జాతీయ వార్తలు

జైల్లో చిత్రహింసలు పెట్టారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18:లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భోపాల్ నుంచి పోటీ చేస్తున్న మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనను జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేశారని, రక్తం వచ్చేలా పోలీసులు వంతుల వారీగా కొట్టేవారని తెలిపారు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన సాధ్వీ ప్రజ్ఞ బీజేపీలో చేరడం, వెంటనే భోపాల్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ లభించడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఆమె ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. ఉగ్రవాద కేసు నిందితురాలికి బీజేపీ టికెట్ ఇవ్వడాన్ని విపక్షాలు తీవ్రస్థాయిలో తప్పుబట్టాయి. అనారోగ్య కారణంతో బెయిల్ పొందిన సాధ్వీ ప్రజ్ఞ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, కోర్టును తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇంత మండుటెండల్లో సాధ్వి ప్రచారం చేయగలుగుతున్నారంటే ఆమె ఆరోగ్యం బాగోలేదని ఎలా అనుకుంటామని మాలేగావ్ పేలుడు కేసులో మరణించిన ఓ బాధితుడి తండ్రి కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన సాధ్వీ జైల్లో తన చేదు అనుభవాలను కన్నీటి పర్యంతంగా వెల్లడించారు. ‘నన్ను ఈ కేసులో నన్ను అక్రమంగా తీసుకెళ్లి 13రోజుల పాటు నిర్బంధించారు. మొదటిరోజే కొట్టడం మొదలు పెట్టారు. బెల్టుతో కొడుతున్నప్పుడు నా శరీర నాడీ మండలమంతా స్తంభించిపోయేది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పోలీసులు నన్ను హింసించారు. పేలుళ్ల కేసులో నా పాత్ర ఉందని ఒప్పించడానికే ఇంతగా వేధించారు. తెల్లవారు జాము వరకూ నన్ను చిత్రవధకు గురి చేసేవారు.కొత్తగా డూటీకి వచ్చిన వారూ తాజాగా నాపై వారి ప్రతాపం చూపించేవారు. చేతుల నుంచి రక్తం వచ్చే ప్రమాదం ఉందది భావించినప్పుడే నన్ను కొట్టడం ఆపేవారు. వేడినీళ్లలో ఉప్పువేసి నా చేతులను అందులో ముంచేవారు. మళ్లీ చేతులు మామూలుగా మారిన తర్వాత కొట్టడం మొదలు పెట్టేవారు’అంటూ జైల్లో ఉన్నప్పుడు తాను అనుభవించిన నరకాన్ని ఆమె కళ్లకు కట్టారు. తనపై అనంతరం జరిగిన నార్కో, పాలిగ్రాం, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల వల్ల తనకు కాన్సర్ కూడా వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువులను ఉగ్రవాదంతో ముడిపెట్టిందని, ఆ సాకుతో ఓ మహిళను దారుణంగా వేధించిందన్నారు. తనను వేధించినట్టుగా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలేవిటంటూ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ చేస్తున్న డిమాండ్‌పై స్పందించిన సాథ్వి ‘ ఆధారాలు లేకుండా నేను ఎలాంటి ఆరోపణలు చేయను.కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నేనే సజీవ సాక్ష్యాన్ని’అని అన్నారు. 2008నాటి మాలేగావ్ పేలుడు సంఘటనలో ఏడుగురు మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రథమ ముద్దాయిగా ఉన్న సాద్వీ ప్రజ్ఞకు 2015లో ఎన్‌ఐఎ క్లీన్‌చిట్ ఇచ్చింది. ట్రయల్ కోర్టులో మాత్రం ఆమెకు ఊరట లభించలేదు. సాథ్వి ప్రజ్ఞ ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌ఐఎ స్పష్టం చేసినప్పటికీ పేలుళ్లలో ఆమె మోటారు సైకిల్‌నే ఉపయోగించినందున ఈ వాదనను అంగీకరించలేదని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది.