నల్గొండ

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి: శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. శనివారం చెర్వుగట్టు ఆలయంలో వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14నుండి 19వరకు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నందున కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, వౌలిక వసతుల కల్పనలో అసౌకర్యాలు లేకుండా పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం సిబ్బందికి షిప్ట్ డ్యూటీలు వేయాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ముందస్తు వైద్య శిబిరాలు అత్యవసర మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్టీసి అధికారులు ప్రతిరోజు 300 ట్రిప్పుల చొప్పున జిల్లా, పరిసర జిల్లాల నుండి బస్సు సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు బస్‌స్టాప్‌ల వద్ద తాత్కాలిక తాగునీరు, నీడ, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలోకి అక్రమ మద్యం ప్రవేశించకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. 14వ తేది రాత్రి జరుగునున్న స్వామివారి కల్యాణోత్సవం రద్దీ దృష్ట్యా ముఖ్యమైన ప్రాంతాల్లో ఎల్‌సిడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి మనోహర్‌రెడ్డికి, ఆర్డీవో వెంకటచారిలకు సూచించారు. దేవాలయంలో ఉన్న 16సిసి కెమెరాలకు అదనంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా మరో 16సిసి కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో చెర్వుగట్టు ఆలయాన్ని సందర్శించనున్నందున అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సిఎం సూచనల మేరకు చెర్వుగట్టులో భక్తులకు ఉచిత సర్వదర్శనం ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖకు పంపించాలన్నారు. ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులకు ఉచిత ప్రసాదం, విభూతి పంపిణీ లేకపోవడం సమంజసంగా లేదని అందుకు ఏర్పాటు చేయాలన్నారు. గత బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయ, వ్యయాలను సమీక్షించారు. జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతు బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరీరక్షణకు అదనపు భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఇక్కడ పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు.
అంతకుముందు ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీలకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకబృందం పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి ఆశీర్వచనాలు, జ్ఞాపిక, ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, జడ్పీ సిఇవో మహేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రాంచందర్‌రావు, ఎంపిపి రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, జడ్పీటీసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్, సర్పంచ్ రమణబాలకృష్ణ, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ఎంపిడివో సురేష్, తహశీల్ధార్ రాములు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వౌలిక వసతుల కల్పనకు చర్యలు
పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలి : కలెక్టర్ సత్యనారాయణరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 6: జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి అధిక శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా కళాశాలల విద్య అభివృద్ధి, సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలోని పది డిగ్రీ కళాశాలల్లో, రెండు ఏయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతాన్ని ఆయన కళాశాలల వారిగా సమీక్షించారు. అలాగే ఉత్తీర్ణత, హాజరుశాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రెండు డిగ్రీ కళాశాలలు 60శాతం ఉత్తీర్ణతతో ఉన్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో 35మార్కుల ఉత్తీర్ణతతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో వౌలిక వసతులను పెంపొందించి పనితీరు మెరుగుపరిచేందుకు త్వరలో అన్ని చర్యలు చేపట్టనున్నందునా త్వరలోనే వాటికి పూర్వవైభవం రానుందన్నారు. కొన్ని వెనుకబడిన గ్రామాల్లో బస్సుల వసతి లేక విద్యార్థులు సకాలంలో కళాశాలల హాజరుశాతం సక్రమంగా ఉండటం లేదని ప్రిన్సిపాల్స్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అటువంటి రూట్లలో ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి, పేద డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం అందించే దిశగా పరిశీలన సాగుతుందన్నారు. విద్యార్థులకు వృత్తి నైపుణ్యాల పట్ల అవగాహాన కల్పించి ఉపాధి అవకాశాల దిశగా నడిపించాలన్నారు. డిఆర్‌డిఏ, జవహర్ నాలేడ్జ్ కేంద్రాలు ప్రయత్నాలు చేయాలన్నారు. జిల్లాలో డిగ్రీ చదువుతున్న 9వేల మంది విద్యార్థుందరిని జెకెసి పథకం కింద నమోదు చేసేందుకు కోఆర్టీనేటర్లు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. డిగ్రీ విద్యార్థులకు డిఆర్‌డిఏ ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహించి ఆసక్తి, అర్హత గల రంగాల్లో వారికి ఉపాధి చూపాలన్నారు. వృత్తి విద్య సర్ట్ఫికెట్ కోర్సులను కళశాలలు నిర్వహించాలన్నారు. కళాశాలలకు మంజూరైన భవనాల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేసి అన్ని వౌలిక వసతుల కల్పన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఏజెసి వెంకట్రావు, ఎన్‌జి కళాశాలల ప్రిన్సిపాల్ ఆర్.నాగేందర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అంజయ్య, సాంఘిక సంక్షేమశాఖ ఏడి రాజేశేఖర్, సిపివో సురేందర్ పాల్గొన్నారు.
