జాతీయ వార్తలు

వారణాసిలోనూ పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 23: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుండి మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి కనీసం యాభై మంది వారణాసికి తరలివెళ్లి నామినేషన్లు వేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో ముగిసిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి 178 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు మూకుమ్మడిగా ఎన్నికల బరిలో నిలిచి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. భారీ సంఖ్యలో మొత్తం 185మంది అభ్యర్థులు పోటీ చేయడంతో దేశంలోనే తొలిసారిగా మెగా (ఎం-3) ఈవీఎంలను వినియోగిస్తూ పోలింగ్ నిర్వహించడం సరికొత్త చారిత్రక పరిణామంగా నిలిచింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో ఈ ప్రాంత రైతులు సార్వత్రిక ఎన్నికలను వేదికగా మల్చుకుని మూకుమ్మడిగా ఎన్నికల బరిలో నిలువడం ద్వారా వినూత్న రీతిలో తమ నిరసనను చాటినట్లయ్యింది. అయితే ప్రస్తుతం మరికొందరు పసుపు రైతులు ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రైతుల బృందానికి ప్రధానంగా తెలంగాణలోని అధికార తెరాస పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారే నాయకత్వం వహిస్తున్నప్పటికీ, వారణాసిలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని వారు స్పష్టం చేస్తున్నారు. నిజానికి స్థానికంగా ఇందూరులో రైతుల ఆందోళనను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆరోపిస్తున్నారు. పసుపు బోర్డు సాధన కోసం ఎంపీ కవిత పార్లమెంటు వేదికగానే కాకుండా ఇతరాత్ర అన్ని మార్గాల్లోనూ గడిచిన ఐదేళ్ల నుండి నిర్విరామంగా కృషి చేస్తూ వచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం నుండి తాము పోటీకి సిద్ధమయ్యామని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి 50మంది రైతులు నామినేషన్ల కోసం సిద్ధమయ్యామని, దేశ వ్యాప్తంగా తమ డిమాండ్లపై చర్చ జరిగి పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర దక్కాలంటే మిగతా రైతులు కూడా తమతో కలిసి రావాలని కోరుతున్నారు. ఈ దిశగా తమిళనాడుకు చెందిన పసుపు రైతులు కూడా తమతో జతకడుతూ వారణాసిలో మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు సంసిద్ధత తెలిపారని పేర్కొంటున్నారు. ఇక్కడి నుండి వారణాసికి ఎలా తరలివెళ్లాలి, అక్కడ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన ప్రక్రియలను ఎలా పూర్తి చేసుకోవాలనే దానిపై ఇప్పటికే కసరత్తులు జరిపిన రైతు ప్రతినిధులు, వాటికి తుదిరూపం ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద వారణాసిలోనూ ఇందూరు పసుపు రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి తమ సమస్య తీవ్రతను చాటనున్నారు.
*
నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 178 మంది రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో ప్రత్యేకంగా తయారు చేయంచిన ఈవీఎంలు (ఫైల్ ఫొటో)