కొంచెం వేడి పాలు తెస్తావా?’ అని హరి అనడంతో వంట గదివైపు వెళ్లింది అనన్య.
చెక్కిళ్లమీద కన్నీళ్లు కారిపోతుంటే ఆవేదనగా అడిగింది ప్రభావతి- ‘మీరిద్దరూ గొ..డ..వ..’
ఆవిడ మాటల్ని మధ్యలో ఆపేస్తూ నవ్వుతూ అన్నాడు హరి ‘మేం గొడవ పడతామేమోనని ఆలోచిస్తూ పడుకున్నావా?’
‘నువ్వూ, కోడలు.. వి డా కు లు..’
‘మేం విడాకులు తీసుకుంటున్నట్టు కల వచ్చిందా? అయ్యో.. అమ్మా.. అయినా విడాకులివ్వాల్సినంత తప్పేం చేసింది అనన్య...’’
కొడుకువైపు చూసింది అయోమయంగా ప్రభావతి. ‘నువ్వేం కంగారు పడకమ్మా.. ఏమీ జరగదు. ఇదంతా స్వతంత్రభావాల సంఘర్షణ, ఇదొక ఆధునిక జీవన పోరాటం.. ఇందులో ఎవరూ గెలవరు, ఎవరూ ఓడరు.. ఈ పోరాటం కొందరి జీవితాల్లో చివరిదాకా సాగుతూ ఉంటుంది, కొందరి జీవితాల్లో మధ్యలో సమసిపోతుంది. మా జీవితంలో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అందాకా వౌనంగా చూస్తూ ఉండు, నేనూ చూస్తూ వుంటా’’.
అనన్య తెచ్చిన పాలగ్లాసును తీసుకుని తల్లి నోటికి అందిస్తూ అన్నాడు, ‘పాలు తాగి ప్రశాంతంగా పడుకో.. సరేనా?’ ఆవిడ నిస్తేజంగా చూస్తూ గ్లాసు అందుకుంది. ‘తాగమ్మా’ అన్నాడు హరి తననే చూస్తున్న తల్లితో. ఆమె ఒక్కో గుక్కా తాగుతూ ఆలోచించసాగింది. తను కల కన్నదా? వాళ్లమధ్య ఏ గొడవా జరగలేదా? అనన్య ఆలస్యంగా వచ్చినా హరి ఏమీ అనలేదా? అనన్య వెళ్లిపోతుందని భయపడ్డాడా? లేక తను బాధపడతానని అబద్ధం చెబుతున్నాడా? ఆవిడ చూపులు గోడ గడియారం వైపు తిరిగాయి. అర్ధరాత్రి పనె్నండు దాటి పదిహేను నిమిషాలైంది. అంటే తను నిద్రపోయింది. మంచంమీద వాలగానే నిద్రపోయిందన్నమాట. కల వచ్చిందన్న మాట. మరి అనన్య ఆలస్యంగా వచ్చిందిగా.. హరికి కోపం వచ్చినా ఏమీ అనలేదా?
ఆవిడ చేతిలో గ్లాసు అందుకుంటూ అన్నాడు మృదువుగా హరి, ‘అమ్మా లైటార్పేస్తున్నాను.. అనవసరమైన ఆలోచనలు, ఆందోళన పెట్టుకోకుండా హాయిగా నిద్రపో. నువ్వు ఆందోళన పడినంత మాత్రాన జరిగేది జరక్కమానదు’.
ఆవిడ ప్రశ్నార్థకంగా అతని మొహంలోకి చూసింది. భుజాలు పట్టి ఆవిడ్ని పడుకోబెట్టి తలగడ సరిగా జరిపి, బ్లాంకెట్ కప్పి ‘గుడ్‌నైట్ అమ్మా’ అంటూ లైటార్పి గదిలోంచి వెళ్లిపోయాడు. అతన్ని అనుసరించింది అనన్య.
సోఫాలో ఉన్న తలగడా, బెడ్‌షీట్ తీసుకుని అనన్యతోపాటు గదిలోకి నడుస్తూ అన్నాడు హరి ‘అమ్మ ఇంకా పడుకుని వుండదు. కలకీ, వాస్తవానికీ తేడా వెతుకుతూ మెలకువగానే ఉంటుంది. కలని మర్చిపోయి వాస్తవాన్ని తట్టుకునే శక్తి తెల్లారేసరికి ఆవిడకివ్వమని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రాత్రికి ఇక్కడే నేలమీద పడుకుంటాను’. బెడ్‌షీట్ పరిచి తలగడ వేసుకుని వాలాడు హరి. వాస్తవానికీ, కలకీ వున్న దూరం కొలవడానికి ప్రయత్నిస్తూ మంచం అంచున నిశ్చలంగా కూర్చుండిపోయింది అనన్య.
*

-అత్తలూరి విజయలక్ష్మి