నల్గొండ

ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు మెరుగుపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 10: ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను మెరుగుపరిచి సమర్ధవంతంగా పేదలకు వైద్య సదుపాయలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బ్లడ్ కాంపొనెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విషజ్వరాలు, డెంగ్యూ వంటి జ్వరాలు సోకినప్పుడు ఈ కాంపొనెంట్ సెంటర్‌లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఇదే రీతిలో అన్ని డివిజన్ ఆసుపత్రుల్లో బ్లడ్ కాంపొనెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఇతర వౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతామన్నారు. ఆసుపత్రి విస్తరణ, వసతుల కల్పన పనులు త్వరిత గతిని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఆసుపత్రి వైద్యులు ఎల్.అమర్, ఎం.నరసింహ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలో భారీ వర్షం
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 10: జిల్లా కేంద్రం నల్లగొండతో పాటు తిప్పర్తి, కనగల్, నార్కట్‌పల్లి, చిట్యాల తదితర మండలాల్లో శనివారం ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిశాయి. నల్లగొండ పట్టణంలో ఉదయం నుండి రాత్రి వరకు కూడా నిరంతరాయంగా ముసురు వర్షాలు కురిశాయి.

క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
క్రీడాకారులు గెలుపు, ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రాణించాలి
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
మిర్యాలగూడ, సెప్టెంబర్ 10: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు క్రీడల్లో రాణించి రాష్ట్ర ప్రతిష్టను జాతీయస్థాయిలో ఇనుమడింపచేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడురోజులపాటు జరగనున్న రాష్టస్థ్రాయి అండర్-19 కబడ్డి, బాల్‌బ్యాడ్మింటన్, షూటింగ్‌బాల్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడా జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతోపాటు స్పూర్తిని ప్రదర్శించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలని ఆయన అన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిలను స్పూర్తిగా తీసుకోని భవిష్యత్తులో రాణించాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించకపోవడం వలన కనుమరుగవుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ఒక్క క్రికెట్ క్రీడపైనే దృష్టిపెట్టాయని, గ్రామీణ క్రీడలను విస్మరించాయని ఆయన ఆరోపించారు. శక్తి, స్పూర్తి, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే కబడ్డి, వాలీబాల్ వంటి క్రీడలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతో కృషిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్య ఒక్కటే ముఖ్యం కాదని క్రీడలు కూడా ముఖ్యమేనని అందువల్ల క్రీడలపై కూడా దృష్టిసారించాలని ఆయన అన్నారు. చదువుతో సమానంగా క్రీడల్లో రాణించాలని ఆయన విద్యార్ధులను కోరారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించి తెలంగాణ ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మానసికొల్లాసానికి, దేహదారుఢ్యాన్ని పెంపొందించేందుకు, మానసిక ప్రశాంతతకు, భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు క్రీడలు దోహదపడుతాయని ఆయన అన్నారు. గెలుపు, ఓటమిలు సహజమని, ఓటమి చెందినప్పుడు నిరుత్సాహపడకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని ఓటమిని స్పూర్తిగా తీసుకోని క్రీడల్లో రాణించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. క్రీడాకారిణి సింధును స్పూర్తిగా తీసుకోవాలని ఆయన క్రీడాకారులను కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ ప్రకాశ్‌బాబు, ఆర్డీఓ కిషన్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మందడి నర్సిరెడ్డి, జడ్‌పిటిసిలు శంకర్‌నాయక్, ఇరుగుదిండ్ల పద్మ, నాగలక్ష్మీ, తహశీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్ధుంపాషా, కమీషనర్ సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి, క్రీడల కన్వీనర్ అనుముల మదుసుదన్‌రెడ్డి, కౌన్సిలర్లు తిరునగరు భార్గవ, నూకల కవిత వేణుగోపాల్‌రెడ్డి, ఇలియాస్, మాజీద్, వైస్ ఎంపిపి సరళ, ఎంఇఓ చాంప్లానాయక్, క్రీడల ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు డాక్టర్ కె.రాంరెడ్డి, క్రీడల ప్రత్యేక పరిశీలకులు వివి.కృష్ణారెడ్డి, చందర్, నాగేశ్వర్‌రావు, జిల్లా నిర్వాహణ కార్యదర్శి గవ్వా దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాలతోనే పాలకుల్లో మార్పు సాధ్యం
యువతను సమీకరించి పోరాడేందుకు సిద్ధంకండి
డివైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల్లో రంగారెడ్డి పిలుపు
