జాతీయ వార్తలు

శాంతించని జూడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 16: పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఆదివారంనాటికి ఆరో రోజుకు చేరుకుంది. వైద్యుల ఆందోళన రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ డిమాండ్ల పరిష్కారానికి జూనియర్ డాక్టర్లు గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో వివిధ చికిత్సల కోసం ఆసుపత్రులకు వస్తున్న రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో గుండె సంబంధిత జబ్బుతో అడ్మిట్ అయిన రాయ్‌గంజ్‌కు చెందిన శామ్యూల్ హక్ మాట్లాడుతూ తన జబ్బుకు ఎప్పుడు ట్రీట్‌మెంటు జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నానని అన్నాడు. శామ్యూల్ సోదరుడు మాట్లాడుతూ ‘గత ఆదివారంనాడు మేము కోల్‌కతా వచ్చాము. ఇక్కడ అంతా బాగుంది. ఔట్‌పేషెంట్ విభాగం కూడా పనిచేస్తోంది. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో మా సోదరుడిని చేర్చాం. వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి మంగళవారంనాడు ఆపరేషన్ కోసం తేదీ ఖరారు చేశారు. కానీ ఇపుడు డాక్టర్లెవరూ అందుబాటులో లేరు. సీనియర్ వైద్యులు సైతం తగిన సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. మా సోదరుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇపుడు ఉన్నఫలంగా అతనిని ఇంటికి తీసుకెళ్లడం కష్టం. సోమవారం వరకు వేచిచూస్తాం’ అని పేర్కొన్నాడు. గత సోమవారంనాడు ఆసుపత్రిలో ఒక రోగి మరణించిన నేపథ్యంలో ఇద్దరు జూనియర్ వైద్యులపై మృతుని కుటుంబ సభ్యులు చేయి చేసుకోవడంతో వైద్యులు ఆందోళనకు దిగారు. తమకు భద్రత కల్పించాలంటూ వందలాది డాక్టర్లు తమ సహచర సిబ్బందికి మద్దతుగా రాజీనామా చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మె రోజురోజుకూ ఎక్కువ కావడంతో స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారంనాడు చర్చలకు ఆహ్వానించడం ద్వారా విధులకు హాజరు కావాలని డాక్టర్లను విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా వైద్యులు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్నారు. చర్చలకు ప్రభుత్వమే స్వయంగా దిగిరావాలని వారు డిమాండ్ చేశారు. ఆదివారంనాటికి వైద్యుల సమ్మె ఆరో రోజుకు చేరుకోవడంతో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. అత్యవసర ఆపరేషన్ల కోసం తేదీలు ఖరారు చేసుకుని ఆసుపత్రుల్లో చేరిన రోగుల పరిస్థితి వర్ణనాతీతం. జూనియర్ డాక్టర్ల సహకారం లేనిదే తామేమీ చేయలేమంటూ సీనియర్ వైద్యులు చేతులెత్తేస్తుండడంతో రోగులు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ఆర్‌జీ కర్ ఆసుపత్రి, కోలకతా నేషనల్ మెడకల్ కాలేజీ, ఆసుపత్రి, చిత్తరంజన్ నేషనల్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి తదితర ఆసుపత్రులు, వైద్య కళాశాల్లోనూ వైద్యులు సమ్మెకు దిగడంతో వివిధ సేవలు, చికిత్సలు, ఆపరేషన్ల కోసం చేరిన రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జూనియర్ డాక్టర్లతో స్వయంగా చర్చలు జరపడానికి, తద్వారా సమ్మె పరిష్కారానికి ముందుకు రావడం లేదని పలువురు రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు.

చిత్రం...కోల్‌కతాలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న మత నాయకులు