నల్గొండ

ఘనంగా శ్రీఉగ్రనారసింహుని అష్టోత్తర ‘శతఘటాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఆగస్టు 17: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాదగిరిగుట్ట శ్రీ ఉగ్రలక్ష్మినరసింహస్వామి పంచనారసింహ క్షేత్రంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రంలో శుక్రవారం ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం, నిత్యారాధనలు, భక్తుల అర్జిత సేవలు, విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహవచనం, హవనం, మొదలగు కార్యక్రమాలు జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి స్వామి, అమ్మవార్లకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. శతఘటాభిషేకం కార్యక్రమంలో భాగంగా 108 కళషాలలలో పవిత్ర గంగాజలం, సుగంధ ద్రవ్యాల పొడిని నింపి షోడషోపచారాలతో పూజలు నిర్వహించి కళషాభిషేకం పూజ అనంతరం స్వామి, అమ్మవార్లను అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి, అమ్మవార్లను వివిధ రకాల సుగంధ పరిమళాల పూలమాలలు, పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దర్శనామూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించి అర్చించారు. అనంతరం స్వామివారి ఆలయ మహా మండపంలో కల్యాణానికి ముందు స్వామి, అమ్మవార్ల ఎదుట విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహవచనం, శ్రీసుదర్శన నారసింహ హోమాది కార్యక్రమాలను అర్చకులు, వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆండాళమ్మకు ‘ఊంజల్ సేవ’
పంచ లక్ష్మినారసింహస్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజున ఆలయంలో సాయంత్రం శ్రీ ఆండాలమ్మ వారిని పూజిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి ఆరాధిస్తూ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అత్యంత సుందరంగా అలంకరించిన పల్లకీ (ఊయల)లో అధిష్ఠింపజేసి ఊంజల్ సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పేట మున్సిపాలిటీకి మహర్దశ
* అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.81.4కోట్లు మంజూరు * జిల్లాకేంద్రంలో మెరుగుపడనున్న పారిశుద్ధ్యం

సూర్యాపేట, ఆగస్టు 17: నూతన పారిశుద్ధ్య విధానం అమలుతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సూర్యాపేట మున్సిపాలిటీలో మురికినీటి పారుదల వ్యవస్థను ఆధునీకరించేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తొలి విడతన జిల్లాకేంద్రంలో 29 కిలోమీటర్‌ల మేరా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సర్వే పనులు సైతం ఆరంభమయ్యాయి. మరో రెండు మాసాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన విద్యుత్‌శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి భారీగా నిధులు మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పట్టణంలోని సద్దులచెర్వుపై మినీ ట్యాంకుబండ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కూరగాయలు, మాంసం, చేపలు, ఇతర నిత్యావసర వస్తువులన్ని ఒకే చోట లభ్యమయ్యేలా మోడల్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. జిల్లాకేంద్రంగా మారిన తర్వాత రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పలు కూడళ్లను కూడా విస్తరించారు. ఈక్రమంలో పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు గాను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించడంతో పాటు దశాబ్దాలుగా నత్తనడక సాగుతున్న నాలా నిర్మాణాన్ని సైతం పూర్తిచేయాలని సంకల్పించారు. ఈక్రమంలో గత ఆరు మాసాల క్రితం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా అసంపూర్తిగా నిలిచిపోయిన నాలా పనులను చేయించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిపాదనలు అందించారు. ఈమేరకు రూ.81.4కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు నాలా విస్తరణ, మురికినీటి శుద్ధిప్లాంట్‌ను నిర్మించనున్నారు.
మొదలైన సర్వే
మున్సిపాలిటీ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలో మురికినీటి కాల్వలు మొత్తం సుమారు 800 కిలోమీటర్లు ఉన్నట్లు మేర ఉన్నట్లు భావిస్తుండగా తొలిదశలో 29కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో రూ.7కోట్ల నిధులతో నాలా విస్తరణ పనులు ప్రారంభించినా కేవలం 500 మీటర్ల మేర మాత్రమే పనులు జరిగి ఆ తర్వాత నిలిచిపోయాయి. తాజాగా మంజూరైన నిధులతో అసంపూర్తిగా ఉన్న పెద్ద నాలా నిర్మాణ పనులను పూర్తిచేయడంతో పాటు పుల్లారెడ్డి చెర్వు, నల్ల చెర్వుల వద్ద నాలుగు ఎకరాల స్థలంలో మురికినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. శుద్ధిచేసిన మురికినీటిని పక్కనే ఉన్న చెర్వులోకి వదలనున్నారు. అంతేకాకుండా నాలా సమీప ప్రాంతాలు భారీ వర్షాలు వచ్చిన సమయంలో నీట మునగకుండా ఈప్రాంతంలో రెండుకిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు చేపట్టేల ప్రణాళికలు రూపొందించారు. రోడ్డుకు ఇరువైపులా కాకుండా భూగర్భం నుండి ఒక్కటే డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేలా సర్వే చేపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాయన్స్ కంపెనీ వారు ఇందుకు సంబంధించిన సర్వేను వారం రోజుల క్రితం ప్రారంభించారు. పట్టణమంతా సమగ్రంగా సర్వే చేసి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
త్వరలోనే పనులు ప్రారంభం
* మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక
సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. సర్వే పూర్తికాగానే డిజైన్‌ను ఖరారుచేసి వెంటనే పనులు ప్రారంభిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే పట్టణ రూపురేఖలు మారిపోతాయి. మున్సిపల్ అభివృద్ధికి మంత్రి జగదీశ్‌రెడ్డి చేస్తున్న సహకారం మరువలేనిది.