జాతీయ వార్తలు

ఓకే ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మోదీ మార్కు విజయం మళ్లీ సాకారమైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ సహా అనేక కఠిన నిర్ణయాలు జన బాహుళ్యాన్ని ఇబ్బందులకు గురిచేసినా మళ్లీ జయహో మోదీ అంటూ ఆయనకే పట్టం కట్టారు. ఒకే ఒక్కడుగా ఇటు బీజేపీని దేశవ్యాప్తంగా ముందుకు నడిపించడమే కాదు, దాని విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని అజేయమైన రీతిలో అపూర్వమైన విజయానే్న సాధించిపెట్టారు. దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనా మోదీని గద్దె దించడమే అంతిమ ధ్యేయంగా సిద్ధాంతాలను, విభేదాలను పక్కనపెట్టి జతకట్టినా కూడా నరేంద్ర మోదీ ప్రభంజనం ముందు అవేవీ పనిచేయలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే వ్యక్తి ఓ పార్టీని అతి స్వల్ప వ్యవధిలో అనూహ్యమైన విజయాల పుంతలు తొక్కించడం వరుసగా రెండోసారి కూడా చెక్కుచెదరని ధీమాతో విజయ పీఠాన్ని అధిరోహించడం ఒక్క మోదీకే సాధ్యమైంది. గతంలో ఎందరో నేతలు పార్టీలను నడిపించినా ఒకే వ్యక్తి ప్రాతిపదికగా, కేంద్రకంగా అద్భుతమైన విజయాన్ని సాధించడం... అంతేకాకుండా దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకురాగలగడం కూడా ఒక్క మోదీకే చెల్లింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొని అనతికాలంలోనే జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఔరా అనిపించేలా అద్భుతాలే సృష్టించారు. అద్వానీ, జైట్లీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్‌సింగ్ వంటి జాతీయ స్థాయిలో ఉద్దండులైన నేతలు ఎందరో ఉన్నా వారందర్నీ కాదని తానే సర్వస్వం అన్న రీతిలో బీజేపీని 2014లో అధికారంలోకి తెచ్చిన మోదీ ఐదేళ్ల పాలన అనంతరం తానేమిటో తన పాలనా పటిమ ఏమిటో విధానపరమైన నిబద్ధత ఎలా ఉండాలో ప్రజలకు చూపించారు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఒక ధ్యేయాన్ని నిర్దేశించుకోవాలనుకున్నప్పుడు అందుకు అనుసరించాల్సిన బాట కూడా కఠినంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే అవినీతిని అంతం చేసేందుకు నల్లధనాన్ని తుదముట్టించేందుకు పెద్దనోట్ల రద్దు వంటి చారిత్రక నిర్ణయాన్ని రెండో ఆలోచన లేకుండా మోదీ తీసుకోగలిగారు. మొదట్లో విమర్శలు వెల్లువెత్తినా దేశ హితం కోసం ఆ నిర్ణయాన్ని ఇబ్బందులు పడ్డా జనం సమర్థించారు. అందుకు నిదర్శనమే బీజేపీకి లభించిన తాజా విజయం. ఈ ఐదేళ్లలో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను ఇనుమడించిన మోదీ పొరుగున ఉన్న పాకిస్తాన్‌కు చెంపపెట్టు లాంటి నిర్ణయాలు తీసుకుని దేశ భద్రత తలమానికమన్న వాస్తవాన్ని చాటిచెప్పారు. లక్షిత దాడులు చేసి ఉగ్ర మూకలను అంతం చేయాలన్న కఠిన తీసుకోవాలన్నా అది తనకే చెల్లిందన్న నిజాన్ని మోదీ రుజువు చేయగలిగారు. మొత్తంమీద పాకిస్తాన్‌ను దారికి తీసుకురావడమే కాదు, ఇరాన్ విషయంలో అమెరికా ఆంక్షల బెదిరింపులను ఖాతరు చేయకుండా తనదైన పంథాలోనే ముందుకు సాగారు. యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడం మోదీ ఘనతే. ఈ ఐదేళ్లలో ఎన్నో తిరస్కారాలను, విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ తదేక దీక్షతో అనుకున్న పథంలోనే ఆయన ముందుకు సాగారు. అంతేకాదు, అనుకున్నట్టుగానే బీజేపీని రెండోసారి అద్భుత మెజారిటీతో కేంద్రంలో అందలం ఎక్కించగలిగారు. ఒక వ్యక్తి తలుచుకుంటే దేన్నైనా సాధించగలడు అని చెప్పడానికి, దానికి అకుంఠిత దీక్ష తోడైతే ఎంతటి విజయమైనా కరతలామలకమవుతుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోదీ.

- బుద్దవరపు రాజేశ్వర ప్రసాద్