కోదాడ, సెప్టెంబర్ 10: త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలతోనే పాలకుల్లో మార్పు సాధ్యమని, యువకులను సమీకరించి పాలకుల ప్రజావ్యతిరేక విదానాలపై డివైయఫ్‌ఐ సమరశంఖం పూరించాలని మాజీ ఎమ్మెల్యే, సిపియం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైయఫ్‌ఐ) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కోదాడలో ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభానికి ముందు పట్టణంలోని భగత్‌సింగ్ కూడలి నుండి సభాస్ధలి వరకు యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. డివైయఫ్‌ఐ పతాకాన్ని ఆలిండియా ప్రధానకార్యదర్శి అభయ్ ముఖర్జీ ఆవిష్కరించి అమరవీరుల స్ధూపం వద్ద నివాళులు అర్పించారు. తదుపరి డివైయఫ్‌ఐ రాష్ట్ర అద్యక్షులు ఎ.విజయ్‌కుమార్ అద్యక్షతన జరిగిన మహాసభల ప్రారంభసభలో రంగారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. అసమానతలు, దోపిడిలేని సమాజం కొరకు, అందరికి విద్య, ఉపాధి, వైద్యం అందేంతవరకు యువత రాజీలేని పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 70 యేండ్ల స్వతంత్య్రభారతంలో పాలకులు మారినా వారి విదానాలు, ప్రజల బతుకులు మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి, కార్పోరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొంటూ పాలకులు సేవారంగాలైన విద్య, వైద్యాన్ని అతిపెద్ద వ్యాపారరంగాలుగా మార్చివేశాయని ఆయన ద్వజమెత్తారు. ఆనాడు పెద్దలు భూములు పేదలకు పంచితే ఈనాడు పేదల భూములు పెద్దలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల మద్య అనైక్యతను సృష్టించి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. పేదలు, కార్మికులు, రైతులు, విద్యార్ధులు, యువజన వ్యతిరేక విదానాలను పాలకులు అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో తాను ఛాయ్‌వాలాని అని చెప్పుకొన్న ప్రధాని నరేంద్రమోది కార్పోరేట్‌ల కనుసన్నల్లో పాలన చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని ద్వజమెత్తారు. పాలకుల విదానాలను మార్చేందుకు ప్రజల సమస్యలను తీర్చేందుకు యువకులు త్యాగాలకు సిద్దం కావాలని, యువతను సమీకరించి ఉద్యమించాలని రంగారెడ్డి పిలుపునిచ్చారు. డివైయఫ్‌ఐ జాతీయ ప్రధానకార్యదర్శి అభయ్ ముఖర్జీ మాట్లాడుతూ 1.25 కోట్ల సభ్యత్వంతో దేశంలో మొదటిస్ధానం, ప్రపంచంలో రెండవస్ధానంలో డివైయఫ్‌ఐ నిలిచిందని చెప్పారు. అందరికి ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికి ఉపాధి రావాలంటే సోషలిస్టు వ్యవస్ధ రావాలని ఆయన అన్నారు. రష్యా, చైనా, వియత్నాం, క్యూబా దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్ధ కారణంగా నిరుద్యోగం కనపడదని ఆయన వివరించారు. నిరుద్యోగ సమస్యపై ఆందోళన చేయనున్నట్లు అభయ్ ముఖర్జీ ప్రకటించారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.్భస్కర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హమీని కెసిఆర్ అమలుచేయలేదని ద్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీ, స్ధానికులకు స్ధానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు, పరిశ్రమల స్ధాపనతో ఉపాధికల్పన తదితర హమీలను అమలుచేయడంలో కెసిఆర్ విఫలమయ్యాడని ద్వజమెత్తారు. ఖాళీ ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన లక్ష్యంగా సమరశీలపోరాటాలకు రూపకల్పన చేస్తామని ఆయన ప్రకటించారు. మహాసభలో రాష్ట్ర ఉపాద్యక్షుడు విప్లవకుమార్, జిల్లా అద్యక్షుడు రవినాయక్, జిల్లా కార్యదర్శి జె.నర్సింహరావు, ఆహ్వానసంఘం బాధ్యులు కుక్కడపుప్రసాద్, బుర్రి శ్రీరాములు, యం.వెంకటేశ్వర్‌రావు, వెంకటనారాయణ, ముత్యాలు, వీరాంజనేయులు, రాధాకృష్ణ, ముత్తినేని సైదేశ్వర్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్ర సాధన ఉద్యమానికి ఐలమ్మ స్ఫూర్తి
చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన పోరాటం స్ఫూరిదాయకమైందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఐలమ్మ 31వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి పాఠ్యంశంగా చేర్చిందన్నారు. త్వరలో హైద్రాబాద్‌లో ఆమె విగ్రహం ఏర్పాటును కూడా పరీశీలిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు గుర్రం వెంకట్‌రెడ్డి, చింత శివరామకృష్ణ, మైనం శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల అణిచివేతను ఎదురించి పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శనీయమని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాలడుగు ప్రభావతి, మల్లు లక్ష్మిలు అన్నారు. శనివారం సిపిఎం కార్యాలయంలో జరిగిన ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఐలమ్మ స్ఫూర్తితో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యితిరేక విధానాలపై, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా, సిపిఎం నాయకులు పద్మ, కె.అనురాథ, లీలావతి, ఉమారాణి, రాములమ్మ, సుధాకర్‌రెడ్డి, తిరందాసుగోపి, బండ శ్రీశైలం, రాములు, తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా అదనపు జడ్జి అజిత సింహారావు
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 10: లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకుని కక్షిదారులు, నిందితులు ప్రశాంతత పొందాలని స్థానిక ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి అజిత సింహారావు కోరారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న కేసులను కక్షిదారులు, నిందితులు రాజీ మార్గం ద్వారా పరిష్కారం పొందాలని, ఇది రాజమార్గమని ఆయన అన్నారు. ప్రతి నెల రెండో వారం లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై.సత్యేంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి, అదనపు జూనియర్ జడ్జి ఎ.నాగరాజు, స్పెషల్ మెజిస్ట్రేట్ పి.లక్ష్మినారాయణ, ఎపిపిలు కృష్ణప్రసన్న, నరేందర్‌రెడ్డి, తాజుద్దీన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు జి.రామకృష్ణారెడ్డి, ఎస్.వేలాద్రి, విజయసారధి, ఎండి.ఇబ్రాహిం, లోక్‌అదాలత్ సభ్యులు వై.చంద్రశేఖర్‌రెడ్డి, గౌరు వెంకటేశ్వర్లు, ఎల్.శ్రీనివాస్, ఎల్.అంజయ్య, కె.వెంకన్న, ఉమాశంకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, న్యాయవాదులు వేణుగోపాల్, ఎక్బాల్‌లు పాల్గొన్నారు.

బిజెవైఎం బైక్ ర్యాలీ
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 10 : సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అదికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆద్వర్యంలో శనివారం భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విమోచనదినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 17న అమిత్‌షా వరంగల్‌లో తలపెట్టిన బహిరంగ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో భరత్‌కుమార్,మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్, షణ్ముఖ, ఓరుగంటి రాములు, వెంకటరమణారెడ్డి, శ్యాంసుందర్, బాకి పాపయ్య, పోతెపాక సాంబయ్య,,బండారు ప్రసాద్ శేఖర్,,లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎంసెట్-3
ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 10: నేడు ఎంసెంట్-3పరీక్ష నిర్వాహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 10నుండి 1గంట వరకు జరిగే ఎంసెట్-3పరీక్షకు జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,160మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేస్తుండగా నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించారు. నల్లగొండ ఎన్‌జి కళాశాలలో ఎంసెట్-3పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షకుడు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏడి ధర్మానాయక్ శనివారం సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్‌రెడ్డి, పరీక్షల అధికారులు రూప్‌సింగ్ నాయక్‌లు ఉన్నారు.

శ్రీ విద్యాధరికి లక్ష నాణేల అర్చన!

ఘనంగా మూల ఉత్సవం
గజ్వేల్, సెప్టెంబర్ 10: రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని సుప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి పుణ్యక్షేత్రంలో మూలఉత్సవం సందర్భంగా శనివారం విద్యాధరి అమ్మవారికి లక్ష నాణేల అర్చన జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి ఉత్సవానికి అంకురార్పణ చేయగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, చంఢీహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో తరలిరాగా అమ్మవారి నామస్మరణతో శ్ఘచీంభూగిరులు మార్మోగాయి. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేయగా, భక్తులతో ఆలయాల సముదాయం కళకళలాడింది.

ఐలమ్మ శౌర్యం అజరామరం

మంత్రి హరీష్‌రావు నివాళి
చంద్లాపూర్‌లో విగ్రహావిష్కరణ
చిన్నకోడూరు, సెపెంబర్ 10 : చాకలి ఐలమ్మ వీరత్వం మరువలేనిదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కొనియాడారు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో శనివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 31వ వర్దంతిని పురస్కరించుకొని విగ్రహ ఆవిష్కరణను కొనియాడారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఐలమ్మ ఆశయం అందరికి ఆదర్శప్రాయమన్నారు. ఆమె జీవితకాలంలో ఎన్నో ఒడిదొడుకులు, చిరస్మరణీయ ఘట్టాలు చోటు చేసుకున్నాయన్నారు. తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ మార్కెట్ కమిటీకి చాకలి ఐలమ్మ మార్కెట్‌కమిటీగా పేరు మార్పిడి చేసినట్లు తెలిపారు. అలాగే సిద్దిపేటలో సైతం 20 లక్షల వ్యయంతో చాకలి ఐలమ్మ భవనాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తోనే ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నట్లు తెలిపారు. చాకలి ఐలమ్మను వీరవనితగా రజక సంఘాలు కీర్తిస్తున్నాయని, కావున పేదల కోసం పోరాడిన వీరవనితగా వెలుగెత్తి చాటుతున్నాయని పేర్కొన్నారు.
రూ.1.92 కోట్లతో చంద్లాపూర్‌లో ఇంటింటీకి తాగునీరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 1.92 కోట్ల వ్యయంతో చంద్లాపూర్‌లో తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఇంటింటీకి తాగునీరు అందించేలా 1.50 లక్షల లీటర్లు, 40 వేలు, 20వేల లీటర్ల మేర వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నాయన్నారు. 2016 లోపు చంద్లాపూర్ గ్రామస్తులకు ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలంలోని పెద్దకోడూరు, చంద్లాపూర్ గ్రామాలను మేగా కంపెని దత్తత తీసుకుందని,దశల వారిగా గ్రామాభివృద్దే ధ్యేయంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించేలా కృషిచేశినట్లు తెలిపారు. రంగనాయక్ సాగర్‌లో ముంపుకు గురవుతున్న రేణుక ఎల్లమ్మ ఆలయం గౌడ సంఘం ప్రతినిధులకు 12 లక్షల చెక్కును అందించారు. ఈకార్యక్రమంలో జడ్పిచైర్మన్ రాజమణి, ఎంపిపి మాణిక్యారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత రాధకిషన్‌శర్మ, ఎంపిడిఓ జాఫర్‌ఖాన్, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు, ఓఎస్‌డి బాలరాజు సర్పంచ్‌లు మంగమ్మ, ఎంపిటిసి అరుణ, మండల శాఖ అధ్యక్షుడు కనకరాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

సత్తా చాటిన తెరాస
* మూడు ఎంపిటిసి స్థానాలు కైవసం
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, సెప్టెంబర్ 10: తెలంగాణ పురిటిగడ్డగా పేరుగాంచిన మెదక్ జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదరిస్తూనే ఉన్నారు. జిల్లాలోని మూడు ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు అధికార టిఆర్‌ఎస్ పార్టీకే తమ మద్దతును తెలిపారు. దీంతో జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ మరోమారు తన సత్తాను చాటుకుని తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది. వివిధ కారణాలతో వార్డుల సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసి స్థానాలకు ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువరించింది. వార్డు సభ్యులు, సర్పంచుల పదవులను అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు. కొండపాక మండలం వెలికట్ట, పుల్‌కల్ మండలం కోడూర్, నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్ ఎంపిటిసి స్థానాలకు కూడా ఈ నెల 8వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించారు. వార్డులు, సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించారు. కాగా ఎంపిటిసి స్థానాలకు మాత్రం ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. వెలికట్టలో బూర్గుల మల్లవ్వ, కోడూర్‌లో గంగాగౌడ్, జగన్నాథపూర్‌లో మానిక్యం టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబురాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టింది మొదలుకుని నిన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీయే గెలుపొందుతూ వస్తోంది. మెదక్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించగా నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఉనికినే చాటుకోవడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో స్పష్టమవుతోంది. మొత్తంమీద టిఆర్‌ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పవచ్చు.

