నమ్మండి! ఇది నిజం!!

సజీవ గ్రంథాలు (నమ్మండి.. ఇదినిజం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయం మనిషి పురోగతికి దోహదం చేస్తుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రంథాలయ వ్యవస్థని ప్రజలకి అందుబాటులో ఉంచడం, వారు వాటిని ఉపయోగించుకోవడం జరుగుతూంటుంది. పుస్తకం అనగానే రచయిత గుర్తొస్తాడు. అతను పుస్తకం ద్వారా ఓ కొత్త విషయాన్ని చదువరులకి అందిస్తాడు. ఐతే పాఠకులు ఆ రచయితని తమ సందేహాలు ముఖాముఖి అడిగి నివృత్తి చేసుకునే అవకాశం లేదు. అలాగే రచయిత పుస్తకంలో రాసింది తప్ప ఇంకేమీ చెప్పలేడు. ఈ సమస్యలని డెన్మార్క్‌లోని యువత నడిపే ‘స్టాప్ ది వయోలెన్స్’ (హింసని ఆపండి) అనే లాభాపేక్ష లేని సంస్థ పరిష్కరించింది.
తొలిసారిగా వారు ఆవిష్కరించిన ఆ గ్రంథాలయం పేరు మానవ గ్రంథాలయం. (హ్యూమన్ లైబ్రరీ) 2007లో ఆరంభించిన ఈ గ్రంథాలయంలో పుస్తకాల షెల్ఫ్‌లు, పుస్తకాలు ఉండవు. మానవ పుస్తకాలు అందుబాటులో ఉంటారు! ఈ లైబ్రరీలోని కేటలాగ్‌లోంచి పాఠకులు - శ్రోతలు అంటే సరిగ్గా చెప్పినట్లు అవుతుంది - తాము నేర్చుకోదగ్గ అనుభవాలని లేదా విషయాలని టిక్ చేసుకున్నాక దాన్ని లైబ్రేరియన్‌కి ఇస్తారు. లైబ్రేరియన్ వారిని ఓ చర్చా వేదిక దగ్గరికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి మానవ గ్రంథాన్ని పరిచయం చేస్తారు. తర్వాతి ముప్పై నిమిషాలు వారు కోరే సమాచారం ఆ మనిషి ఇస్తాడు. మధ్యలో శ్రోతల ప్రశ్నలకి ఆ మనిషి జవాబులు ఇస్తాడు. అలా అందుబాటులో ఉండే మానవ గ్రంథాలు ఏ సబ్జెక్ట్‌కి చెందిన వారైనా అవచ్చు. కేటలాగ్‌లోని కొన్ని మానవ గ్రంథాల పేర్లు... సెకండ్ వరల్డ్ వార్ వెటర్న్ (ద్వితీయ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు), ఇరాక్ వార్ వెటర్న్ (ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు), ఆర్ఫనేజ్ బాయ్ (అనాథ పిల్లవాడు), ఒలింపిక్ అథ్లెట్ (ఒలింపిక్ క్రీడాకారుడు), ఫేట్ ఉమన్ (లావుపాటి స్ర్తి), క్వెశ్చనింగ్ క్రిస్టియన్ (క్రిస్టియన్ మతం మీద విశ్వాసం లేనివాడు) చైల్డ్ ఆఫ్ ది హోలోకేస్ట్ సర్వైవర్ (నాజీల డెత్ కేంప్స్ నించి ప్రాణాలతో బయటపడ్డ వారి బిడ్డ), ది జిప్సీ టేల్ (జిప్సీ తెగకి చెందిన మనిషి)
ఈ లైబ్రరీ ఉద్దేశం ఓ వ్యక్తి అనుభవం లేదా వృత్తి గురించి పుస్తకాల మీద ఆధారపడకుండా ముఖాముఖి అడిగి తెలుసుకోవడం. రెండువైపులా సాగే సంభాషణ వల్ల శ్రోతలు కోరే విషయాలన్నీ వారు అడిగి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీన్ని ఇలా చెప్పచ్చు. ఓ పుస్తకాన్ని చదివితే ఇద్దరు పాఠకులకి అందులోని ఒకే విషయాలు అందుతాయి. ఈ లైబ్రరీలోని పద్ధతి వల్ల ఎవరికి వారికి నిజంగా ఉపయోగించే అర్థవంతమైన సమాచారం అందుతుంది.
డెన్మార్క్‌కి ఇతర సంస్కృతులు, ఇతర మతాలు, జాతులకి చెందిన మనుషులు వస్తున్న నేటి నేపథ్యంలో కొందరు డేనిష్ ప్రజలు వారంటే భయపడుతున్నారు. అలాంటి వారి భయాలను పోగొట్టేందుకు కూడా ఈ మానవ గ్రంథాలయం ఉపకరిస్తుంది.
