నల్గొండ

అన్నదమ్ముల చేరో మాట..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇచ్చిన పదవులతోనే గెలుపునకు కృషి చేస్తా: వెంకట్‌రెడ్డి
* జైలుకెళ్లి వచ్చిన నాయకులకు సైతం పెద్ద పదవులా?: రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ, సెప్టెంబర్ 20: టీ.కాంగ్రెస్ ఎన్నికల విభాగాల కమిటీల ఏర్పాటుపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఒకే రోజు గురువారం వేర్వేరు చోట్ల భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిపెస్టో కమిటీ కోచైర్మన్‌గా, పబ్లిసిటీ కమిటీ కన్వీనర్‌గా నియామితులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం పట్టణంలో ర్యాలీతో హంగామా చేసి విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కమిటీల్లో తనకు అప్పగించిన బాధ్యతల పట్ల రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీల్లో సరైన బాధ్యతలు దక్కకపోయినా టీఆర్‌ఎస్‌ను గద్దె దించే లక్ష్యంతో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. తాను ఏడాదిన్నర క్రితం పీసీసీ చీఫ్ పదవి కోరానని, ఆ పదవి ఇస్తే రాష్టమ్రంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని భావించానన్నారు. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీ బాధ్యతలు అప్పగించారని, పదవులతో నిమిత్తం లేకుండా పార్టీ గెలుపుకు పనిచేస్తానని, వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి కోరికల మేరకు ప్రజామ్యానిఫెస్టో రూపొందిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తానన్నారు.
ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ కమిటీల కూర్పుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం పెద్ద అంబర్‌పేట్‌లో తన మద్దతుదారులతో రహస్యంగా నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాదరణ లేని, ఎన్నికల్లో గెలువలేని నాయకులను కమిటీల్లో స్థానం కల్పించారని విమర్శించారు. కమిటీల ఏర్పాటులో లోటుపాట్లపై కుంతియాను నిలదీశానన్నారు. శనిలాగా టీ.కాంగ్రెస్‌కు కుంతియా పట్టారని విమర్శించారు. ప్రజల కోసం, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే తాను ఎవరికి భయపడబోనన్నారు. గ్రామాల్లో వార్డు మెంబర్‌గా కూడా గెలువలేని వారికి కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారని మండిపడ్డారు. నిన్న మొన్న పార్టీలో చేరి జైలుకెళ్లి వచ్చిన నాయకులకు సైతం పెద్ద పదవులు కట్టబెట్టారన్నారు. ప్రజల్లో బలం, ఆదరణ ఉన్నవారికి టీ.కాంగ్రెస్ కమిటీల్లో స్థానం దక్కక అన్యాయం జరిగిందన్నారు. గాంధీ భవన్‌లో కూర్చుని ప్రెస్‌మీట్‌లు పెట్టేవారిని కాకుండా ప్రజల్లో బలమున్న నాయకులను, తెలంగాణ కోసం కోట్లాడిన నాయకులను, పార్టీని గెలిపించే నాయకులకు పదవులు, టికెట్లు ఇవ్వకుండా బ్రోకర్లకు, పైరవీకారులకు ఇస్తున్నారన్నారు. ప్రజల్లో తిరిగి ఎవరి బలమెంతో కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటుంటే పార్టీ నాయకులు మాత్రం పక్కన పెడుతున్నారన్నారు. రెండున్నర సంవత్సరాలుగా తమను అవమానిస్తున్నా మునుగోడు కార్యకర్తలు వచ్చి పోటీ చేయమంటే ప్రజల మధ్యకు వచ్చామన్నారు. ఇకనైనా పార్టీ పెద్దల తీరు మారకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగబడుతారన్నారు.

యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్యారాధనలు, ఆర్జీత సేవలు, లక్షపుష్పార్చనలు నిత్య కల్యాణం శాస్తయ్రుక్తంగా సాగాయి. వేకువ జామున స్వామిఅమ్మవార్లను సుప్రభాతంతో మేల్కొలిపి ఆరతి నివేధన చేసి, బిందెతీర్థం, బాలభోగంతో నిత్యకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు జరిపి అత్యంత సుందరంగా అలంకరించారు. తులసీదళాలతో అర్చించారు. దర్శనమూర్తులను స్వర్ణ పుష్పాలతో కొలిచారు. మహామండపంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గజవాహనసేవ నిర్వహించి నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్రగమశాస్త్రానుసారం నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహావఛనం, శ్రీ సుదర్శన నారసింహహోమం కార్యక్రమాలు శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవంలో, అష్టోత్తర, సహస్రనామార్చన పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండి జోడి సేవ నిర్వహించారు. కాగా, లక్ష్మీనరసింహస్వామి వారికి హైద్రాబాద్‌కు చెందిన నెల్లుట్ల రామకిషన్‌రావు, వసంతకుమారి దంపతులు లక్ష 881రూపాయల విలుగల రెండు కిలోల 450 గ్రాముల వెండి రెండుబిందెలు, కలశం, చెంబు, రెండు తీర్థచెంచాలు బహూకరించారు.