నల్గొండ

సీఎం ప్రాజెక్ట్ సందర్శన బాట--- రైతన్నలో చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 1: తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ సాగుతాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సత్వర పూర్తికి ప్రాజెక్టుల సందర్శన బాట పట్టడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై జిల్లా వాసుల్లో ఆశలు రేపింది. జిల్లాలో సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసిన డిండి ఎత్తిపోతల పథకంతో పాటు గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఉదయ సముద్రం (బ్రాహ్మణవెల్లంల) ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టుల పెండింగ్ పనులపై ఉమ్మడి జిల్లా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు, వాటి కాలువలతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలు జిల్లా సాగుతాగునీటి వసతుల కల్పన దిశగా పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ సందర్శన, సమీక్షల పిదపనైనా నత్తనడకన సాగుతున్న ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల్లో కదలిక వచ్చి పనులు వేగవంతం కావాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు, తాగునీటి వసతి కల్పనకు 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ (ఎఎమ్మార్పీ) సొరంగం ప్రాజెక్టు పనులు 2010 కల్లా పూర్తికావాల్సివున్నా నేటికి ఆగుతుసాగుతునే ఉన్నాయి. తొలుత 2012కు ఒకసారి, 2017 డిసెంబర్, తదుపరి 2020 అక్టోబర్‌కు గడువు పొడగించారు. సొరంగం ఒకటిలో ఆగిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులన్ని చూస్తే అప్పట్లోగా కూడా పనుల పూర్తిపై సందేహాలున్నాయి. పనుల జాప్యంతో 2005లో కుదిరిన కాంట్రాక్టు ఒప్పందం రూ.1,925 కోట్ల అంచనా వ్యయం నుండి నేడు రూ.4200 కోట్లకు పెరిగింది. పెరిగిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం పొందినా నేటికి రూ.2202 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. సొరంగం-1 అవుట్, ఇన్‌లెట్ పనులు 43.93 కిలోమీటర్లు తవ్వాల్సివుండగా 32.68 కిలో మీటర్లు పూర్తయ్యాయి. మరో 11.52 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సివుంది. ఏడు నెలల క్రితం టనె్నల్ బేరింగ్ మిషన్ మరమ్మతులకు గురికాగా పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వాన్ని రూ.60 కోట్లు అడ్వాన్స్ కోరడంతో ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సొరంగం-2 పనులు 7.92 కిలోమీటర్లు పూర్తవ్వగా 5.10కిలోమీటర్ల లైనింగ్ సైతం పూర్తయింది. టీబీఎం మిషన్ రిపేర్‌తో పనులు ఏడునెలలుగా నిలిచిపోయాయి. మొత్తం 13ఏళ్లలో ఏడాదికి సగటున 2.50కిలోమీటర్ మాత్రమే తవ్వడం గమనార్హం. అంచనా విలువకు రూ.1400 కోట్ల మేరకు అదనంగా ఖర్చవుతున్నా పనులు పూర్తికావడం లేదు. ప్రస్తుతం టీబీఎం మిషన్ విదేశాల నుండి చెన్నై పోర్టుకు రాగా మరమ్మతు సామగ్రి, నిపుణులు రావాల్సి వుంది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ పనులు సైతం ఆలస్యంగా సాగుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగుతాగు నీరందించేందుకు 2007లో రూ.700 కోట్లతో చేపట్టిన ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు సైతం పూర్తి కాలేదు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పనుల్లో వేగం పెంచి ట్రయల్న్ వరకు వచ్చి ఆగారు. ప్రాజెక్టులో భాగమైన 10.62 కిలోమీటర్ల సొరంగం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన 1200 ఎకరాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, కుడి, ఎడమకాలువల నిర్మాణాలు పూర్తి కావాల్సివుంది. తొలివిడతగా 50వేల ఎకరాలకు నీరందిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినా ఎన్నికల ప్రక్రియతో పనుల్లో పర్యవేక్షణ కరువైంది.