ధర్మభిక్షం ఆశయాలను నెరవేర్చాలి
ఆత్మకూర్(ఎం), ఫిబ్రవరి 6: మాజీ ఎంపి బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలను నెరవేర్చాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపి బూర నర్సయ్యగౌడ్‌లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో మాజీ ఎంపి ధర్మభిక్షం విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. గౌడ కులస్తులందరినీ ఒక తాటిపైకి తెచ్చి కులానికే వనె్న తెచ్చిన ధర్మభిక్షం పేరును గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ లావణ్య, సర్పంచ్ బి.చందర్‌గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు జైహింద్‌గౌడ్, మల్లేషంగౌడ్, జహంగీర్‌గౌడ్ పాల్గొన్నారు.
సాగర్ పవర్‌హౌస్‌ను సందర్శించిన జెన్‌కో సిఎండి
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 6: నాగార్జునసాగర్‌లోని తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు సందర్శించి పరిశీలించారు. సాగర్‌కు వచ్చిన జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావుకు ఎస్‌పిఎఫ్ సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. గత రెండురోజుల నుండి సాగర్ జలాశయం ద్వారా కృష్ణాడెల్టాకు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ నీటివిడుదల చేస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడానికి శనివారం ఆయన వచ్చారు. దీనిలో భాగంగా ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దాంతోపాటు ఎడమకాల్వపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జెన్‌కో వసతిగృహంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయనతోపాటు జెన్‌కో హైడల్ డైరెక్టర్ రాజన్, జెన్‌కో ఎస్‌ఇ రాజనర్సింహా, ఇఇ రవీందర్, జెన్‌కో ఎస్‌పిఎఫ్ ఆర్‌ఐ గుప్తా, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
మాతా, శిశు మరణాల బాధ్యులపై చర్యలు
విచారణ నివేదికలు ఇవ్వని అధికారులు* నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్ ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 6: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా, శిశు మరణాల సంఘటనలలో విచారణ నివేదికల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ప్రసవ మరణాలను సమీక్షించారు. ప్రతి మూడు నెలలకొకసారి విధిగా నిర్వహించాల్సిన ప్రసవ మరణాల సమీక్షా సమావేశాలను 2012పిదప నేటి దాకా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గత ఏప్రిల్ 15నుండి డిసెంబర్ 15వరకు 40, 280ప్రసవాలు జరుగగా మాతాశిశు మరణాలకు సంబంధించి 17సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. వాటిపై తగిన కారణాలను అనే్వషించి నివేదికల ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యల చేపడుతామన్నారు. విచారణాధికారులు తగిన కారణాలు విధిగా పొందుపరిచి పారదర్శకతతో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవ మరణాలపై నియమించిన కొందరు విచారణాధికారులు సమీక్షా సమావేశానికి రాకుండా ఇతరులను సమావేశానికి పంపడమేగాక అసమగ్ర నివేదికలు పంపించడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రసవ మరణాల ఘటనలపై విచారణ నివేదికలతో పాటు పోస్టుమార్టం నివేదికలు పంపించాలని డిఎంహెచ్‌వోను ఆదేశించారు. కొన్ని సంఘటనల్లో తల్లి, మరికొన్ని ఘటనల్లో శిశువులు మరణించిన సందర్భాల్లో ఆసుపత్రుల్లో డాక్టర్లు పట్టించుకోకపోవడం పట్ల బాధిత కుటుంబాల సభ్యులను కలెక్టర్ నేరుగా ప్రశ్నించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసవ మరణాలకు వైద్యపరంగా కారణలేవైనా సకాలంలో వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తప్పవన్నారు. ఈ కేసులకు సంబంధించి విచారణ, ఆడిట్ రిపోర్టులు ఇంటి వద్ద కాకుండా ఆసుపత్రులకు వెళ్లి, బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి విచారణ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏజెసి వెంకట్రావు, డిఎంహెచ్‌వో భానుప్రసాద్ నాయక్‌లు పాల్గొన్నారు.
క్రీస్తు మార్గంతోనే శాంతియుత సమాజం
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 6: శాంతి, ప్రేమ, సహనంతో కూడిన సమాజానికి క్రీస్తు మార్గం అనుసరించాలని మరియారాణి చర్చి బిషప్ గోవింద్ జోజి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మరియ రాణి చర్చి ఆవరణలో శిలువతో కూడిన 40అడుగుల భారీ క్రీస్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సమాజానికి త్యాయం, దయ, ప్రేమలతో కూడిన క్రీస్తు బోధనలు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణలో పట్టణంలోని వివిధ చర్చిల బిషప్‌లు, ఫాధర్స్ మోర్ సిగ్మోర్, ఆరోగ్యం ఆంథోని, జీవన్, శాంసన్, రాజారావు, కౌన్సిలర్ జయప్రకాశ్, జయంతి, ఇన్నారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు పశుల శౌరయ్యలు పాల్గొన్నారు.
