నల్గొండ

ఘనంగా ఉగ్రనారసింహుని నిత్య కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూలై 20: యాదగిరిగుట్ట శ్రీ ఉగ్రనారసింహస్వామి వారి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలు, అర్చనలు, అభిషేకం, హవనము, పుణ్యాహవచనము, విశ్వక్‌సేన ఆరాధన, ఊంజల్ సేవ కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి మంగళహారతి నివేదన చేశారు. బిందెతీర్థం, బాలభోగం కార్యక్రమాలతో ఆలయ నిత్య కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతంతో అభిషేకం చేసి అర్చించారు. వివిధ సుగంధ పరిమళాల పూలమాలలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే దర్శనామూర్తులను స్వర్ణపుష్పాలతో అలంకరించారు. అత్యంత సుందరంగా అలంకరించిన గజవాహనంపై స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోత్తరం, సహస్రనామార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆండాళమ్మకు ఊంజల్ సేవ..
అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం ఆండాళమ్మ వారిని కొలుస్తూ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ఆరాధిస్తూ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆండాళమ్మ వారిని పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల సుగంధ పరిమళాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి, అత్యంత సుందరంగా అలంకరించిన ముత్యాల పల్లకిపై అమ్మవారిని అలంకృతం చేసి ఊంజల్ సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన సేవ ఉత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా పూజారులు అమ్మవారికి హారతి నివేదన చేశారు.

ఆగస్టులో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన
- వౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వద్దు - టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటనరసింహారెడ్డి

చౌటుప్పల్, జూలై 20: ఆగస్టు చివరి వారంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన జరుగుతుందని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరక్టర్ వెంకటనరసింహారెడ్డి వెల్లడించారు. మండలంలోని దండుమల్కాపురం శివారులో సుమారు 1200 ఎకరాలలో కాలుష్య రహితంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కులో రూ.36కోట్లతో జరుగుతున్న వౌలిక సదుపాయాల పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సుమారు ఐదారు కిలోమీటర్లు గుట్టల ప్రాంతంలో పర్యటించారు. ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు జరుగుతాయన్న విషయంపై సమగ్రంగా పరిశీలించారు. అధికారులతో సమీక్ష జరిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. భూసేకరణపై ఆర్డీవో సూరజ్‌కుమార్‌తో చర్చించారు. వీలైనంత తొందరగా భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు పదవ తేదీ వరకు ఇండస్ట్రీయల్ పార్కు రోడ్డుకు బీటీ పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఆగస్టు మూడవ వారం వరకు అన్ని వౌలిక సౌకర్యాలు పూర్తి చేసుకోని చివరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్ జ్యోతి, జిల్లా మేనేజర్ నాగరాజు, ఆర్డీవో సూరజ్‌కుమార్, ఆర్‌ఐ సైదిరెడ్డి, ఆర్డీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, వీఆర్వో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.