నల్గొండ

నత్తనడకన మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 25: మిషన్ భగీరథ పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర జాప్యంతో సాగుతున్నాయి. గ్రామాల్లో ఇంట్రావిలేజ్ పనుల్లో భాగమైన పైప్‌లైన్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ల కొరత, వివిధ శాఖల మధ్య సమన్వయం లోపం, నిధుల సమస్యలతో మిషన్ భగీరథ స్లో మిషన్ మూడ్‌లో సాగుతుండగా నేటికి 20శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇలాగైతే వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటి సరఫరా చేసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్న సీఎం కెసిఆర్ హామీ అమలు అసాధ్యమన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,880కోట్ల అంఛనా వ్యయంతో నాలుగు విభాగాలుగా మిషన్ భగీరథ పనులు డిజైన్లు మార్పులు చేర్పులతో ఖారారు చేశారు. ఇందులో నాగార్జున సాగర్ టేయిల్ పాండ్ బ్యాక్ వాటర్ స్కీమ్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్కీమ్, నల్లగొండ పానగల్ ఉదయ సముద్రం స్కీమ్, కాళేశ్వరం ప్రాజెక్టు స్కీమ్‌లుగా మిషన్ భగీరథను నాలుగు విభాగాలుగా నిర్మించి ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు ఇంటింటికి తాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా 2,498కోట్ల పనులు పూర్తయినా ఇంట్రావిలేజ్ పనుల్లో జాప్యం మిషన్ భగీరథను స్లో మిషన్‌గా మారుస్తుంది.
ప్రస్తుత నల్లగొండ జిల్లాలోని మిషన్ భగీరథలో 1691జనావాసాలకు ఇంటింటికి మంచినీటిని అందించేందుకు 1492వాటర్ ట్యాంకులు నిర్మించాల్సివుండగా వీటిలో 1257ట్యాంకుల పనులు పురోగతిలో ఉన్నట్లుగా అధికారులు కాగితాల్లో లెక్కలు చూపారు. నిజానికి వీటిలో 20శాతం పనులు కూడా చేపట్టలేదని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపి గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌లు కుండబద్ధలు కొట్టారు. పురోగతిలో ఉన్న పనుల్లో అధిక శాతం గుంతలు, ఫిల్లర్ల స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ జిల్లా పరిధిలో మొత్తం 2,766కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 231కిలోమీటర్ పైప్‌లైన్ మాత్రమే పూర్తయ్యింది. 3లక్షల 26,609ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సివుండగా 12,632కనెక్షన్లు ఇచ్చినట్లుగా కాగితాల్లో లెక్కలు చూపుతున్న ఒక్కటి కూడా క్షేత్ర స్థాయిలో ఇవ్వలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 325వాటర్ ట్యాంకులకు 139ప్రగతిలో ఉండగా 188పనులు పూర్తయ్యాయి. 1088పైప్‌లైన్ నిర్మాణానికి 763కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తయ్యింది. సూర్యాపేట జిల్లాలో 744ట్యాంకులకుగాను 278ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది.
నల్లగొండ ఉపవిభాగంలోని కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలాల్లో 132ట్యాంకులకుగాను ఒక్కటి పూర్తికాలేదు, 263కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 21కిలోమీటర్లు ప్రగతిలో మాత్రమే ఉండటం గమనార్హం. నల్లా కనెక్షన్ల జాఢ లేదు. మునుగోడు ఉప విభాగంలో చండూరు, నాంపల్లి, మర్రిగూడ, మునుగోడు మండలాల్లో 179ట్యాంకులకు 164ప్రగతిలో ఉండగా ఒక్కటి పూర్తి కాలేదు, మెజార్టీ ట్యాంకులు పునాది స్థాయిలో ఉన్నాయి. 442కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 50.50కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు. నకిరేకల్ ఉప విభాగంలో కేతెపల్లి, నకిరేకల్, శాలిగౌరారం, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో 256ట్యాంకులుకుగాను 218ప్రగతిలో ఉన్నట్లుగా లెక్కలు చూపిన క్షేత్ర స్థాయిలో అధిక శాతం గుంతలు, ఫిల్లర్ల దశలోనే ఉన్నాయి. 473కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 31కిలోమీటర్లు పైప్‌లైన్ల పనులు ప్రగతిలోనే ఉన్నాయి. హాలియా ఉపవిభాగంలో త్రిపురారం, నిడమనూర్, గుర్రంపోడు, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాల్లో 259ట్యాంకులకుగాను 208ప్రగతిలో ఉన్నట్లుగా కాగితాల్లో ఉన్న క్షేత్ర స్థాయిలో 30ట్యాంకులు కూడా తుది దశలో లేవు. 581కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 31కిలోమీటర్లు మాత్రమే ప్రగతిలో ఉన్నాయి. మిర్యాలగూడ ఉప విభాగంలో వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి మండలాల్లో 264ట్యాంకులు నిర్మించాల్సివుండగా 257ప్రగతిలో ఉన్నట్లుగా చూపగా, 489కిలోమీటర్ల పైప్‌లైన్‌కు 37కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు ప్రగతిలోనే ఉన్నాయి. 20శాతం పనులు కూడా పూర్తి చేయలేదని సాక్షాత్ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తప్పుబట్టారు. దేవరకొండ ఉప విభాగంలో పిఏపల్లి, కొండమల్లెపల్లి, చింతపల్లి, నేరడుగొమ్ము, చందంపేట, దేవరకొండ మండలాల్లో 403ట్యాంకులకుగాను 310ట్యాంకులు పురోగతిలో ఉండగా వీటిలో సైతం 40ట్యాంకుల పనులే కొనసాగుతున్నాయి. మిగతావన్ని అగ్రిమెంట్ పూర్తయి, గుంతలు, ఫిల్లర్ల దశలోనే ఉన్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్పష్టం చేయడం ఇంట్రావిలేజ్ పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్మాణా పనుల జాప్యానికి నిదర్శనం.
పంప్‌హౌజ్‌లు, శుద్ధి కేంద్రాల పనుల్లో మెరుగు
మిషన్ భగీరథలో టెయిల్ పాండ్ నుండి మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజవర్గాలకు తాగునీటిని అందించే 1485కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయి. టేల్‌పాండ్ రిజర్వాయర్ సమీపంలో ఇన్‌టెల్ నిర్మాణం, అవంతిపురం వద్ధ నీటి శుద్ధి ఫ్లాంట్ పనులు పూర్తికావచ్చాయి. ఇన్‌టెక్ వెల్ నుండి అవంతిపురం శుద్ది ఫ్లాంట్ వరకు 47కిలోమటర్ల పొడవు ప్రధాన పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌజ్ పనులు 80శాతం పూర్తవ్వగా, మోటార్ల బిగింపు ప్రక్రియ పురోగతిలో ఉంది. చేపట్టారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ స్కీమ్‌లో సైతం పంప్‌హౌజ్, శుద్ధి ఫ్లాంట్ పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున లీకేజీలు అధికారులకు పరీక్ష పెడుతున్నాయి. ఉదయ సముద్రం వద్ధ పంప్‌హౌజ్ పూర్తయ్యింది. ఇంట్రావిలేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.