నల్గొండ

ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 8: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కేంద్రంలో మోడీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది పథకాలను చేపట్టి అమలు చేస్తున్నదనీ కేంద్ర మానవ వనరుల అభివృద్దిశాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జవదేకర్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో పర్యటించి, నియోజక వర్గ స్థాయి జిల్లా అధ్యక్షులు, పదాదికారుల సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్ధేశం గావించారు. అనంతరం పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశప్రజల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అదే సమయంలో పార్టీ బలోపేతానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో కార్యచరణ చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. నరేంద్రమోడీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆమోదం తెలుపుతూ ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్, అస్సాం, మణిపూర్, చండీఘడ్ రాష్ట్రాలలో విజయాన్నందించాలని అదే విధంగా దక్షిణ రాష్ట్రాలలో పార్టీని విస్తరించి బలోపేతం చేసే దిశగా పోలింగ్ బూత్‌ల వారి సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. 2019 సంవత్సరంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేసేందుకు పార్టీకీ దిశా నిర్ధేశం చేస్తున్నామన్నారు. మండల స్థాయిలో సమస్యలను పరిష్కరించి గ్రామాలలో పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నిల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు కార్యచరణ చేపట్టినట్లుగా ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి ఎల్పీజీ గ్యాస్, ప్రతి ఇంటిలో ఎల్‌ఈడీ బల్బ్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు కొరత లేకుండా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్రాల పట్ల వివక్షత పాటించకుండా నిధులు మంజూరు చేస్తుందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిధులను దారిమళ్ళించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర సంక్షేమ పథకాలు లభ్ధిదారులకు చేరుతున్నాయన్నారు. ఫసల్ భీమాయోజనతో 1.5లక్షల మంది రైతులు పంట నష్టాన్ని తిరిగి పొందారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేస్తూ, రైతులకు అండగా ఉంటూ అట్టడుగు వర్గాల అభివృద్దికి అవకాశాలు కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గృహ వసతిలేని వారికి 9000 ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి లబ్ధిదారులకు చేరకుండా అడ్డుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను అవమానించిందన్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ, ఇంటింటికీ ఉద్యోగం కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను కొనసాగిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మూస్లీం మైనార్టీ రిజర్వేషన్ బిల్లును ముందుకు తెచ్చిందని విమర్శించారు. ఎంఐఎం కనుసన్నలలో నడుస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యామ్నాయమని ఎట్టి పరిస్థితుల్లోను ముస్లీం మైనార్టీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటామని హెచ్చరించారు. మంత్రి జవదేకర్ పర్యటనలో భాగంగా దళిత కుటుంబానికి చెందిన బీజేపీ కార్యకర్త మేడి కోటేష్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జవదేకర్ మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ముద్ర రుణాలను పొంది అభివృద్ది చెందాలని వీధి వర్తకులను కలిసి వివరించారు.