మల్లన్నసాగర్ బాధితులకు
కాంగ్రెస్ బాసట
* 12న గజ్వేల్‌లో సంఘీభావ సదస్సు
* ఏర్పాట్లు పరిశీలించిన మాజీ డిప్యూటీ సిఎం
గజ్వేల్, సెప్టెంబర్ 10: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా ఉండి పోరాడతామని మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ నెల 12న గజ్వేల్‌లో నిర్వహించనున్న సంఘీభావ సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన సందర్భంగా శనివారం ఆయన గజ్వేల్‌లో మాట్లాడారు. నిర్వాసితుల విషయంలో టిఅర్‌ఎస్ సర్కార్ తీరు తీవ్ర మనస్తాపాన్ని, బాధిత రైతులను వేధించే విధంగా ఉందని పేర్కొన్నారు. అయితే భూ సేకరణ అంశంలో కోర్టులను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బలవంతంగా భూ సేకరణ జరుపవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2013 భూ సేకరణ జిఒ అమలు చేయటంతోపాటు, బాదిత రైతులను ఆదుకోవాల్సిన సిఎం కెసిఅర్ అవేవీ పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకెళ్తున్నట్లు ఎద్దేవా చేశారు. 100 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టిన ముంపు బాధిత గ్రామాల రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తుండడం ద్వారా ప్రభుత్వ పాశవిక చర్యలు అర్ధం చేసుకోవచ్చని విమర్శించారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని, పోలీసు కేసులు ఎత్తివేయాలని, న్యాయమైన పరిహారం చెల్లించాలని, నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా నిర్వాసితుల ఆవేదనను పట్టించుకోని క్రమంలో సుప్రీంకోర్టుకైనా వెళ్తామని, ప్రాజెక్ట్‌ల అంశంలో కాంగ్రెస్ వైఖరిని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ సిఎం కెసిఅర్, మంత్రి హరీశ్‌రావు మాటలు తప్పుదోవ పట్టించే విదంగా ఉన్నాయని ఆరోపించారు. నేతలు సునితారెడ్డి, శ్రావన్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, సర్దార్‌ఖాన్, గాలెంక నర్సింలు, నర్సింహచారి, సుప్రదాతరావు, వేణుగోపాల్‌రావు, ఎక్బాల్, మోహన్, శ్రీనివాస్, గుంటుకు మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

భక్తులను ఆకట్టుకుంటున్న వైకుంఠపురం గణనాథుడు
* గోమయం, చింతగింజలతో 4 అడుగుల విగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, సెప్టెంబర్ 10: నీటి కాలుష్య కారకమైన రసాయనాలతో వినాయకులను తయారు చేయడం వల్ల పర్యావరణ సమస్య తలెత్తుతుందని, ప్రత్యామ్నాయంగా మట్టి వినాయకులను తయారు చేసి పూజించాలన్న పిలుపును జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ శివారులోని ృ ఆలయ కమిటీ అక్షరాల ముందుకు వచ్చింది. మట్టి వినాయకుల తయారుపై ప్రజల్లో గణనీయమైన చైతన్యం వచ్చినా పూర్తిస్థాయిలో రాకపోగా పిఓపితో తయారైన భారీ వినాయకులనే గణేష్ సంఘాలు మోజుపడుతున్నాయి. వైకుంఠపురం ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా భక్తులను ఆకర్షించే విధంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసారు. గోమయం, చింతగింజల పిండిని మిశ్రమం చేసి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసారు. 4 అడుగుల ఎత్తులో కొలువుదీరిన విఘ్ననాథుడిని భక్తులు విశ్వాసంతో పూజలు నిర్వహిస్తున్నారు. నీటిలో నిమజ్జనం చేసినా కాలుష్యం కాకుండా ఉంటుందని, గోమయం ఎరువుగా ఉపయోగపడుతుందని, చెరువు నీటిని పంటలకు అందిస్తే ఆ నీటిలోని గోమయం ఎంతో దోహదపడుతుందని నిపుణులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యానికి ఏ మాత్రం ప్రమాదం లేకుండా గోమయంతో తయారు చేసిన వినాయకుడిని పూజించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని ఆలయ కమిటి పేర్కొంటుంది.
మెదక్‌లో..
మెదక్: మెదక్ జికెఆర్ గార్డెన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం నాడు మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రాగి అశోక్, ఆ వార్డు కౌన్సిలర్ మేడి మధుసూదన్‌రావు, ఆర్‌కె.శ్రీనివాస్, ఐతారం నర్సింలు, పట్టణ తెరాస అధ్యక్షులు గంగాధర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జికెఆర్ గార్డెన్ గణేష్ మండలి కమిటి వీరందరిని ఘనంగా సన్మానించింది. తరువాత గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీయెత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు పెద్దయేత్తున అన్నదాన కార్యక్రమంలో క్యూలు కట్టారు. ఈ విధంగా మెదక్ పట్టణంలోని అన్ని మండపాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ మొదటి వార్డులో వినాయక మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ కూడా ప్రజలు అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టులు కట్టి తీరుతాం: మంత్రి హరీష్

