జాతీయ వార్తలు

నవ భారతం.. ప్రగతిపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: దేశంలోని ప్రతి వ్యక్తికి సాధికారిత అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇకమీదట కూడా కొనసాగించేందుకే దేశ ప్రజలు రెండోసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. పదిహేడవ లోక్‌సభ ఏర్పడిన సందర్భంగా గురువారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. గంటపాటు సాగిన ప్రసంగంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ను సమర్థించాలని వివిధ రాజకీయ పార్టీలను కోరడంతోపాటు ‘త్రిపుల్ తలాక్’ బిల్లును ఆమోదించటం ద్వారా ముస్లిం మహిళల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. దేశంలో తరచు ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కుంటుపడుతోంది.. ఈ సమస్యను పరిష్కరించటంతోపాటు నిరంతరం అభివృద్ధికోసం లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలనే అభిప్రాయాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ అనేది ఇప్పుడు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగటం వలన దేశానికి ఎంతో మేలు జరుగుతుందని రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన గురించి ఎంపీలు లోతుగా ఆలోచించాలని రామ్‌నాథ్ సూచించారు.
దేశ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత స్పష్టమైన తీర్పు ఇచ్చారు.. మోదీ ప్రభుత్వం మొదటి నాలుగు సంవత్సరాల్లో చేసిన పనిని మదింపు చేసిన అనంతరం రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించారని రాష్ట్రపతి వివరించారు. 2014లో ప్రారంభించిన అభివృద్ధి పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలని తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. 2014కు పూర్వం నెలకొన్న నిరాశ, నిస్పృహలు, అస్థిరత నుండి దేశాన్ని కాపాడేందుకే ప్రజలు గత ముఫ్పై సంవత్సరాల్లో ఇవ్వనంత భారీ మెజారిటీతో మోదీ ప్రభుత్వాన్ని గెలిపించారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ప్రజలిచ్చిన ఈ తీర్పుకు అనుగుణంగా తన ప్రభుత్వం ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ నినాదంతో నవ భారత నిర్మాణ కార్యక్రమం చేపట్టిందన్నారు. తన ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది.. ప్రభుత్వం తమతో ఉన్నదనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించిందని అన్నారు. సమ్మిళిత భారత్ నిర్మాణం దిశగా తన ప్రభుత్వం సాగుతోందన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‌తోపాటు ‘సబ్ కా విశ్వాస్’ లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి చెప్పారు. 21వ శతాబ్దం వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు శక్తివంతమైన భారత్ ఆవిర్భావానికి అవసరమైన వనరుల సమీకరణ జరుగుతుందని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. తన ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 21 రోజుల్లోనే రైతులు, సైనికులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాల అభ్యున్నతికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నది.. కొత్త చట్టాలను అమలులోకి తెచ్చేందుకు అవసరమైన చొరవ కూడా తీసుకుంటోందని అన్నారు. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ని రైతులందరికీ వర్తింపజేయాలనే నిర్ణయం తీసుకున్నది. 60 సంవత్సరాలు నిండిన రైతులందరికీ పెన్షన్ పథకం అమలు చేస్తోందన్నారు. ‘జాతీయ రక్షణ నిధి’ కింద భద్రతాదళాల పిల్లలకు అందజేసే ఉపకార వేతనాలను పెంచటం జరిగిందన్నారు. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను అమలు చేసినట్లే జల పరిరక్షణ, నిర్వహణను అమలు చేస్తారు.. దీనికోసమే జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. కరవు నెలకొన్న ప్రాంతాల్లో నివారణ, సహాయ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు రానున్నకాలంలో ఈ రంగంలో 25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఆయన ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు తన ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నదని ఆయన చెప్పారు. ‘కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా సాలీనా 90వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేస్తున్నారని రాష్ట్రపతి చెప్పారు. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించేందుకు ‘నీలి క్రాంతి’ని తెస్తామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఒకటిన్నర లక్షల పోస్ట్ఫాసులను బ్యాంకులుగా మారుస్తున్నాం.. తద్వారా బ్యాంకింగ్ సేవలను సగటు మనిషి వద్దకు తీసుకుపోతున్నామని రాష్ట్రపతి తెలిపారు. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలను స్థాపిస్తామని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. దేశంలోని గిరిజనుల అభివృద్ధికి ‘విద్యాభ్యాసంలోనే సంపాదన’ పథకాన్ని అమలు చేయటంతోపాటు ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోని ప్రతి సోదరికి, కూతురుకి సమాన హక్కులు లభించేలా చూసేందుకు ‘త్రిపుల్ తలాక్’, ‘నిఖా హలాల్’ వంటి సామాజిక రుగ్మతల నిర్మూలన ఎంతో అవసరమని రాష్టప్రతి ప్రకటించారు. వీటిని తొలగించటం ద్వారా ఆడపడచుల జీవితాలను బాగుపరచటంతోపాటు గౌరవప్రదం చేసేందుకు ప్రతి సభ్యుడు సహకరించాలని కోవింద్ పిలుపు ఇచ్చారు. దేశంలోని వివిధ నగరాల్లో వస్తున్న మేట్రో ప్రయాణం కోసం ‘ఒక దేశం.. ఒక కార్డు’ విధానాన్ని ప్రారంభించామని రాష్ట్రపతి చెప్పారు. పార్లమెంటు సభ్యులు మరోసారి దేశాభివృద్ధికి తమను తాము అంకితం చేసుకోవాలని కోవింద్ హితవు చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.రాష్ట్రపతి ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇంగ్లీష్‌లో చదివి వినిపించారు.

చిత్రాలు..ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు వస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తోడ్కొని వస్తున్న ప్రధాని మోదీ *పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి కోవింద్