జాతీయ వార్తలు

బీజేపీ అభ్యర్థి పాటిల్ రికార్డు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ రికార్డు స్థాయిలో ఘన విజయాన్ని నమోదు చేశారు. గుజరాత్‌లోని నవ్‌సారి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పాటిల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 6.89 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఒక అభ్యర్థికి ప్రత్యర్థి కంటే అత్యధికంగా ఓట్లు రావడం గొప్ప విషయం. బీజేపీలోని పాటిల్ సహచరులు కొందరు 6 లక్షలకు పైగా తేడాతో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్థులపై విజయం సాధించారు. వారిలో సంజయ్ భాటియా హర్యానాలోని కర్నాల్ నుంచి 6.56 లక్షలు, ఫరీదాబాద్ నుంచి పోటీ చేసిన క్రిషాన్ పాల్ 6.38 లక్షల ఓట్ల తేడాతో తమ ప్రత్యర్థులపై విజయాన్ని అందుకున్నారు. అదేవిధంగా రాజస్తాన్‌లోని భిల్వారా నుంచి పోటీ చేసిన సుభాష్ చంద్ర బహేరియా 6.12 లక్షలు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి పోటీ చేసిన శంకర్ లాల్‌వానీ 5.47 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా 12 మంది అభ్యర్థులు 5 లక్షల తేడాతో తమ సమీప ప్రత్యర్థులపై ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి రెండోసారి పోటీ చేసి 4.79 లక్షల ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, సమాజవాది పార్టీ అభ్యర్థి శాలినీ యాదవ్‌పై ఘన విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇలాంటి సంఘటనే జరిగింది. మహారాష్టల్రో బీడ్ లోక్‌సభ స్థానానికి 2014 అక్టోబర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి, దివంగత గోపీనాథ్ ముండే భార్య ప్రీతమ్ ముండే తన సమీప ప్రత్యర్థిపై 6.96 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. అదే ఏడాది అతి తక్కువ ఓట్లతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భోలనాథ్ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లోని మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన భోలనాథ్ తన ప్రత్యర్థిపై కేవలం 181 ఓట్ల తేడాతో విజయం సాధించారు. లక్షద్వీప్ నుంచి ఎంపీగా బరిలో నిలిచిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అభ్యర్థి మహమ్మద్ ఫైజల్ పీపీ తన సమీప ప్రత్యర్థిపై కేవలం 823 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరో ఐదుగురు అభ్యర్థులు సైతం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 2 వేలలోపు ఓట్ల తేడాతో గెలుపు సాధించినవారిలో ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా 1,445 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అపురూప పొద్దార్ 1,142 ఓట్ల తేడాతో పశ్చిమబెంగాల్‌లోని ఆరంబాగ్ నుంచి గెలిచారు. అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి విశాల్ జోలీపై కేవలం 1,407 తేడాతో విజయం సాధించారు. చండీశ్వర్ ప్రసాద్ జనతాదళ్ (యునైటెడ్) బీహార్‌లోని జహానాబాద్ నుంచి 1,751 ఓట్లు, బీజేపీ అభ్యర్థి వి.శ్రీనివాస్ ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,817 ఓట్ల తేడాతో గెలిచారు. ఇదిలావుండగా, ప్రస్తుత లోక్‌సభలో మొత్తం 541 స్థానాలకు ఫలితాలు వెలువడగా వాటిలో బీజేపీ ఒక్కటే అత్యధికంగా 302 సీట్లతో ఘన విజయాన్ని అందుకుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి 5.57 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఇదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దిగ్గజ నేత ఎల్.కే.అద్వానీ 4.83 ఓట్లతో విజయం సాధించారు. ఇదిలావుండగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థుల కంటే అత్యధిక ఎక్కువ తేడాతో విజయాలను నమోదు చేశారు.