నల్గొండ

ఆడపిల్లలపై ఆగని వివక్ష..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 2: దేశం సాంకేతికంగా చంద్రయాన్ వైపు దూసుకెళ్తున్న నేటి సమాజంలో ఆడపిల్లల పట్ల లింగ వివక్ష అనాగరికం కొనసాగుతున్న తీరు రేపటి అమ్మల భవిష్యత్‌ను మొగ్గలోనే తుంచేస్తోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తల్లి గర్భంలోని శిశువు మొదలుకుని వివాహం వరకు ఆడపిల్లల సంరక్షణకు పలు సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గిరిజన తండాల్లో, మారుమూల గ్రామాల్లో ఆడపిల్లల పట్ల నిరాదరణ ఆగకపోవడం ఆందోళన కల్గిస్తోంది. తండాల్లో శిశు విక్రయాలు, ప్రభుత్వ పునరావాస కేంద్రాలైన శిశుగృహాల్లో తమ పిల్లలను తల్లితండ్రులు పేగుబంధాన్ని సైతం కాదనుకుని వదిలేస్తున్న ఘటనలు తరుచు వెలుగుచూస్తు నాగరిక సమాజాన్ని వెక్కిరిస్తున్నాయి. తాజాగా పెద్దవూరా మండలంలో ఇద్దరు ఆడపిల్లల విక్రయ ఘటనలు వెలుగుచూడం మరోసారి లింగ వివక్షను వెలుగులోకి తెచ్చింది. అధిక సంతానం, పేదరికం, నిరక్షరాస్యత, వంశోద్ధారకుడికై మూఢ విశ్వాసం తండాల్లో ఆడపిల్లల భవిష్యత్‌కు శాపాలుగా మారాయి. ప్రభుత్వ శాఖల అధికారులు గ్రామాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా, ఆడపిల్లల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల విస్తృత ప్రచారం సాగిస్తున్నా మళ్లీమళ్లీ ఆడపిల్లల విక్రయాలు, శిశుగృహాలకు అప్పగించే ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు శిశు గృహాలకు చేరిన ఆడపిల్లల్లో 173 చిన్నారులను దత్తత ఇవ్వగా ప్రస్తుతం మరో 44 మంది ఆడపిల్లలు శిశుగృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గత నాలుగేళ్లలో ఒక్క దేవరకొండ డివిజన్ నుండే 81 మంది ఆడపిల్లలు శిశుగృహకు చేరడం తండాల్లో లింగ వివక్ష సమస్యను చాటుతోంది. ఐసీడీఎస్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అమలుతో గర్భవతి దశ నుండి ప్రసవం వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసి వారిపై నిఘా ఉంచుతున్నా ఆడపిల్లల అమ్మకాలు చోటుచేసుకోవడం ప్రభుత్వం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. మన ఇంటి లక్ష్మి పేరుతో స్ర్తి, శిశు సంక్షేమశాఖల, అనుబంధ శాఖల అధికారుల బృందాలు తండాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన పెద్దగా మార్పు తేలేకపోతోంది.
పథకాలున్నా.. పరివర్తన కరువే..!
