నల్గొండ

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, జనవరి 25: టీఆర్‌ఎస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు, రాంచంద్రాపురం, కురంపల్లి, జీ ఎడవల్లి, బోయినపల్లి, బుడమార్లపల్లి, పర్వతగిరి తదతర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తామని అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీకి లక్షలాది రూపాయలతో వౌళిక సదుపాయాలు కల్పించామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలుపుతో గ్రామాల అభివృద్ధి మరింతగా మెరుగు పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభత్వం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న తీరును దృష్టిలో పెట్టుకుని ప్రజలు రెండోసారి టీఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే పట్టం కట్టారన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌కే. ఖరీం పాషా, జిల్లా నాయకులు వంగాల సహదేవరెడ్డి, మాజీ సర్పంచ్ పుల్కరం క్షత్రయ్య, పుల్కరం అశోక్, నగేష్, కట్ట ఊషయ్య, పుల్కరం వెంకటేశం, మారయ్య, బల్గూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు అభివృద్ధే లక్ష్యం

పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లకు సహకరిస్తా
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మర్రిగూడ, జనవరి 25: పార్టీలకు అతీతంగా నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లకు గ్రామాల అభివృద్ధికోసం అన్ని విధాలా సహకరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధే తన ముందున్న లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ప్రతినిత్యం వహిస్తున్న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించారన్నారు. సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల రావడంతో కార్యకర్తలు ఆదే జోష్‌లో పని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహకారం తాను ఎలాగైతే తీసుకుంటున్నానో గ్రామాల అభివృద్ధికోసం కూడా సర్పంచ్‌లు తన సహకారం తీసుకోవాలని సూచించారు. చర్లగూడెం ముంపు బాధితులకు పునరావసం, ఎకరాకు 10లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా కోరానన్నారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను స్థానిక సర్పంచ్‌లు లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కట్కురి వెంకటేశ్ గౌడ్, మల్గిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గ్యార యాదగిరి, పంతంగి సుధాకర్, వరికుప్పల విజయ్, ఎడ్ల ముత్తయ్య, గొట్టిముక్కల ప్రకాష్, వంపు వెంకటయ్య, చంద్రు నాయక్, తదతరులు పాల్గొన్నారు.

జనగాంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త మిస్సింగ్
24గంటల్లో పట్టుకొచ్చిన పోలీసులు
కుటుంబ సభ్యులకు అప్పగింత

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 25: మండలంలోని జనగాం గ్రామ టీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి సుక్క స్వరాజ్యం భర్త భాస్కర్ మిస్సింగ్ అయిన ఉదంతం మండలంలో కలకలం రేపింది. సర్పంచ్ పోటీ నుంచి అభ్యర్థిని తప్పించాలనే ఎవరో భాస్కర్‌ను బెదిరించినట్లు తెలిసింది. దీనితో సుక్క భాస్కర్ ఎవరికీ చెప్పకుండా షిరిడి, షోలాపూర్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకు వెల్లిపోవడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు గురైనారు. ఈ ఉదంతం ఈనెల 23న జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బైక్‌పైన వచ్చిన ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండవద్దని, విరమించుకోవాలని బెదిరించినట్లు తెలిపారు. దీనితో ఎవరికీ చెప్పకుండా భాస్కర్ బస్సు ఎక్కి వెల్లిపోయాడు. మరుసటి రోజు వరకు భాస్కర్ ఇంటికి రాకపోయే సరికి సర్పంచ్ పోటీలో ఉన్న భాస్కర్ భార్య సుక్క స్వరాజ్యం, అతని తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌ఐ మళ్ళీశ్వరి తన బలగాలతో భాస్కర్ ఫోన్ నెంబర్‌తో కూపీ లాగుతూ మహారాష్టక్రు వెళ్ళారు. అక్కడి నుంచి ఫోన్‌లో భాస్కర్‌తో మాట్లాడుతూ అతన్ని పట్టుకుని సంస్థాన్‌నారాయణపురం తీసుకొచ్చి శుక్రవారం ఉదయం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తాను సర్పంచ్ పోటీలో ఉండలేనని భాస్కర్ భార్య స్వరాజ్యం తెలిపారు.
మానసికస్థితి సరిగ్గాలేకనే.. ఎస్‌ఐ మళ్లీశ్వరి
జనగాం గ్రామ టీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి సుక్క స్వరాజ్యం భర్త భాస్కర్ మానసికస్థితి సరిగ్గా లేనందువల్లనే అతను ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా మహారాష్టక్రు వెల్లిపోయాడని ఎస్‌ఐ మళ్లీశ్వరి తెలిపారు. భాస్కర్ చెప్పిన వివరాల ప్రకారం అతన్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, బెదిరించలేదని తెలిపారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెల్లిపోయిన వ్యక్తి అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడని తెలిపారు. అతని మానసికస్థితి సరిగ్గా లేకనే వెళ్లిపోయాడని తెలిపారు.

