జాతీయ వార్తలు

పాక్‌ను గట్టిగా హెచ్చరించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్, ఏప్రిల్ 21: బాలాకోట్ దాడి అనంతర పరిణామాల్లో పాక్‌కు చిక్కిన మన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను వెంటనే భారత్‌కు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశాన్ని హెచ్చరించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గుజరాత్‌లోని పటాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ‘బాలాకోట్‌పై మన భద్రతా దళాలు ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడుల అనంతరం పాక్ విమానాలు రావడం, దానిని తరిమికొట్టే క్రమంలో మన ఎయిర్‌ఫోర్సు పైలట్ అభినందన్ పాక్‌కు దొరికారు. దాంతో అతడిని వెంటనే వదిలిపెట్టమని పాక్ దేశాన్ని హెచ్చరించా’ అని తెలిపారు. ఫిబ్రవరి 27న వర్థమాన్ పాక్‌కు చిక్కగా, తన హెచ్చరికల నేపథ్యంలో మార్చి ఒకటిన అతడిని విడుదల చేసిందని ఆయన తెలిపారు. అభినందన్ పట్టుబడిన వెంటనే దీనిపై వెంటనే ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయని చెప్పారు. అతడిని విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌ను హెచ్చరిద్దామని కోరాయన్నారు. కాగా, అభినందన్ పట్టుబడిన తర్వాత రెండో రోజు మోదీ 12 మిస్సయిల్స్‌ను సిద్ధం చేశారని, బహుశా పాకిస్తాన్‌పై వాటితో దాడి చేయవచ్చునని ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపారన్నారు. దీనిపై తన స్పందన కోరగా, దీని గురించి చెప్పేదేమీ లేదని, అవసరమైనప్పుడు మాత్రమే వివరాలు వెల్లడిస్తానని అమెరికా అధికారికి స్పష్టం చేశానన్నారు. ప్రధాన మంత్రి పదవి ఉన్నా లేకపోయినా, తాను బతికి ఉండటమో, ఉగ్రవాదులు అంతం కావడమో జరగాలని కృతనిశ్చయంతో జాతి రక్షణకు కట్టుబడి తాము వైమానిక దాడి జరిపినట్టు ఆయన చెప్పారు. సైనికులపై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌పై ఏదైనా ప్రతీకార చర్య తీసుకోవాలని దేశప్రజలు ఆశించారని, అయితే పాకిస్తాన్ పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేసుకుందని, హనుమంతుడి కృపో, ప్రజల ఆశీర్వాదం వల్లో తమ వాయుసేన ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడులు విజయవంతమయ్యాయని ఆయన చెప్పారు. బాలాకోట్ దాడిపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. అది వారిని చాలా ఇబ్బంది పెడుతోందని, ఒకవైపు భారత్ తమపై దాడి చేసిందని పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంటే, ఆ దాడులు అబద్ధమంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని అన్నారు. దీనిపై ప్రజలు వారిని చీదరించుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
జైపూర్: దేశంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని, వనరుల వృద్ధి విషయంలో అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తన్న విమర్శలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాజస్థాన్‌లోని చిట్టోగర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిందని, అప్పుడు ప్రజలకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని ఆ పార్టీ ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. మనతో పాటు స్వాతంత్య్రాన్ని పొందిన పలు దేశాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని, అయితే దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వంశపాలన, అవినీతి, శుష్క వాగ్దానాల వల్ల భారత్ ఎంతో వెనుకబడిపోయిందని ఆయన అన్నారు.