ఈ లైబ్రరీ సంప్రదాయ గ్రంథాలయంలా ఉండదు. కేవలం లైబ్రేరియన్, కేటలాగ్స్, సోఫాలుగల చర్చా వేదికలు మాత్రమే ఉంటాయి. ఆ రోజు ఏ సబ్జెక్ట్ మీద మనుషులు అందుబాటులో ఉంటారో కేటలాగ్‌లో చూడచ్చు. ఈ లైబ్రరీ ప్రయోజనం మనుషుల్లోని పక్షపాతం, అనుమానాలు మాయం అయి ఆరోగ్యకరమైన సామాజిక సంయోగం ఏర్పడుతుంది. ఐతే దీన్ని గ్రూప్ డిస్కషన్‌గా భ్రమ పడకూడదు. అది వేరు. ఈ లైబ్రరీలో జరిగేది వేరు. ఓ ప్రత్యేకమైన విషయం మీద ఇద్దరి మధ్య జరిగే సంభాషణే ఇది. ఐతే ఒకరు సమాచారాన్ని చెప్పేవారు, ఇంకొకరు దాన్ని వినేవారు అవుతారు.
నేడు ప్రపంచంలోని ఏభై దేశాల్లో ఇలాంటి గ్రంథాలయాలు నడుస్తున్నాయి. విదేశాల్లో దీన్ని ఆరంభించింది తొలుత అమెరికానే. కేలిఫోర్నియాలోని శాంటా మోనికా పబ్లిక్ లైబ్రరీలో దీన్ని ఏర్పాటు చేశారు.
మానవ గ్రంథాల్లోని సౌకర్యం ప్రపంచంలో ఎక్కడైనా వీటిని తేలిగ్గా, తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. కావాల్సిందల్లా తమ అనుభవాలని చెప్పే మనుషులు, వాటి మీద ఆసక్తి ఉండి వినడానికి వచ్చే మనుషులు.
యు.కె.లోని మానవ గ్రంథాలయంలో స్వచ్ఛంద గ్రంథంగా నమోదు చేసుకున్న వైన్ ఇలా చెప్తున్నాడు.
‘మానవ కంటితో పుస్తకాన్ని చదివే బదులు చెవులతో వినడం ఓ ప్రత్యేకత. పుస్తకాన్ని జెరాక్స్ తీసుకున్నట్లుగా వినేది అనుమతితో రికార్డు చేసుకోవచ్చు. నా భిన్నమైన జీవితంలో అనేక అందమైన అధ్యాయాలు ఉన్నాయి. అవి ఓ పుస్తకంలోని అనేక అధ్యాయాలు లాంటివి. ఓ పుస్తకంలోని అనేక అధ్యాయాలని తిప్పినట్లే ఇది. నా పధ్నాలుగో ఏట ఓ పడవలో దొంగతనంగా ప్రయాణించడం, పదిహేనవ ఏట స్ట్రిప్పర్స్ (వలువలని వలిచే స్ర్తి, పురుషులు)తో కలిసి జీవించడం లాంటి నా అనుభవాలు లండన్‌లోని మానవ గ్రంథాలయంలో మీరు చూడచ్చు. అంతేకాక ఓ జాతి, మతం, దేశం, ప్రాంతం, సంస్కృతి మీద గల దురభిప్రాయాలు ప్రశ్నల ద్వారా తొలగుతాయి. దీనివల్ల చాలా ప్రశ్నలు మాయం అవుతాయి.’
కెనడాలో వీటికి అధిక ప్రాచుర్యం లభించింది. ఒట్టావా నగరంలో ఐదు మానవ గ్రంథాలయాల బ్రాంచీలు ఉన్నాయి. వారాంతాల్లో అవి బాగా రద్దీగా ఉంటాయి. సౌకర్యవంతమైన సోఫాల్లో కూర్చుని శ్రోతలు మానవ గ్రంథాలు చెప్పే విషయాలని ఆసక్తిగా వింటారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు డెన్నిస్‌ను ఓ ఆదివారం ఓ పదమూడేళ్ల పిల్లవాడు ఆ ఆటలోని మెళకువల గురించి, ఒకరు ఆ క్రీడ గురించి, ఆడవాళ్లు స్వీయ రక్షణ గురించి, ఓ డిఫెన్స్ లాయర్ ఓ కేసు గురించి ప్రశ్నించారు. ఇక్కడ ఇవి ఉదయం పదకొండు నించి సాయంత్రం మూడు దాకా పని చేస్తాయి. ఒకో మానవ గ్రంథంతో కాలపరిమితి ఇరవై నిమిషాలే.
ఇటీవల వివిధ దేశాల మానవ గ్రంథాలని ఎక్స్చేంజ్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అది ఖర్చుతో కూడింది కాబట్టి బహుశా కార్పొరేషన్స్ లాంటివి స్పాన్సర్ చేయడానికి ముందుకు రావచ్చు.

పద్మజ