జాతీయ వార్తలు

కురిస్తే ‘కుర్ది’ కానరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూన్ 16: అది గోవాలోని ఓ చిన్ని గ్రామం. ఇంకా చెప్పాలంటే ముంపు గ్రామం. ఆనకట్ట నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామం. ఏడాది పొడవునా అది నిజంగానే ముంపులోనే ఉంటుంది. మే నెలలో కొద్ది రోజులు మినహా. ఈ ప్రత్యేకతే ఆ గ్రామానికి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ గ్రామం పేరే కుర్ది. వర్షాలు పడినప్పటినుంచి మళ్లీ వేసవి వచ్చే వరకూ కుర్ది గ్రామం నీటిలోనే ఉంటుంది. వేసవిలో నీరు తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆ గ్రామం వెలుగుచూస్తుంది. కుర్దిలో ఉన్న శివాలయం కూడా అప్పటివరకూ నీటిలోనే మునిగి ఉండటం గమనార్హం. నీరు పూర్తిగా తగ్గిన ఆ కొద్ది రోజులు అక్కడ పండగ వాతావరణమే ఉంటుంది. పర్యాటకులు, పునరావాసం పొందిన ఆ గ్రామస్థులు అక్కడి చేరుకోవడంతో ఆ కొద్దిరోజులు సందడి సందడిగా ఉంటుంది. ఈ సమయంలోనే అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుర్దిని సందర్శించేందుకు వేసవికాలం అటు పర్యాటకులు, ఇటు గ్రామస్థులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి లేదు. దక్షిణ గోవా జిల్లాలోని పశ్చిమ కనుమలకు ఆనుకుని ఉంది కుర్ది గ్రామం. ఇక్కడ 600 కుటుంబాలు నివసించేవి. 1970ల్లో సేలాలిమ్ నదిపై ఆనకట్ట నిర్మించాలని అప్పటి గోవా ముఖ్యమంత్రి దయానంద్ బందోడ్కర్ నిర్ణయించడం, దానికి గ్రామస్థులు సమ్మతి తెలపడం చకచకా జరిగిపోయింది. ముంపునకు గురవుతున్న గ్రామంలోని అన్ని కుటుంబాలకు వద్దెన్, వాల్కిని గ్రామాల్లో పునరావాసం కల్పించారు. 1976లో ప్రారంభమైన ఈ ఆనకట్ట నిర్మాణం 2000లో పూర్తయింది. అయితే 1986 నుంచి కుర్ది గ్రామం ముంపులోనే ఉండటం ప్రారంభమైందని, ఆనకట్ట కోసం గ్రామస్థులు చేసిన త్యాగం చాలా గొప్పదని ప్రకాష్ కుర్దికర్ అనే వృద్ధుడు వ్యాఖ్యానించారు. అది బయటికి చెప్పుకోలేని భావోద్వేగం గ్రామస్థులందరిలోనూ ఉంది. గోవా రక్షణ కోసం ఆనకట్ట నిర్మాణం చేపట్టడం, దాని కోసం యావన్మంది గ్రామస్థులు స్వచ్ఛందంగా తరలివెళ్లడానికి సిద్ధపడి ఎవరూ చేయలేని త్యాగాన్ని ప్రపంచానికి చాటారని ఆయన వ్యాఖ్యానించారు. వేసవిలో పదిరోజులు మినహా ఏడాది పొడవునా కుర్ది ముంపులోనే ఉంటుంది. వర్షాలు ప్రారంభమైన వారం పది రోజుల్లోనే గ్రామం మాయమవుతుంది. ఈసారి రుతుపవనాలు ఆలస్యం కావడంతో గ్రామం ఇంకా కనపడుతోంది. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్ది గ్రామం ఒక దశలో ఓ దీవిలో దర్శనమిస్తుంది. ఆ దృశ్యం కోసం పర్యాటకులు, గ్రామస్థులు ప్రతి ఏటా ఎదురుచూడటం కుర్ది ప్రత్యేకత.