ఓటరు నమోదుకు విస్తృత ప్రచారం
* 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నమోదుచేసుకోవాలి
* కలెక్టర్ అమయ్‌కుమార్

సూర్యాపేటటౌన్, జనవరి 25: జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమంపై పట్టణాలు, గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన ఓటరు నమోదు చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో జనవరి 1, 2019 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా చైతన్య పరచాలని, ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై ఉండాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘంతో కలిసి సంయుక్తంగా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం గ్రామాలకు చెందినవారై ఉంటారని, వారు తమ గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే విధంగా కృషిచేయాలని కోరారు. పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు నుంచి జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఓటరు దినోత్సవ సదస్సులో జిల్లా రెవెన్యూ అధికారి పీ.చంద్రయ్య మాట్లాడుతూ దేశంలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే పోలింగ్ శాతం పెరిగి మంచి ప్రభుత్వాలు ఏర్పడుతాయన్నారు. ఓటు హక్కు కలిగిన వారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన వ్యక్తులను ఎన్నుకున్నప్పుడే దేశం పురోగమిస్తుందన్నారు. ఓటు హక్కు ఎంతో విలువైందని, ఒక్క ఓటుతో గెలుపోటములు తారుమారవుతాయన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు లిస్టుల సవరణ సందర్భంగా మీ ఓటు ఉందో, లేదో ముందుగా తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం, ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచిందన్నారు. ఎవరైనా ఎప్పుడైనా తమ ఓటును పరిశీలించుకునేందుకు లేదా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు కావాల్సిన సమాచారం ఈ కాల్ సెంటర్ నుంచి పొందవచ్చన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు మీ పరిధిలోని బీ ఎల్లో, తహశీల్దార్, వీఆర్వో, వీఆర్‌ఏల వద్ద ఫారం-6 నందు వయసు ధ్రువీకరణ పత్రాన్ని చూపించి దరఖాస్తు చేసినట్లయితే వారు దరఖాస్తును పరిశీలించి ఓటు నమోదు చేస్తారన్నారు. విదేశాల్లో ఉండేవారు ఫారం-6ఏ, పేరు మార్పిడికి ఫారం-7, నియోజకవర్గ పరిధిలో ఓటు మార్చుకునేందుకు ఫారం-8, ఒక అసెంబ్లీ స్థానం నుంచి మరో అసెంబ్లీ స్థానానికి మారుటకు ఫారం-8 నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్య, తహశీల్దార్లు సుదర్శన్‌రెడ్డి, సైదులు, జమీరుద్దిన్ పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రిలో ఘనంగా నిత్యారాధనలు
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట, జనవరి 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. లక్ష్మీనరసింహుల ఆలయంలో వేకువ జామున సుప్రభాతంతో స్వామిఅమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్ధం, బాలబోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా స్వయంభూవులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్ధారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించి హారతి నివేధన చేశారు. బాల ఆలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి
* ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల, జనవరి25: నిస్వార్ధంగా పని చేసే కాంగ్రెస్ అభ్యర్ధులనే పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గ్రామాలు అభివృద్ధి సాధించాలంటె కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ధులనే గెలిపించాలని పేర్కొన్నారు. మండలంలోని తాళ్ళవెళ్ళంల, వెంబావి, నేరడ గ్రామాల్లో శుక్రవారం పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు చెప్పే మాటలను నమ్మి మోస పోవద్దని, వారి ఉచ్చులో పడొద్దని అన్నారు. ఈ సమావేశాల్లో అభ్యర్ధులు గోపగోని వెంకటయ్య, గుణగంటి వెంకన్న, దుబ్బాక శోభ, రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహరెడ్డి, మండల నాయకులు దుబ్బాక వెంకట్‌రెడ్డి, జడల ఆదిమల్లయ్య, జనగాం నర్సింహగౌడ్, కొండె రవీందర్, కంప మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓటు వజ్రాయుధం
యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి
* జిల్లా జడ్జి, కలెక్టర్‌లు
నల్లగొండ రూరల్, జనవరి 25: ఓటు వజ్రాయుధం, 18 ఏళ్లు నిండిన ప్రతి యువత ఓటు హక్కు నమోదు చేసుకోని, వినియోగించుకోవాలని జిల్లా జడ్జి శశిధర్ రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌లు కోరారు. 9వ ఓటర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక గడియారం సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తించి సక్రమంగా పని చేసేవారిని ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ఓటు వేయక పోతే సమస్యలు తీరవని, మార్పు ఉండదన్నారు. నేటి యువతరం ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిరాసక్తతతో ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 19వరకు నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయవచ్చన్నారు.
ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ ఓటర్లు ప్రలోభాలకు లొంగవద్దని అందరి కోసం పని చేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేయడం, సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సన్మానించి మొక్కలు నాటారు. అంతకు ముందు విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. అదే విధంగా ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తదితరులున్నారు.