అదేవిధంగా సీఎం కేసీఆర్ 2015 జూన్‌లో శంకుస్థాపన చేసిన ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామన్న హామీ నెరవేరడంలో తీవ్ర జాప్యం సాగుతోంది. దీంతో ఈ దఫా ప్రాజెక్టుల సందర్శనలో కాళేశ్వరం పిదప డిండి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తుండటంతో పనుల్లో వేగం తధ్యమని భావిస్తున్నారు. రూ.6.500 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి వచ్చే అర టీఎంసీ వరద నీటిని డిండికి మళ్లించి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు కృష్ణా సాగు, తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్లలో తరుచూ మార్పులు చోటుచేసుకోగా రిజర్వాయర్ల సంఖ్య, కాలువల దూరం పెరిగి ప్రస్తుతం 4.70 లక్షల ఎకరాల మేరకు సాగునీరందించాలని నిర్ధేశించారు. జిల్లాలో ప్రాజెక్టులో భాగంగా తొలుత చేపట్టిన శివన్నగూడెం, కిష్టరాంపల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి, చింతపల్లి రిజర్వాయర్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
మరోవైపు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కాళేశ్వరం నీళ్లను అందించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లు అసంపూర్తిగానే ఉండగా, కాలువల పనులు సగానికిపైగా పూర్తయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలకు జిల్లా పరిధిలో ఏటా గోదావరి నీటి కొరత ఏర్పడుతుండటంతో ఈ కాలువల పరిధిలోనికి ఆయకట్టుకు కూడా కాళేశ్వరం నీళ్లు అందించాలని డిజైన్ చేశారు. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టులతో పాటు జిల్లాలో సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన మూసీ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువల పొడగింపు పనులను సైతం పూర్తి చేయాల్సివుంది. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాటతో తమ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతమవుతాయన్న ఆశలు జిల్లా వాసుల్లో రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలి
* జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమర్
సూర్యాపేట, జనవరి 1: ప్రభుత్వ అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమోయ్‌కుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, మండలాల అధికారులు, పలు రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం 2019లో జిల్లాలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు కృషి చేయాలని కోరారు. రైతులకు ఈ సంవత్సరంలో అధిక దిగుబడులు సాధించాలని సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు. వౌలిక వసతులతో పాటు విద్య, ఆరోగ్య ప్రజలందరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్భంగా కేక్‌కట్ చేశారు. ఈ వేడుకలల్లో సంయుక్త కలెక్టర్ డీ. సంజీవరెడ్డి, డీఆర్‌డీఎ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి, వ్యవసాయ అధికారిణి జ్యోతిర్మయి, పరిశ్రమలశాఖ జియం బాబురావు, భూసర్వే అధికారి శ్రీనివాసులు, బీసీ సంక్షేమాధికారి జ్యోతి, ఉద్యానవనశాఖ అధికారి శ్రీ్ధర్, ఆర్డీఓలు మోహన్‌రావు, కిషన్, సమాచారశాఖ ఏడీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ షెడ్యూల్ విడుదల
మూడు విడతల్లో పోలింగ్
నల్లగొండ జిల్లాలో 844 పంచాయతీలకు ఎన్నికలు

నల్లగొండ, జనవరి 1: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మూడు వితడలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుండి ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి రానుంది. పోలింగ్ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు ముందుగా వార్డుల వారి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, తదుపరి సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, అదే రోజు ఉపసర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికలకు సంబంధించి జనవరి 7నుండి 9వరకు నామినేషన్ల స్వీకరణ, 10న పరిశీలన, 11 అప్పీల్, 12న పరిష్కారం, 13న ఉపసంహరణ, పోటీల ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడి ప్రక్రియ నిర్వహిస్తారు. రెండో విడతకు సంబంధించి 11నుండి 13వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 17న ఉపసంహరణ ఉంటుంది. మూడో విడతకు సంబంధించి 16 నుండి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 20న పరిశీలన, 21న ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా వెల్లడి ఉంటుంది. నల్లగొండ జిల్లాకు సంబంధించిన 844 పంచాయతీలకు, 7344 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 9లక్షల 31,319 మంది ఓటర్లు ఉన్నారు.
