నల్గొండ

అటవీ భూముల్లో రూ.4కోట్లతో పార్కు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 20: చౌటుప్పల్ ఏరియాలోని అటవీ శాఖ భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రూ.4కోట్ల వ్యయంతో అన్ని హంగులతో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ వెల్లడించారు. మండలంలోని లక్కారం శివారులో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. పార్కు అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేశారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్నారు. మధ్యలో ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా అటవీ శాఖకు చెందిన 50 హెక్టార్ల భూముల్లో పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. సుమారు 10 వేల మొక్కలను పెంచాలని నిర్ణయించామన్నారు. చౌటుప్పల్ పట్టణం ఆగస్టు నుంచి మున్సిపాలిటీ అవుతుండటంతో పార్కు అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు పేర్కొన్నారు. పార్కు అభివృద్ధిలో భాగంగా వాకింగ్, సైక్లింగ్ కోసం ఐదు కిలోమీటర్ల వేను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా యోగా కోసం ప్రత్యేక షెడ్‌ను నిర్మిస్తున్నామన్నారు. మండల ప్రజలతో పాటు జాతీయ రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు పార్కు ఉపయోగపడుతుందన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీ 68 శాతం పూర్తి అయ్యిందన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షా 56వేల రైతుబంధు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా లక్షకు పైగా పంపిణీ చేశామన్నారు. 11వేల పాస్ పుస్తకాలలో జరిగిన తప్పులను సరిచేశామన్నారు. సవరించే పనులు జరుగుతున్నాయన్నారు. రెండవ విడత పాస్ పుస్తకాలు మండల కార్యాలయాలకు చేరుకున్నాయని వివరించారు. రైతుబంధు చెక్కుల కాలం చెల్లిపోతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో తేదీని పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్, అటవీశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ షేక్‌అహ్మద్, ఎంపీడీవో రజితారెడ్డి, ఫారెస్ట్ రేంజర్ సర్వేశ్వర్, అధికారులు వెంకట్రాములు, రమేష్ తదితరులు ఉన్నారు.

ఆయల్ ఫెడ్ చైర్మన్‌గా కంచర్ల
మోత్కూరు, జూలై 20: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఆయిల్ ఫెడ్) చైర్మన్‌గా టీఆర్‌ఎస్ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్పగూడెంకు చెందిన కంచర్ల రామకృష్ణారెడ్డి టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. 1995లో మోత్కూరు సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేసిన కంచర్ల రామకృష్ణారెడ్డి సీపీఐ నుండి 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా 2003వరకు పనిచేశారు. జనసాధన సమితి మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ బ్రిగేడియర్‌గా పనిచేశారు. 2002 నుండి 2009 వరకు పాత రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు. 2003 నుండి 2017 వరకు టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ తరపున 2014 ఎన్నికల్లో జనగాం, పాలకుర్తి ఇన్‌చార్జిగా 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తపేట ఇన్‌చార్జిగా పనిచేసిన కంచర్ల రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేశారు. ప్రస్తుతం కంచర్ల రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. కంచర్లకు రైతు సమస్యలపై ఉన్న అనుభవాన్ని, పార్టీ అభివృద్ధికి ఇన్నాళ్లుగా అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆయనకు ఆయిల్ ఫెడ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడం విశేషం.