నల్గొండ

కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 28 : రాబోయే స్ధానిక ఎన్నికల్లో విపక్షాలన్ని కలిసి కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని, మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయగా మారి రైతుల నోట్లు మన్ను కొట్టిందన్నారు. వాటర్‌గ్రిడ్ పనులు రెండు సంవత్సరాలు కావస్తున్నా ప్రారంభం కాలేదన్నారు. జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు ఆలోచనతో ఎన్నికల్లో ముందుకు సాగాలన్నారు. 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ పనులు పూర్తి చేయలేదని, టిడిపి హాయాంలో కోటప్పమత్తడి డిజైన్ చేయగా, వైయస్.రాజశేఖర్‌రెడ్డి శంఖుస్ధాపన చేశారని, 10 సంవత్సరాల నుంచి పనులు ముందుకు సాగకపోగా నిర్వాసితులకు నష్ట పరిహారం అందలేదన్నారు. బ్రహ్మణవెల్లంలా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, లతీప్‌సాహేబ్ గుట్టపైకి రోడ్డు తదితర పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పాలనలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని, అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి కాంగ్రెస్, టిడిపిలకు బుద్ది చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు, మిర్యాల యాదగిరి, గున్‌రెడ్డి యుగేందర్‌రెడ్డి, పినపరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఇంతియాజ్ ఆలీ, గుండు వెంకటేశ్వర్లు , మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంస్థల్ల్లో ఖాదీ వినియోగానికి ప్రతిపాదనలు

కోదాడ, నవంబర్ 28: అన్ని ప్రభుత్వ సంస్ధల్లో, కార్యాలయాల్లో, వైద్యశాలల్లో, రైల్వేలలో ఖాదీ ఉత్పత్తులను వాడేవిధంగా ఉత్తర్వులను ఇవ్వాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు దక్షిణభారత ఛైర్మన్ జి. చంద్రవౌళి తెలిపారు. హైద్రాబాద్ నుండి విజయవాడ వెళుతున్న చంద్రవౌళి శనివారం నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో బిజెపి నాయకుడు అక్కిరాజు యశ్వంత్ ఇంట్లో కొద్దిసేపు ఆగిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ఖాదీ, చేనేత కార్మికులకు చేయూతను ఇవ్వాలనే లక్ష్యంతో బోర్డు పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. దళారులను నమ్మి ఖాదీ, చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఆత్మహత్యలు చేసుకొనే పరిస్ధితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖాదీ, చేనేత కార్మికులకు ఆదుకొనేందుకు తమ సంస్ధ ద్వారా కార్మికులకు కాటన్ తదితర ముడిసరుకులను అందించి వారు తయారుచేసిన వస్త్రాలను, వస్తువులను కొనుగోలు చేసి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. మహబూబ్‌నగర్‌లో తయారైతున్న గొంగళ్లు అన్ని సీజన్‌లోనూ ఉపయోగపడేవిగా వుండటంతో వాటికున్న డిమాండ్‌ను దృష్టిలో వుంచుకొని గొంగళ్ల తయారీని ఆధునీకరించి పరిశ్రమగా అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి పధకం కింద చేతివృత్తులు చేసుకొనేవారికి 20 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం వున్నట్లు ఆయన వివరించారు. 30 శాతం సబ్సిడీతో ఈ రుణాన్ని నోడల్ అధికారిగా వున్న జిల్లా కలెక్టర్ మంజూరుచేస్తారని యస్‌సి, యస్‌టిల వారైతే ఐదు శాతం, ఇతరులు పది శాతం మార్జిన్ మనీని చెల్లించాల్సి వుంటుందన్నారు. దరఖాస్తు చేసుకొన్నవారికి జిల్లా గ్రామీణ పరిశ్రమల సంస్ధ శిక్షణ ఇస్తుందన్నారు. ఈత చెట్లనుండి నార తయారీ, సోలార్ చరకలకు రుణసదుపాయం వున్నట్లు ఆయన వివరించారు. చేనేతల ఎగుమతులకు ప్రధాని నరేంద్రమోది అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమలపై తెలుగురాష్ట్రాల్లో అవగాహన లేకపోవడంవలన వేలకోట్ల రూపాయలు నిరుపయోగం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన పరిధిలోని తమిళనాడులో 58, కర్నాటకలో 18 పరిశ్రమలు ఏర్పాటుకాగా రెండు తెలుగురాష్ట్రాల్లో కేవలం ఆరు పరిశ్రమలు మాత్రమే వున్నాయని ఛైర్మన్ చంద్రవౌళి వివరించారు. కార్యక్రమంలో బిజేపి పట్టణ అధ్యక్షుడు అక్కిరాజు యశ్వంత్, సంకోజు నాగాచారి, జగన్మోహన్‌రావు, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కరవు జిల్లాగా ప్రకటించాలి
సంస్థాన్‌నారాయణపురం, నవంబర్ 28: నల్లగొండ జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో సాదారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోయి 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులు తీర్చలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఇన్‌పుట్ సబ్సీడీ అందించాలని, ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో డిసిసిబి డైరెక్టర్ ఏర్పుల సుదర్శన్, మండల కమిటి అధ్యక్ష, కార్యదర్శిలు కుందారపు యాదయ్య, కుక్కల నర్సింహ, గంగదేవి సత్తయ్య, పాలకుర్ల స్వామి, కొర్ర గోవర్థన్, అవ్వారి సుబ్బారావు, పడ్సనగోని నర్సింహ, బద్దుల యాదగిరి, వలిగొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