తొలి విడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు, రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీలకు, మూడో విడతలో నల్లగొండ రెవెన్యూ డివిజన్ మండలాల పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం నల్లగొండ జిల్లాలో 844పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, చందంపల్లి, చందుపట్ల, కడపర్తి, నెల్లిబండ, నోముల, తాటికల్, గుండ్లగూడెం పంచాయతీల పదవి కాలం ముగియ్యనందునా వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదు.

పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు
* పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా
హుజూర్‌నగర్, జనవరి 1: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచిపెట్టిన అనంతరం పత్రికల వారితో మాట్లాడారు. 2019లో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్రంలో మావంతు గట్టిగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాలలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని ఆయన అన్నారు. అన్ని మండలాలకు మండల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తారని, వీరు అన్ని గ్రామాలు పర్యటించి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయగా నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని 22 శాతానికి తగ్గించి అన్యాయం చేయటం బాధాకరమన్నారు. 2019లో ప్రజలందరికి మేలు జరగాలని, సుఖ, సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్దిస్తున్నట్లు చెప్పారు. పంటలు బాగా పండాలని, మద్దతు ధర వచ్చి రైతులు, కూలీల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితమవుతామని, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలు 5 సార్లు వరుసగా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను తమ కుటుంబంగా భావించి తమ శక్తి మేరకు మేలు చేస్తామని గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు వేగవంతగా పూర్తి చేయటానికి శాసనసభలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ప్రజాహిత కార్యక్రమాల్లో ఘర్షణ రహితంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని గతంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని భవిష్యత్‌లో కూడా కృషి చేస్తామని చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తాన న్నారు. అంతకు ముందు పలు మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జునరావు, మాజీ సర్పంచ్ గొట్టె రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరిలో పాస్‌పోర్టు సేవలు ప్రారంభం
పాస్‌పోర్ట్ సేవాకేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీ బూర నర్సయ్యగౌడ్
భువనగిరి, జనవరి 1: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాసుపోర్టు కేంద్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ బూర మాట్లాడుతూ జిల్లా ప్రజలు పాసుపోర్టు పొందేందుకు హైదరాబాద్‌కు వెళ్లే అవసరంలేకుండా సేవలను జిల్లా కేంద్రంలోనే పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సేవా కేంద్రాన్ని మంజూరు చేయించినట్లు తెలిపా రు. పాసుపోర్టు అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాస్‌పోర్టు పొందాలన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన గుర్తుచేశారు. తన హయాంలో 523 కిలోమీటర్ల జాతీయ రహదారుల ఏర్పాటుకు కృషిచేయడమేగాక, జాతీయ రహదారులలో ప్రమాదాల నివారణ కోసం అండర్‌పాస్‌ల నిర్మాణాలను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరిలో పాసుపోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటుచేయడం హర్షనీయమన్నారు. ఈ అవకాశాన్ని అవసరమున్న ప్రతి ఓక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో పోస్టల్‌శాఖ ఉన్నత అధికారులతోపాటు, మున్సిపల్ చైర్మన్ నువ్వుల ప్రసన్న, జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బర్రె మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నూతన సంబురాలు
కేక్ కట్ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యేలు
ఆలయాలు కిటకిట.. పూజల్లో కలెక్టర్ కుటుంబం
నల్లగొండ రూరల్, జనవరి 1: జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి 12గంటలు కాగానే పట్టణ యువత కేరింతలు కొడుతూ కేక్‌కట్ చేసి గత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన ఏడాదికి స్వాగతం తెలిపి సంబరాల్లో ఇంటిల్లాపాది మునిగి తేలారు. తమ తమ సన్నిహితులకు, స్నేహితులకు ఫోన్‌లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం పట్టణంలోని పలు దేవాలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కుటుంబ సభ్యులతో కలిసి రామగిరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
నల్లగొండ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, స్ధానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డిలు పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్‌ను జిల్లా ఎస్పీ రంగనాథ్, జేసీ నారాయణ రెడ్డి, ఆయా శాఖల అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.