వాల్టా చట్టం
అతిక్రమణ
శ బోరు యజమానిపై కేసు
బొమ్మలరామారం, ఫిబ్రవరి 6: మండలంలోని రంగాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ యజమాని ప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లుగా ఆర్డీఓ ఎన్.మధుసూదన్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా బోరువేస్తున్న పెట్రోల్ బంక్ యజమానిపై కేసును నమోదుచేయడమే కాకుండా బోరుబండిని సీజ్‌చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతులు లేకుండా బోర్లువేసినా, నీళ్లురాని బోరుగుంతలను పూడ్చకపోయినా కేసులు నమోదుచేస్తామని ఆర్డీఓ హెచ్చరించారు.
గోల్కొండ కోటను జయించిన మొనగాడు
సర్దార్ పాపన్నగౌడ్
తీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్
మోత్కూరు, ఫిబ్రవరి 6: కల్లు గీసిన కత్తితో గోల్కొండ కోటను జయించిన మొనగాడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మోత్కూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. వలస పాలకుల వల్లే మొగులయ్య, సర్దార్ పాపన్న వంటి విప్లవ వీరుల చరిత్రలు బయటకు రాలేదన్నారు. అలాంటి బహుజన విప్లవ వీరుల విగ్రహాలను పెట్టు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన జీవిత సత్యాలు, పాఠాలు నేర్చుకోవల్సిన అవసరం ఉందన్నారు. చైతన్యం రావాలంటే గరిమనాభి నుండి రావాలని, గౌడ ఉద్యమం కొనసాగించాలని అన్నారు. పాపన్న పుట్టిన రోజు అగస్టు 18న వన భోజనం కార్యక్రమం గౌడ్‌లు జరుపుకోవాలని కోరారు. పత్రికలలో, శుభకార్య పత్రికలలో, వాహనలకు తప్పనిసరిగా పాపన్న చిత్రాన్ని వేసుకోవాలన్నారు. పేరులో కూడా గౌడ్‌ను చేర్చుకుంటే ఎంతమంది గౌడ్‌లు ఉన్నారో తెలుస్తుందన్నారు. ఐకమత్యం లేకనే అన్యాయం జరుగుతుందన్నారు.
* సర్దార్ పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుకోవాలి : ఎంపి
సర్దార్ పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఆర్ క్రిష్ణయ్య, డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, సర్దార్ పాపన్న ట్రస్ట్ చైర్మన్ జైహింద్ గౌడ్ , జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావుగౌడ్ అన్నారు. 366 సంవత్సరాల క్రితం బహుళజనులను ఏకం చేసిన వీరుడని కొనియడారు. పాపన్న విగ్రహం బహుజనుల రాజ్య స్థాపనకు పునాదని కొనియాడారు. పాపన్న చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని అన్నారు. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరారు. పాపన్న కోటను గుర్తుండే విధంగా ప్రభుత్వం ఆధునీకరించాలని కోరారు. రోజులు మారినా గౌడ్‌ల రాతలు మరలేదని అన్నారు. ఐకమత్యంతో ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలని, డబ్బుకు ఆశపడకుండా గౌడ కులస్తులను గెలిపించుకోవల్సిన అవసరం ఉందన్నారు. కల్లును శీతల పానీయంగా నిల్వ చేసేవిధంగా, పలు రకాలుగా ఉపయోగ పడేవిధంగా ఉత్పత్తులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రమాదవశాత్తు జారిపడితే దెబ్బలు తగుల కుండా రక్షణ కోసం తీసుకోవల్సిన పరికరాలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల మాదిరిగా గీత కార్మికులు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈకార్యక్రమానికి ముందు పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో బీసు చందర్‌గౌడ్, నిమ్మల వెంకటేశ్వర్లుగౌడ్, చేగోని మంజుల సత్యంగౌడ్, వల్లందాస్ ధనమ్మ సత్తయ్యగౌడ్, విష్ణుగౌడ్, గౌడ్ సంఘం గౌరవ అధ్యక్షులు అంబటి బిక్షమయ్యగౌడ్, అధ్యక్షులు గనగాని శ్రీశైలంగౌడ్, దేవాంజీగౌడ్, మెరుగు యాదగరిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దబ్బెటి రమేష్‌గౌడ్, బుర్రయాదయ్య గౌడ్ పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
నడిగూడెం, ఫిబ్రవరి 6: విద్యుత్ తీగలు మీదపడి ఇరువురు దుర్మరణం చెందిన సంఘటన నడిగూడెం మండలం త్రిపురారం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన కట్టెలు కొట్టే ఐదుగురు కూలీల బృందం త్రిపురారం సమీపంలో కట్టెలు కొట్టి డిసిఎం వాహనంలో లోడ్ చేసుకుని కోదాడ వైపు వెళుతుండగా మూలమలుపు వద్ద డిసిఎం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగి డిసిఎంపై పడటంతో అందులో ఉన్న కూలీలు వీరమల్లు నాగరాజు(28), బెల్లి నాగమల్లయ్య(28)లు విద్యుత్ షాక్‌కు గురై వాహనంలోనే దుర్మరణం చెందారు. వారి మృతదేహాలు విద్యుద్ఘాతంతో మాడిపోయాయి. డిసిఎంలోని మిగతా ముగ్గురు కూలీలు అదృష్టవశాత్తు ప్రమాదం నుండి ప్రాణాలతో బయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.