పనిచేయని డ్యాం కంట్రోల్ రూం ఫోన్లు
నాగార్జునసాగర్, నవంబర్ 28: గత మూడు రోజులుగా నాగార్జునసాగర్ డ్యాం కంట్రోల్ రూం ఫోన్లు పనిచేయడంలేదు. ఈ కంట్రోల్ రూం ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుండి ఎంత నీరు వస్తుంది, బయటకు ఎంత పరిమాణాన్ని విడుదల చేస్తున్నారు, జలాశయ నీటిమట్టం మొదలగు వివరాలను ఫోన్ ద్వారా తెలియచేస్తుంటారు. డ్యాం అధికారులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి ఈ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నీటికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను తెలుసుకుంటారు. కాగా మూడురోజులుగా ఇక్కడి ఫోన్‌లు రింగ్ అవుతున్నా ఎత్తేవారే కరువయ్యారు. కొన్నిసార్లు ఫోన్ పనిచేయడంలేదని సమాధానం వస్తుంది. డ్యాం అధికారులకు ఈ విషయం తెలియచేసినా స్పందించకుండా వ్యవహరిస్తున్నారు. డ్యాం కంట్రోల్ రూంలో పనిచేసే సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ లేనందున సరిగా విధులు నిర్వహించడంలేదని, ఈకారణంగానే ఫోన్ ద్వారా ఎటువంటి వివరాలను తెలియచేయలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంచినీళ్ల కోసం గ్రామస్థుల రాస్తారోకో
ఆత్మకూర్ ( ఎం), నవంబర్ 28 : మండలంలోని సందెపల్లి గ్రామంలో గత 10 రోజుల నుండి మంచి నీళ్లు గ్రామానికి రాకపోవడంతో గ్రామస్తులంతా కలిసి శనివారం సందెపల్లి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తూంబావి చెరువులో ప్రైవేట్ వ్యక్తులు 3 బోర్లు వేయడంతో గ్రామపంచాయితీ నుండి వేసిన బోర్లు ఎండిపోవడంతో గ్రామాలలో నీళ్లు రాకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో విషయం ఆర్‌ఐ సంఘటన స్ధలానికి వచ్చి ప్రైవేట్ బోర్లను సీజ్ చేయడంతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించుకున్నారు.
రాస్తారోకోలో సర్పంచ్ సూదగాని జయరాములు, ఎంపిటిసి ఏనుగు అంజిరెడ్డి, ఉపసర్పంచ్ కె.సిద్దిరాములు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డి. రవీందర్‌రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పైకా క్రీడలు ప్రారంభం
ఆత్మకూర్( ఎం), నవంబర్ 28 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం మండల పరిషత్ ఆధ్వర్యంలో పైకా క్రీడలను సూపరిండెంట్ జ్ఞానప్రకాష్ ప్రారంభించారు. మండలంలోని ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాల విద్యార్ధులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు భాస్కర్, విద్యార్ధులు పాల్గొన్నారు.