ఆడపిల్లల సంక్షేమానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా వాటి అండతో తమ పిల్లలను పోషించుకుని, చదివించుకోవాలన్న పరివర్తన, చైతన్యం గిరిజనుల్లో కరువైపోతోంది. ఆడపిల్లల సంక్షేమానికి కేంద్రం సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలతో పోషకాహారం, ఆరోగ్యం, పూర్వప్రాథమిక విద్య వంటి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. బేటీ బచావో బేటీ పడావో, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోజన పథకం, ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్‌కిట్, కస్తూరిభా పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు అమలవుతున్నాయి. వీటి ద్వారా గర్భస్థ శిశువు నుండి పెళ్లి వరకు ఆడపిల్లల సంరక్షణకు ప్రభుత్వం వివిధ రకాల సహాయం అందిస్తోంది. ఐనప్పటికి తండాల్లో ఆడపిల్లల పట్ల నిరాదరణ కొనసాగుతుంది. ఆడపిల్లలను శిశుగృహాలకు అప్పగించడం, లేదా అమ్ముకోవడం వంటి ఘటనలకు పాల్పడుతున్న తల్లిదండ్రుల్లో ఎక్కువగా అధిక సంతానమున్నవారే ఉంటున్నారు. మగపిల్లాడి కోసం నలుగురు, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం గిరిజన తండాల్లో అధికంగా కనిపిస్తోంది. ఇక పట్టణాల్లో సాగుతున్న లింగ వివక్ష మరింత దారుణంగా ఉంది. గర్భస్త పిండ నిర్ధారణ నివారణ చట్టాలున్నా స్కానింగ్ కేంద్రాల ఆర్థిక దుర్మార్గాలకు ఆడపిల్లలు గుట్టుచప్పుడు కాకుండా అమ్మకడుపులోనే బలవుతున్నారు. స్కానింగ్ కేంద్రాల అత్యాశ ఆడపిల్లకు అమ్మకడుపునే బలిపీఠంగా మారుస్తోంది. ఈ నేపధ్యంలో లింగ వివక్ష నిర్మూలన, గిరిజన తండాల్లో అధిక సంతానం, స్కానింగ్ కేంద్రాలపై నిఘాలతో ప్రభుత్వ యంత్రాంగం లింగ వివక్ష నిర్మూలన దిశగా మరింత పగడ్బందిగా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా.. * తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్

మోత్కూర్, జనవరి 2: తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేయనున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. బుధవారం మోత్కూర్ మున్సిపాలిటీతో పాటు దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సూరారం యాదగిరితో పాటు పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగిరేటట్లుగా ప్రతి ఒక్కరు కృషిచేసి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఏప్రిల్ 1 నుండి రూ.2,016ల చొప్పున ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుందని, దీనితో నియోజకవర్గంలో అదనంగా 10వేల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం కింద ఈ ఏడాది నుంచి రూ. 5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పొడిచెడు మల్లయ్య చెరువు నుండి దాచారం గ్రామ సముద్రం చెరువులోకి కాలువ ద్వారా నీటిని అందించేందుకు కలసికట్టుగా పని చేద్దామన్నారు. సమావేశం రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ సీహెచ్. మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, టీఆర్‌ఎస్ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మేందర్‌రెడ్డి, నాయకులు యాకూబ్‌రెడ్డి, సోమల్లు, వస్తాదు, వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి పాల్గొన్నారు.

యాదగిరీశుడికి ఘనంగా నిత్యారాధనలు
యాదగిరిగుట్ట, జనవరి 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం పాంచరాత్రాగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవోత్సవం నిర్సహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండి జోడి సేవోత్సవం నిర్వహించారు.

కోటి ఎకరాల మాగాణి సీఎం కేసీఆర్ ధ్యేయం
* రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి
* ఎస్‌ఎల్‌బీసీ సందర్శించిన విశ్రాంత ఇంజనీర్ల బృందం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జనవరి 2: తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం బృందం బుధవారం నల్లగొండ-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టును, జిల్లా పరిధిలోని కిష్టంరాంపల్లి, శివన్నగూడెం డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్‌ల పనులను పరిశీలించింది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెండింగ్ ప్రాజెక్టులను సందర్శిస్తున్న క్రమంలో వారు సదరు ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాము పెండింగ్ ప్రాజెక్టుల పనులను పరిశీలిస్తున్నామన్నారు. అందులో భాగంగా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ ఎంట్రీపాయింట్ సొరంగం పనులను పరిశీలించి, తదుపరి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను, పిదప శివన్నగూడెం రిజర్వాయర్ పనుల పురోగతిని పరిశీలించామన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల సమస్య, కాంట్రాక్టర్ల సమస్యలు, సాంకేతిక సమస్యలపై ప్రాజెక్టుల వారిగా సీఎం కేసీఆర్‌కు నివేధించనున్నామన్నారు. ప్రభుత్వం తాము నివేదించిన అంశాలను పరిశీలించి ప్రాజెక్టుల పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పనుల పూర్తి పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని, ప్రజలు కూడా ఆయనపై నమ్మకం ఉంచి రెండోసారి అధికారం అప్పగించడంతో ప్రాజెక్టుల పనుల పూర్తిపై అందరిలో భరోసా నెలకొందన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారని, పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మారుతాయన్నారు. ఎస్‌ఎల్‌బిసిస రంగం పనుల్లో 13.7 కిలోమీటర్ల పనులు ఒకవైపు, మనె్నవారిపల్లి నుండి 19 కిలోమీటర్ల పనుల సొరంగం పనులు ఇంకోవైపు పూర్తయ్యాయన్నారు. ఇప్పటికే సొరంగం పనులకు 1400 కోట్ల ఖర్చు జరిగిందని, ప్రతి రోజు నిమిషానికి 96490 లీటర్ల నీటిని సొరంగం నుండి బయటకు తోడుతూ పనులు జరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
* ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటటౌన్, జనవరి 2: రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల అభివృద్ధే టీ ఆర్ ఎస్ ధ్యేయమని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చివ్వెంల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు అయన సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. ఈసందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తూ పాలనలో ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ అందరిని తెలంగాణ బిడ్డలుగానే భావించి వివక్షలేని పాలన అందించాలని అన్ని సందర్భాల్లో చెబుతుంటారని తెలిపారు. కొత్త, పాత తేడా లేకుండా కార్యకర్తలంతా కలసి ముందుకు సాగాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడడమే నాయకులు, కార్యకర్తల ప్రధాన బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు రౌతు నర్సింహారావు, మారిపెద్ది శ్రీనివాస్, భూక్యా వెంకటేశ్వర్లు, లచ్చిరాంనాయక్, జూలకంటి సుధాకర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, నంధ్యాల సోమిరెడ్డి, పారెపల్లి సురేష్‌కుమార్, నరేష్‌రెడ్డి, వెంకన్న, నారాయణ, శ్రీనివాస్, నాగరాజు, చక్రు, పిట్ల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ రూరల్, జనవరి 2: గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల మోడల్ కోడ్ అమలులోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవన్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై నోడల్, మండల పర్యవేక్షణాధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదన్నారు. జిల్లాలో మొత్తం యంత్రాంగం వివిధ శాఖలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్డీవోలు డిప్యూటీ ఎన్నికల అధికారులుగా వ్యవహారిస్తారని, సిబ్బందికి సెలవులు మంజూరు చేయవద్దని, అత్యవసరమైతే అనుమతి తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వాహణకు నోడల్ అధికారులను నియమించామని, ఆర్డీవోలు డివిజన్ స్థాయిలో ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమిస్తారన్నారు. ఎంపీడీవోలు సైతం అధికారులను నియమిస్తారన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అంశాలపై వాట్సాప్‌లో ఉన్నతాధికారులకు నివేధించాలన్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగతుతాయని, మొదట దేవరకొండ డివిజన్, రెండో దశలో మిర్యాలగూడ, మూడో దశలో నల్లగొండ డివిజన్ పంచాయతీలవేనన్నారు. ఈ ఎన్నికల నిర్వాహణ శిక్షణ సమావేశాలకు అధికారులు, సిబ్బంది హాజరుకావాలన్నారు. జాయింట్ కలెక్టర్ సీ.నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రచార హోర్డింగ్‌లు, గోడలపై రాతలు తొలగించాలని, మండల స్థాయిలో ఎన్నికల కోడ్ అమలు, పరిశీలన బృందాలను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో రవీంధ్రనాథ్, డీపీవో శ్రీకాంత్, డిప్యూటీ కలెక్టర్ రోహిత్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రాష్ట్రంలో స్తంభించిన ప్రజాపాలన
