జాతీయ వార్తలు

ఎన్నికల సంస్కరణలతోనే అక్రమాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాలెగాన్ సిద్ధి, ఏప్రిల్ 20: దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల విధానంలో సమూలంగా సంస్కరణలు తీసురావడం ద్వారా అక్రమాలను నిరోధించడం సాధ్యపడుతుందని ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతికి వ్యతిరేకంగా గత కొనే్నళ్లుగా పోరాడుతున్న అన్నా హజారే అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సంస్కరణలతో స్వచ్ఛమైన విధానాన్ని ఆశించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. 81 ఏళ్ల అన్నా హజారే శనివారం మహారాష్టల్రోని అహమ్మద్‌నగర్ జిల్లాలో గల తన స్వగ్రామంలో పీటీఐ ప్రతినిధితో మా ట్లాడారు. ఎన్నికల్లో ఏదోరకంగా గెలవాలన్న తపనతోనే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఓటర్లలో సైతం ఓటింగ్ పట్ల అవగాహన కరువవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కొత్త ఆశలు చిగురించేందుకు ఆస్కారం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఓటర్లే మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. ‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దఎత్తున నగదు పట్టుబడినట్టు వార్తలు వెలువడ్డాయి. అదేవిధంగా ఓటర్లు సైతం డబ్బులకు ఆశపడి ఓటేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేనా మనకు స్వాతంత్య్రం సముపార్జించిపెట్టిన నాయకులు, పోరాటయోధులకు ఇచ్చే గౌరవం? అని అన్నా హజారే ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఎలాగైనా తమదే ఆధిపత్యం కావాలన్న దృక్పథంతో అవినీతి, అక్రమాలకు, నేరాలకు తెగబడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల పవిత్రత కోల్పోతున్నాయి’ అని ఆయన అన్నారు. ‘ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ గుర్తుతో పోటీ చేసేందుకు కనీస వయసు 25 ఏళ్లు కావడంతో ప్రతి ఒక్కరూ అందుకు ముందుకు వస్తున్నారు. ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని గత ఆరేళ్లుగా నేను కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ‘అమరుల త్యాగాలు సైతం వృథా అవుతున్నాయి. ఓటర్లు చైతన్యవంతులు కాకపోతే ఏదో విధంగా అధికారంలోకి రావాలనే సంస్కృతికి ఇలాగే కొనసాగుతుంది’ అని దిగ్గజ గాంధేయవాది అన్నా హజారే విచారం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటివరకు 32 లేఖలు రాశానని, కానీ ఎలాంటి స్పందన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోక్‌పాల్ వ్యవస్థ తన అంచనాలకు అనుగుణంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, రానున్న రోజుల్లో దేశంలో అవినీతిపై లోక్‌పాల్ పోరాడుతుందనే గట్టి నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఈనెల 23న లోక్‌సభ మూడో దశ పోలింగ్‌లో భాగంగా అహమ్మద్‌నగర్‌కు జరిగే ఎన్నికల్లో తాను ఓటు వేస్తానని ఆయన అన్నారు. అయితే, సరైన వ్యక్తికి ఓటేయాలా? లేదా ‘నోటా’కు వేయాలా అని ఆలోచనలో ఉన్నానని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు.