జాతీయ వార్తలు

‘సెంటిమెంట్’తో సీటు కొట్టేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంపూర్, ఏప్రిల్ 22: యూపీలోని రాంపూర్ నియోజకవర్గ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నటి, మాజీ ఎంపీ జయప్రద ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, సమాజ్‌వాద్ పార్టీ నుంచి ఆజంఖాన్ రంగంలో ఉన్నారు. మంగళవారం పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య ప్రచారం అభివృద్ధి అంశాల కన్నా దూషణలు, అవమానాలు, మెలోడ్రామా అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తోంది. తాము గెలిస్తే నియోజకవర్గానికి ఏమి చేస్తామో చెప్పడం కన్నా తమ ప్రత్యర్థి తమను ఏమని దూషించారు, ఎలా అవమానించారు లాంటి అంశాలనే ఇక్కడ అభ్యర్థులు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ‘నేను నాట్యగత్తెనా? నేను ఆమ్రపాలినా? అని బీజేపీ అభ్యర్థి జయప్రద ఎన్నికల సభలో ఓటర్లను ప్రశ్నించడం.. ఓటర్లతో ‘కాదు’ అని చెప్పించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. రెండుసార్లు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆమె సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నా ఇటీవల జరిగిన పరిణామాలు ఆమెకు సానుభూతిని కలిగించవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా ‘జయప్రద గురించి ఈ నియోజకవర్గ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియడానికి 17 ఏళ్లు పట్టింది. కాని ఆమె ఖాకీ అండర్ వేర్ ధరిస్తుందన్న విషయం నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నా’ అంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే్న రేపాయి. దీనిపై మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా స్పందించగా, వెంటనే అతడిని పోటీ నుంచి బహిష్కరించాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేయడమే కాక, అతడికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల సంఘం 72 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీంతో ఈ అంశాన్ని జయప్రద తనకు సానుకూలంగా మల్చుకుని ఆజంఖాన్ తనను ఎలా దూషించింది, ఎలా అవమానించింది, ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసింది ప్రతి సభ, రోడ్‌షోలో చెబుతూ ప్రజల సానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్య అని, అతివలను అవమానించిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని ఆమె వారిలో సెంటిమెంట్‌ను రగిలిస్తోంది.
మరోపక్క ఆజంఖాన్ తనకు అన్యాయం జరిగిందని ఓటర్ల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. జరిగిన సంఘటనకు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కుమారుడు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన తండ్రి ముస్లిం కాబట్టే ఆయనపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని ఆ వర్గం వారిని ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్, మెలోడ్రామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోపక్క కాంగ్రెస్ తరఫున స్థానిక నేత సంజయ్‌కపూర్ రంగంలో ఉన్నా ఆయన ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఇలావుండగా ఈ నియోజకవర్గంలో ఉండే అధిక శాతం ముస్లింలు ఆజంఖాన్‌కు అండగా నిలుస్తున్నారు. ముస్లిం మహిళలు సైతం తమ ఓటు ఆయనకే వేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ‘ఆమె అండర్‌వేర్ ఉదంతంతో ఓటర్ల సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.. అయినా ఇప్పుడు ఆ అంశం అప్రస్తుతం.. ఏది ఏమైనా మా ఓటు మటుకు ఆజంఖాన్‌కే వేస్తాం’ అని మైమున్నా అనే ముస్లిం మహిళ జయప్రదను ఉద్దేశించి పేర్కొంది. కాగా, ఈ ఎన్నికల్లో దళితులు, యాదవుల ఓట్లు ఖాన్‌కు పడతాయా? బీఎస్పీ ఓట్లు ఆయనకు బదిలీ అవుతాయా అన్నవి ప్రధాన అంశాలు. ఇదే కనుక జరిగితే ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హిందువుల ఓట్లపై జయప్రద పూర్తి నమ్మకంతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ చీల్చే ముస్లిం ఓట్ల వల్ల తనకు ప్రయోజనం కలుగుతుందని ఆమె ఆశిస్తోంది. రాంపూర్ నియోజకవర్గంలో 16 లక్షల మంది ఓటర్లుండగా, అందులో 50 శాతంకు పైగా ముస్లిం ఓటర్లున్నారు. మిగిలినవి హిందువులవి. వీరిలో యాదవులు, జాత్వాలవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 23 వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. 1952 నుంచి 1989 వరకు రాంపూర్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 1991లో బీజేపీ విజయం సాధించగా, 1996లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నూర్‌బానో గెలిచారు. 1998లో బీజేపీ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విజయం సాధించగా, మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో నూర్‌బానో తిరిగి దానిని దక్కించుకున్నారు. 2004 నుంచి 2014 వరకు సమాజ్‌వాద్ పార్టీ తరఫున జయప్రద ఎంపీగా చేశారు. తర్వాత ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.
చిత్రాలు.. జయప్రద (బీజేపీ) *ఆజంఖాన్ (సమాజ్‌వాది)