రాష్ట్రీయం

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు
నల్లమాడ, నవంబర్ 21: తుఫాన్ కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. వానలకు తడిసిన వేరుశనగ, వరి తదితర పంటలను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలను మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం పరామర్శించారు. వర్షానికి పొలాల్లో తడిసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చేందుకే టిడిపి ప్రభుత్వం ఉందన్నారు. తుఫాన్ కారణంగా పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు అధైర్యపడొద్దన్నారు. పాడయిన వేరుశెనగ, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు.

సాగునీటి సంఘాలకు రూ.5 లక్షల వరద నిధి
ఆత్మకూరు, నవంబర్ 21: తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రతి చెరువును యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు ఒక్కో సాగునీటి సంఘానికి ఐదు లక్షల వంతున సహాయ నిధి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సాగునీటి సంఘాలన్నీ తమ చెరువుల మరమ్మతుల పరిష్కారం, అభివృద్ధి కోసం ఈ నిధిని ఖర్చు చేయాలన్నారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించి వివిధ చెరువులకు చేరిన నీటి నిల్వను, వరదలకు దెబ్బతిన్న రోడ్లు, తదితరాలను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమశిల అతిధిగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. భారీ వర్షాలతో సంగం, నెల్లూరు ఆనకట్టల మీదుగా ఇరవై టిఎంసిల వరకు విలువైన నీళ్లు వృథాగా కడలిపాలైందన్నారు.

దక్షిణ కోస్తా, సీమకు వర్ష సూచన
విశాఖపట్నం, నవంబర్ 21: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఉపరితల ఆవర్తం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు.

సువర్ణముఖిలో ఇద్దరు విద్యార్థినులు మునక
మక్కువ, నవంబర్ 21: విజయనగరం జిల్లా మక్కువ మండలం డి శిర్లాం గ్రామంలో సువర్ణముఖి నదిలో మునిగిపోయి ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. పార్వతీపురం మండలం జమదాల గ్రామానికి చెందిన కర్రి కవిత(13), జమ్మలమడుగు గ్రామానికి చెందిన ఎం తులసి (13)తోపాటు మరో పది మంది శనివారం సువర్ణముఖి నది ఒడ్డున తోటలోకి పిక్నిక్‌కు వచ్చారు. వీరంతా ఆటపాటల్లో ఉండగా కవిత, తులసి నదిలో స్నానం చేసేందుకు దిగారు. అదే ప్రాంతంలో ఇసుక కోసం తవ్విన గోతిలో ఇరుక్కుపోయి నీటమునిగి మృతిచెందారు. విషయం తెలిసిన తోటి పిల్లలు మక్కువ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కృష్ణా నదిలో ముగ్గురి గల్లంతు
చందర్లపాడు, నవంబర్ 21: కృష్ణానదిలో బల్లకట్టుపై ప్రయాణిస్తూ ముగ్గురు యువకులు గల్లంతైన సంఘటన శనివారం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల వద్ద జరిగింది. గుంటూరుజిల్లా పుట్లగూడెం నుండి కృష్ణాజిల్లా గుడిమెట్లకు బల్లకట్టుపై వెళుతున్న మీసాల నరసింహారావు (25), మరిబోయిన గోపి (24), ఎం రమణ (25) ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. బల్లకట్టు రెయిలింగ్‌పై యువకులు కూర్చున్నట్లు తెలిసింది. కృష్ణానది మధ్యకు వచ్చిన తరువాత ఒక వైపునకు కూర్చోవటంతో బలకట్టు ఒరిగి ముగ్గురు నదిలోకి జారినట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై దుర్గాప్రసాద్, తహశీల్దార్ భిక్షారావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సాగర్ కుడికాలువకు నీరు విడుదల
విజయపురిసౌత్, నవంబర్ 21: నాగార్జునసాగర్ జలాశయం నుండి తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువ ద్వారా సరఫరా చేసే నీటిని శుక్రవారం రాత్రి నిలుపుదలచేసి శనివారం సాయంత్రం నీటి సరఫరాను కొనసాగించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో కృష్ణారివర్‌బోర్డు ఆదేశాల మేరకు నాలుగు టీఎంసీల నీటిని ఈనెల ఎనిమిది నుండి కుడికాలువ ద్వారా సరఫరా చేశారు. శుక్రవారం సాయంత్రానికి నీటి విడుదలను 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని తగ్గిస్తూ పూర్తిగా నిలిపివేశారు. సాగర్ ఆయకట్ట పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండకపోవడంతో జిల్లా వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చొరవ తీసుకుని సాగర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం సాగర్ జలాశయం నుండి కుడికాలువకు తొలుత 500క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ప్రస్తుతం మరో 1000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం 508.60 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 130.4532 టీఎంసీలకు సమానం. తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువ ద్వారా 1694 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2610 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ 450 క్యూసెక్కుల నీరు, టోటల్ ఔట్‌ఫ్లోగా 4754 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.