భూనిర్వాసితులకు అన్యాయం జరుగనివ్వం
అందరికీ మెరుగైన పరిహారం..పునరావాసం :ఎంపి గుత్తా, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఏప్రిల్ 8: డిండి ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్ల నిర్మాణాలతో భూములు, ఇళ్లు, తోటలు నష్టపోతున్న రైతులందరికి, కూలీలకు ఎటువంటి అన్యాయం జరుగనివ్వబోమని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలు భరోసానిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో డిండి ఎత్తిపోతల పథకంలోని గొట్టిముక్కల, శివన్నగూడెం, కిష్టరాయిపల్లి, చింతపల్లి, సింగరాజుపల్లి రిజర్వాయర్ల భూనిర్వాసితుతో వారు భేటీ అయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్‌లతో కలిసి వారి నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతు 2013చట్టం మేరకు లేదా జీవో 38మేరకు నిర్వాసితులకు మేలైన పరిహారం అందిస్తామన్నారు. ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజిలో ఎంత లాభం వస్తే అంత రైతులకు మేలు చేస్తామన్నారు. నిర్మాణాలు, చెట్లకు పరిహారం చెల్లించేందుకు సర్వే జరిపించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పెండింగ్‌లో ఉన్న అసైన్డ్ భూములకు నష్టపరిహారాన్ని వారం రోజుల్లోగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కొన్ని భూములకు ఎకరాకు 4లక్షల 25వేల చొప్పున చెల్లించారని, గొట్టిముక్కలలో 4లక్షల రూపాయలు చెల్లించారని దీనిపై కోర్టులో కేసు వేశారని తీర్పును అనుసరించి తదుపరి చర్యలు తీసుంటామన్నారు. డిండి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు, ఇండ్లు కోల్పోతున్న వారి జాబితాను అందచేయాలని వారికి ఇతర శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో 1863ఎకరాల భూసేకరణ చేయాల్సివుండగా ఇప్పటికే 1083ఎకరాలు భూసేకరణ చేశారన్నారు. 225ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయని వాటికి నష్టపరిహారం కోసం సింగరాజుపల్లిలో ఎకరాకు 4లక్షల 15వేలు ఇచ్చారని, గొట్టిముక్కల గ్రామంలో 4లక్షలు మాత్రమే ఇచ్చారని వారికి కూడా 4లక్షల 15వేలు చెల్లించాలని గొట్టి ముక్కల గ్రామస్తులు కోరుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతు గొట్టిముక్కల గ్రామంలో రికార్డులు సరిగా లేనందునా 92ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయని, ఈ రికార్డులను తిరిగి పరిశీలించి వారికి నష్టపరిహారం అందిస్తామన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి పరిహరం చెల్లించేందుకు 58ఎకరాలకు క్లియరెన్స్ వచ్చిందని వారికి వారం రోజుల్లో పరిహారం చెల్లిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మాణంతో ముంపు గురయ్యే లింగన్నబావిగూడెం, పూతలరాంతండాలను వేరే చోటుకు తరలించవలసి ఉందని గ్రామాల్లో ప్రజలతో సమావేశం నిర్వహించి కమిటీని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో వారికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. వారు ఇంకోచోట ఇళ్లు నిర్మించుకుంటామంటే వారికి పరిహారం అందిస్తామన్నారు. చెట్లు, నిర్మాణాలు కోల్పోయిన వారికి ప్రతి ఇంటికి నెంబర్ వేసి నిర్మాణాల వివరాలు సర్వే చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, ఆర్డీలో లింగ్యానాయక్, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎస్‌ఈ, ఈఈలు, రెవెన్యూ, పంచాయితీ, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూ నిర్వాసితుల
ఆందోళన

మర్రిగూడ, ఏప్రిల్ 8: చెర్లగూడం రిజర్వాయర్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల ఆందోళన ఒక్కరోజు విరామం ఇచ్చి మళ్లీ కొనసాగింది. శనివారం కలెక్టర్ పనులను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్ పోలీసుల బందోబస్తుతో పనులను కొనసాగిస్తుండగా ఎంపీపీ అనంతరాజు గౌడ్ భూనిర్వాసితులతో అడ్డుకున్నారు. మర్రిగూడ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను మోహరించడంతో ఎంపీపీతో పాటు నిర్వాసితులను అరెస్ట్‌చేసి మర్రిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నర్సిరెడ్డిగూడంలో మహిళలకు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోకుండా కాంట్రాక్టర్ తమ ఇష్టానుసారంగా తమ మీద పెత్తనం చెలాయించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం చెల్లించే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడితే తిరుగుబాటు తప్పదని వెల్లడించారు.