ఘచీనంగునూరు, సెప్టెంబర్ 10: ఎవరు అడ్డుపడ్డా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని, ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించి రుణం తీర్చుకుంటానని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని ఖానాపూర్‌లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లిడుతూ మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, టిడిపిలు హైకోర్టులో కేసులు వేశారన్నారు. భూములను ఇవ్వకుండా రైతులను ఆపారని, వారు ఆపితే తెలంగాణ ఏర్పాటు ఆగిందా అని మండిపడ్డారు. ఇనే్నండ్లు పాలించిన కాంగ్రెస్, టిడిపిలు ఏనాడు సాగునీరు గురించి ఆలోచించక నిర్లక్ష్యం చేశారన్నారు. ఆనాడు ఈ ప్రాంతానికి సిఎం కెసిఆర్ తాగునీరు అందించాడని, తాను సాగునీరు అందించి ఈప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 35వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. స్వరాష్ట్రంలో మనం కన్న కలలను నిజం చేసేందుకు సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాతో పాటు ఇటీవల ప్రధాని మోదీతో సిద్దిపేట రైల్వేలైన్‌కు శంఖుస్థాపన చేశారన్నారు. జిల్లా ఏర్పాటులో భాగంగా మద్దూరు మండలంలో ఉన్న అర్జున్‌పట్ల, కౌడాయిపల్లి గ్రామాలను చేర్యాల మండలంలో కలుపుకోవడం జరుగుతుందన్నారు. కౌడాయిపల్లి ఫీడర్‌చానల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు చెక్కులను అందించారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన ఖానాపూర్ సర్పంచ్
ఖానాపూర్ సర్పంచు మరియమ్మ, భర్త మంకయ్యతో పాటు పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన మరియమ్మ హరీష్‌రావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టిఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ సారయ్య, ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసి చైర్మన్ పురేందర్, సొసైటి చైర్మన్లు రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

హత్నూర పిఎస్‌లో డిఐజి తనిఖీలు
హత్నూర, సెప్టెంబర్ 10: హత్నూర పోలీస్‌స్టేషన్‌ను శనివారం డిఐజి అకూన్ సబర్వాల్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ హౌజ్ సిబ్బంది నిర్వహించే రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలో గార్డెన్‌ను ఛూసి సిబ్బందిని అభినందించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డిఐజి వెంట ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, కరీంనగర్ ఒఎస్‌డి రోహిణి ప్రియదర్శిని, తూఫ్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, నర్సపూర్ సిఐ తిరుపతిరాజ్, ఎస్‌ఐ బాల్‌రెడ్డి, ప్రోబిషనల్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తప్పుడు లేఖలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారా!
* డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి
నర్సాపూర్,సెప్టెంబర్ 10: ఒకరికి ఒకరు నియోజకవర్గాలను పంచుకొని తప్పుడు లేఖలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు వాకిటి సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శనివారంనాడు నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకరికి ఒకరు ఎవరి తెలియకుండా నియోజకవర్గాలు పంచుకొని తీరా వారికి అనుకూలంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రతి పక్షాలను సంప్రదించకుండ ఇష్టారాజ్యంగా ఇచ్చిన లేఖ వల్ల పరిస్థితి ఇలా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడ నర్సాపూర్‌లో రెవిన్యూ డివిజన్ కావాలని డిమాండ్ చేస్తుందని గుర్తు చేశారు. ఎవరి వత్తిడివల్ల లేఖ ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీలో ఉండి రాస్తారోకోలు, దర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందిన అన్నారు. సిఎంకు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేకు నర్సాపూర్‌లో రెవెన్యూ డివిజన్ చేయడం ఎంతకష్టం కాదని అన్నారు. అలాంటిది ప్రజలకు ఇబ్బంది కరంగా గంటల పాటు రాస్తారోకో నిర్వహించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తాము సంగారెడ్డిలో కలపాలని 65రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన కాలంలో టిఆర్‌ఎస్ పార్టీ తమ వైఖరిని వెల్లడించకుండ ఇప్పుడు వారికి అనుకులంగా రెవిన్యూ డివిజన్ రాకపోయే సరికి ఉద్యమ బాటపట్టారని ఎద్దేవ చేశారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్త, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపిపి లలిత, నాయకులు అశోక్, రాజు, రాజేష్ పాల్గొన్నారు.