బీసీల రిజర్వేషన్‌పై కేసీఆర్‌కు చిత్తశుద్ధి కరువు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారెడ్డి
మిర్యాలగూడ టౌన్, జనవరి 2: రాష్ట్రంలో ఎన్నికలు జరిగి నేటికి 23 రోజులైన మంత్రివర్గం లేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేకపోవడంతో పాలన స్తంభించినట్టు ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 రోజులైనా మంత్రివర్గ ఏర్పాటు జరగకపోవడం, అసెంబ్లీ సమావేశం నిర్వహించకపోవడం కేసీఆర్ నియంత పోకడల వింతల్లో ఇదొకటని ఎద్దేవా చేశారు. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్‌ను 34 నుండి 23కు తగ్గించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ విషయంలో గతంలో రాష్ట్రంలోని కాంగ్రేస్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకుపోగా ఈసారి వరకు రిజర్వేషన్ 34తో నిర్వహించాలని పేర్కొన్నదని, ఆ విషయం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం, నష్టం తీవ్రంగా జరుగుతుందని, సుప్రీం కోర్టు దృష్టిలో ఉంచుకుని 34 శాతం బీసీలకు పంచాయతీలను కేటాయించాలని కోరారు. పంచాయతీల ఎన్నికల షెడ్యుల్ విడుదల కాక ముందునుంచే సర్పంచ్ పదవులకు వేలం పాట మొదలైందన్నారు. పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించి ఫలితాలను అన్ని పంచాయతీల్లో పోలింగ్ అయిన అనంతరం ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ అనంతరం లెక్కింపు పంచాయతీల్లో కూడా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే ముందు గెలిచిన సర్పంచ్‌ల ప్రభావం 2, 3 విడతల ఎన్నికలపై పడుతుందన్నారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు అంతా అయోమయ పరిస్థితిలో ప్రభుత్వం జరుపుతున్నదని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేష్, మాలి పురుషోత్తంరెడ్డి, జగదీశ్చంద్ర, చంద్రశేఖర్‌యాదవ్, రవినాయక్, మహ్మద్‌బిన్‌సయిద్, పాపానాయక్, ప్రకాష్‌నాయక్, శశిధర్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆర్.శ్రీనివాస్, రామ్మూర్తి పాల్గొన్నారు.

రిటైర్‌మెంట్ పెంపును
డిసెంబర్ నుంచి వర్తింపజేయాలి
* ఎమ్మెల్సీ పూల రవీందర్
నాగార్జునసాగర్, జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌మెంట్ వయసు పెంపును గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి వర్తింపు అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. బుధవారం నాడు నాగార్జుసాగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళశాల ప్రసంగంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు జయకుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై ఆయన మాట్లాడారు. పైలాన్‌కాలనీలో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తు డిసెంబర్ 31తో ఉద్యోగ విరమణ పొందిన జయకుమార్ దంపతులను ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ముందంజలో ఉందన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షనీయమన్నారు. దాని తగ్గట్టుగా డిసెంబర్ నెలలో ఉద్యోగ విరమణ పొందిన వారికి వర్తించేలా వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో పవిత్రమైన వృత్తి అని మెరుగైన సమాజాన్ని తయారుచేయడంలో ఉపాధ్యాయుడు ముందు ఉండాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు బిక్షంగౌడ్, సుధాకర్, ప్రకాష్, రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సక్రు, పరమేష్, శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.
ఆసుపత్రికి వచ్చేవారి పట్ల చిన్నచూపు తగదు
* నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల
* జిల్లా కేంద్రాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ రూరల్, జనవరి 2: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలు వార్డులలో ఆయన కలియ తిరిగి రోగులను కలిసి వారికి అందుతున్న వైద్యం, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో మెడికల్ కళాశాల, ఇతర అన్ని విభాగాలను తిరిగి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవఖానకు పేదవారే వస్తారనీ, వారి పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్షం వహించరాదనీ, చిన్న చూపు చూడరాదని, వైద్యులు సమయ పాలన పాటించాలన్నారు. ప్రభుత్వ దవఖానకు వచ్చిన రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యతమైన వైద్యాన్ని అందించాలన్నారు. జిల్లా దవఖాన అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.