జాతీయ వార్తలు

సభ ..నవ ప్రభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: భాషా వైవిధ్యం, సాంస్కృతిక సౌరభంతో 17వ లోక్‌సభ సోమవారం కొలువుతీరింది. ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న కొత్త సభ తొలి రోజు ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన 320 మంది సభ్యులు వివిధ భాషల్లో ప్రమాణం చేయడం కొత్త సభ్యులు సాంప్రదాయక దుస్తుల్లో తరలిరావడం, వైవిధ్య భారతానికి అద్దం పట్టింది.
పదిహేడవ లోక్‌సభ మొదటి రోజు సమావేశం కొత్త సభ్యుల సభ్యత్వ ప్రమాణాలతో ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ కొత్త సభ్యుల చేత సభ్యత్వ ప్రమాణం చేయించారు. మొదటి రోజు సమావేశంలోనే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గొడవ మొదలైంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి లోక్‌సభకు ఎన్నికైన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సభ్యత్వ ప్రమాణంలో తన పేరుతోపాటు గురువు పేరు చెప్పటం గొడవకు దారితీసింది. అధికార పక్షం సభ్యులు సభ్యత్వ ప్రమాణం చేసిన అనంతరం ‘భారత్ మాతాకీ జై’ అని నినదించటం పట్ల కూడా కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనికి ప్రతిగా బీజేపీ సభ్యులు మధ్య మధ్యలో ‘భారత్ మాతాకీ జై’ అంటూ ఇచ్చిన నినాదాలతో సభ పలుమార్లు దద్దరిల్లిపోయింది. సభలో ‘వందేమాతరం’ నినాదాలు కూడా వినిపించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఉదయం రాష్టప్రతి భవన్‌లో వీరేంద్ర కుమార్ చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే మొదట జాతీయ గీతాలాపన జరిగింది. వెంటనే వీరేంద్ర కుమార్ సభ్యుల సభ్యత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్రాల వారీగా చేపట్టారు. మొదట లోక్‌సభ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ్యత్వ ప్రమాణం చేశారు. మోదీ సభలోకి అడుగు పెట్టినప్పుడు బీజేపీ, మిత్రపక్షాల సభ్యులు బల్లలు చరుస్తూ స్వాగతం తెలిపారు. తరువాత మోదీ సభ్యత్వ ప్రమాణం చేసేందుకు లేవగానే ఎన్‌డీఏతోపాటు ప్రతిపక్షానికి చెందిన కొందరు సభ్యులు కూడా ‘మోదీ.. మోదీ’ అంటూ పెద్దఎత్తున నినాదాలు ఇవ్వడంతో లోక్‌సభ దద్దరిల్లిపోయింది. మోదీ సభ్యత్వ ప్రమాణం ముగియగానే కేంద్ర మంత్రి అథవాలే జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ ప్రశ్నించటంతో అధికార పక్షం సభ్యులు ఘొల్లున నవ్వారు. ఉదయం లోక్‌సభకు హాజరుకాని రాహుల్ గాంధీ సాయంత్రం ముడున్నర సమయంలో సభకు వచ్చి సభ్యత్వ ప్రమాణం చేశారు.
మోదీ అనంతరం స్పీకర్ ప్యానెల్ ముగ్గురు సభ్యులు కాంగ్రెస్‌కు చెందిన కే.సురేష్, బీజేడీకి చెందిన భర్తృహరి మహతాబ్, బీజేపీకి చెందిన బ్రిజ్‌భూషన్ చరణ్‌సింగ్ సభ్యత్వ ప్రమాణం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో రెండో స్థానాన్ని అక్రమించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తరువాత ప్రమాణం చేశారు. ఇది జరిగిన అనంతరం హోం శాఖ మంత్రి అమిత్ షా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితర క్యాబినెట్ మంత్రులు, ఆ తరువాత ఇండిపెండెంట్ శాఖల మంత్రులు, సహాయ మంత్రులు సభ్యత్వ ప్రమాణం చేశారు. ఆ తరువాత సహాయ మంత్రులు సభ్యత్వ ప్రమాణం చేశారు. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్ పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ సభ్యత్వ ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వచ్చినప్పుడు అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాన్ని ప్రకటించారు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం బల్ల చరుస్తూ ఆమెకు మద్దతు పలికారు. స్మృతీ ఇరానీ సభ్యత్వ ప్రమాణం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ అధికార పక్షానికి చెందిన సభ్యులు కాంగ్రెస్‌పై వ్యంగ్య ప్రశ్నలు కురిపించారు. మంత్రివర్గం సభ్యత్వ ప్రమాణం జరిగిన అనంతరం అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా లోక్‌సభ సభ్యుల సభ్యత్వ ప్రమాణం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రారంభంలోనే సభ్యత్వ ప్రమాణం చేశారు. మొదట అండమాన్ నికోబార్, ఆ తరువాత అరుణాచల్‌ప్రదేశ్ ఎంపీల సభ్యత్వ ప్రమాణం ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు క్యాబినెట్ మంత్రులు ప్రమాణం చేసిన అనంతరం నరేంద్ర మోదీ తన కార్యాలయానికి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను భోపాల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఓడించిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సభ్యత్వ ప్రమాణం గొడవకు దారితీసింది. కాషాయ వస్త్రాల్లో ఉన్న ప్రజ్ఞాసింగ్ సభ్యత్వ ప్రమాణం కోసం తన పేరుతోపాటు తన గురువు పేరు కూడా చదవటాన్ని కాంగ్రెస్ సభ్యులు సురేష్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజ్ఞాసింగ్ తన పేరు చదవాలి తప్ప తన గురువు పేరు కాదంటూ వారు గొడవ చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ జోక్యం చేసుకుని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సర్ట్ఫికెట్‌లో ఉన్న పేరు మాత్రమే చదవాలని సూచించారు. అయితే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాత్రం తన పేరుతోపాటు గురువు పేరు కూడా చదివిన అనంతరం దైవసాక్షిగా సంస్కృతంలో ప్రమాణం చేసిన అనంతరం ‘్భరత్ మాతాకీ జై’ అంటూ నినదించారు. ప్రజ్ఞాసింగ్ సభ్యత్వ ప్రమాణాన్ని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించి గొడవ చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర సింగ్ కాంగ్రెస్ సభ్యులను శాంతపరుస్తూ భోపాల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సర్ట్ఫికెట్‌లో ఉన్న పేరు మాత్రమే రికార్డుల్లో ఉంటుంది. మిగతా పేరును రికార్డుల నుండి తొలగిస్తామని కాంగ్రెస్ సభ్యులకు హామీ ఇవ్వటంతో సభ సద్దుమణిగింది. బీజేపీకి చెందిన పలువురు సభ్యులు తమ సభ్యత్వ ప్రమాణం తరువాత ‘భారత్ మాతాకీ జై’ అనటం పట్ల కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనికి ప్రతిగా పలువురు బీజేపీ సభ్యులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ పెద్దఎత్తున నినదించారు. దీనితో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ జోక్యం చేసుకుని సభ్యులు సభ్యత్వ ప్రమాణ పత్రంలో ఉన్నది మాత్రమే చదవాలని రూలింగ్ ఇచ్చారు.

చిత్రం... వీరేంద్ర కుమార్ చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్