నీటి సంరక్షణ మనందరి బాధ్యత
ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత నిర్మించుకుందాం
మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 8: నీటి సంరక్షణ మనందరి బాధ్యత అని రేపటి తరానికి మంచి భవిష్యత్‌ను ఇచ్చేందుకు సంకల్పించి జలం మనం-జలనిధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సి అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. సురేంద్రమోహన్ అధ్యక్షతన జలం మనం- జలనిధి కార్యక్రమంపై సూర్యాపేట నియోజకవర్గంలోని ఎంపిపిలు, ఎంపిడివోలు, జెడ్పిటిసిలు, ఈజీ ఎస్ ఏపివోలు, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, సర్పంచ్‌లు, అభ్యుదయ రైతులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి జలనిధి లక్ష్యాలపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించి ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి రైతుకు సేద్యపు కుంట, ప్రతి ఇంటికి ఇంకుడుగుంట నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను సన్నదం చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గత సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వలన భూగర్భ జలాలు 5మీటర్లు పెరిగినప్పటికి రైతులు ఎక్కువగా వరి వేయడం వలన నీటి వాడకం పెరిగి అక్కడక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. భూగర్భంలోకి ఇంకే నీటి కంటే ఎక్కువగా తీసుకోవడం వలన జలాలు అడుగంటిపోతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం చేయాలని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, వేయి సంవత్సరాల నాటి గొలుసుకట్టు చెర్వులను పునరుద్దరించేందుకు మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని అమలుచేయడం జరుగుతుందన్నారు. సంమృద్దిగా వర్షాలు పడినప్పటికి సేద్యం పెరిగి నీటి వినియోగం పెరగడంతో భూగర్భ మట్టాలు అడుగంటాయని, పరిస్థితిని మార్చే శక్తి మనలోనే ఉందని పడిన ప్రతి వర్షాపు చుక్కను భూమిలోకి ఇంకే విధంగా పొలంలో కందకాలు తీసుకోవాలన్నారు. ఇది సమిష్టిగా జరిగినప్పడే ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధి హామీ నిధులతో రైతుల పొలాల్లో కందకాలు, ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలు ఏర్పాటుచేసుకోవడం బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో జలనిధి సృష్టించుకొని సూర్యాపేటను జలనిధి నియోజకవర్గంగా అభివృద్ది చేసేందుకు అంకితభావంతో పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. నిజాం కాలంలో చేలలో కుంటలు నిర్మించుకుంటే భూమిశిస్తు రద్దుచేసేవారని, వర్షపు నీటిని సంరక్షించే చర్యలు వేల సంవత్సరాల నుండే మన రైతులు ఆచరించరన్నారు. గ్రామాల్లో మురుగుకాల్వలు అవసరం లేదని, ఇంట్లో వాడిననీటిని, వర్షపు నీటిని భూమిలోకి పంపేందుకు ఇంకుడుగుంటను ఏర్పాటుచేసుకోవాలన్నారు. జలం మనం- జలనిధి కార్యక్రమం అమలులో భాగంగా నియోజకవర్గంలోని 8 గ్రామాలను మొదటగా ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశ్రాంత ఇంజనీరింగ్ నిపుణులు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రమణనాయక్, ఐఐటి ప్రొఫెసర్ శ్యాంసుదర్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఓ. నర్సింహ్మారెడ్డిలు ఈ సదస్సులో వర్షపునీటిని వడిసిపట్టుకోవడం వలన భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయనే అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒక గ్రాము ఆహార పదార్దం తయారుకావాలంటే ఒక లీటర్ నీరు అవసరమని ప్రతి మనిషికి తాగేందుకు సంవత్సరానికి దాదాపు 1500లీటర్ల నీరు అవసరమవుతుందన్నారు. పంటలకు ఎక్కువ నీరు అవసరమని, వర్షపు నీరు వృదాగా ప్రవహిస్తే సారవంతమైన మట్టి కొట్టుకుపోతుందన్నారు. వర్షపు నీటిని భూగర్భంలోకి పంపడం వలన భూసారం పెరుగుతుందన్నారు. నీటి సంరక్షణ, యాజమాన్య పద్దతులు పాటించడం వలన తక్కువ వర్షపాతం ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో, ఇజ్రాయిల్ దేశంలో రైతులు లభ్దిపొందుతున్నారన్నారు. రైతు అస్తిత్వం పండించే పంటలపైనే ఆధారపడి ఉంటుందని వినియోగదారుగా మారే వ్యక్తి రైతు కాలేడన్నారు. కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ పొలాల్లో కందకాల నిర్మాణంపై రైతులకు క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటుచేయనున్నామని ఈనెలాఖరు వరకు ప్రతి మండలంలో 100 ఎకరాల్లో కందకాల నిర్మాణాలు పూర్తిచేయాలని ఎంపిడివోలను ఆదేశించారు.

రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
వరి ధాన్యానికి ఖచ్చితమైన మద్ధతు ధర
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఏప్రిల్ 8: ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు తెరాస ప్రభుత్వం ప్రొత్సాహాన్నందిస్తుందని రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెరాస ప్రభుత్వంలోనే రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలును కేంద్రాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపిపి బట్టు అరుణఅయిలేష్, జెడ్పీటిసి శేపూరి రవీందర్, సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మిసైదులు, మార్కెట్ కమిటి అధ్యక్షురాలు గోదుమగడ్డ పద్మజలంధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్రా మోహన్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ధాన్యం బస్తాలను తూకం వేసి కొనుగోళ్ళను ప్రారంభించారు. గోనేసంచుల్లో నింపిన ధాన్యంను ఎమ్మెల్యే కాంటాపై తూకం వేశారు. ధాన్యం కుప్పల వద్దకు వెళ్ళి ధాన్యంను తేమశాతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, నాణ్యమైన పరిశుబ్రమైనటుంవంటి ధాన్యాన్ని తీసుకువచ్చి మద్ధతును పొందాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి ఖచ్చితమైనటువంటి మద్ధతు ధరను పొందాలని, ప్రైవేటు వ్యక్తుల వద్ద ధాన్యాన్ని విక్రయించి రైతులు నష్టపోవద్దన్నారు. వ్యవసాయాన్ని సాగుచేసే రైతులకు తెరాస ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. దేశానికి వెన్నముకయిన అన్నదాతలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు గత ప్రభుత్వాలు అందించిన సహకారంకంటే ఎన్నోరెట్లు అదనంగా తెరాస ప్రభుత్వం ఇస్తుందన్నదన్నారు. వ్యవసాయం దండగ అనకుండా వ్యవసాయం పండగ అనే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భూములన్నీ పచ్చని పంట పొలాలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తున్నారని వ్యవసాయంపై మక్కువ కలిగే విధంగా కృషిచేస్తున్నారన్నారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని తెరాస ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి భూముల్లో సాగుజరగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి తగిన మద్ధతు ధరను పొందాలన్నారు. కొనుగోళ్ళలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోబడిందని గోనెసంజులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్, సింగిల్‌విండో పాలకవర్గ సభ్యులు, రైస్‌మిల్లర్లు, తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు.

రాజీ మార్గమే మంచిది
జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి తిరుమలరావు
నల్లగొండ లీగల్, ఏప్రిల్ 8: కక్షిదారులు లోక్ అదాలత్‌లో రాజీ పడి తమ కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయంతో పాటు డబ్బు ఆదా చేసుకోవచ్చని వివాదాల్లో రాజీ మార్గమే అందరికి రాజమార్గమని జిల్లా జడ్జీ డి.తిరుమలరావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణం న్యాయసేవాసదన్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమతీర్పు అని అప్పిల్స్ ఉండవని, అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరుపార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లోని కక్షిదారుల మధ్య కౌన్సిలింగ్ అనంతరం ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ కోర్టులలో 3,189కేసులు, నల్లగొండ కోర్టు పరిధిలో 1571కేసులను పరిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఐ.శైలజాదేవి, కె.కల్యాణ్‌చక్రవర్తి, ప్రశాంతి, రజని, రాణి, డిఎస్పీ సుధాకర్, సిఐ శ్రీనివాసులు, బార్ అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.యాదయ్య, కె.శ్రీనివాసులు, న్యాయవాదులు లెనిన్‌బాబు, ఎన్. భీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.