జాతీయ వార్తలు

ఫలిస్తున్న బుజ్జగింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. హోస్‌కోటే కాంగ్రెస్ ఎమ్మెల్యే, హౌసింగ్ మంత్రి నాగరాజ్ తన రాజీనామా ఉపసంహరించుకోనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. మిగతా అసమ్మతి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఒప్పిస్తానని శనివారం ఇక్కడ ప్రకటించారు. రాజీనామా చేసిన 16 మంది రెబల్స్‌లో నాగరాజ్ ఒకరు. మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన నాగరాజ్ మెత్తబడ్డారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని సిద్దరామయ్య చేసిన అభ్యర్థన మేరకు ఆయనీ నిర్ణయానికి వచ్చారు.
‘సిద్దరామయ్య, దినేష్ గుండూరావుఇద్దరూ రాజీనామా ఉపసంహరించుకోమని నన్ను అడిగారు. పార్టీలోనే కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆలోచించుకోడానికి కొంత సమయం కావాలని చెప్పాను’అని నాగ్‌రాజ్ మీడియాకు వెల్లడించారు. ‘రాజీనామా ఉపసంహరించుకోవాలని చిక్‌బల్లాపూర ఎమ్మెల్యే సుధాకర్‌తో మాట్లాడి ఒప్పిస్తానని కాంగ్రెస్ నేతలకు చెప్పాను. అందరం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం’అని ఆయన వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర, రాష్ట్ర జలవనరుల మంత్రి డీకే శివకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలతో నాగరాజ్ సమావేశమయ్యారు. సమస్యలన్నీ పరిష్కారమైనట్టు భావించాలా? అన్న మీడియా ప్రశ్నకు‘ అప్పుడున్న పరిస్థితుల్లో అసంతృప్తితో రాజీనామా చేశాను. ఇలాంటి పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంటాయి’ అని బదులిచ్చారు. తనతోపాటు రాజీనామా చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోందని, తాను కూడా అదే పనిలో ఉన్నానని మంత్రి నాగరాజ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ శనివారం ఉదయమే నాగరాజ్ నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. సుమారు నాలుగున్నర గంటల సేపు హోస్‌కోటే ఎమ్మెల్యేతో డీకే చర్చించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర కూడా నాగరాజ్ ఇంటికి చేరుకుని రాజీనామా ఉపసంహరణకు ఒప్పించారు. మరో నలుగురు రెబల్స్ రామలింగారెడ్డి, మునిరత్న, కే సుధాకర్, ఆర్ రోషన్ బేగ్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాగే ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. అసమ్మతి ఎమ్మెల్యేలందరూ మనసుమార్చుకుని రాజీనామాలు ఉపసంహరించుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా జరుగుతుండగా బీజేపీ నేతలు పలువురు ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభరెడ్డితో వెళ్లి రామలింగారెడ్డిని కలుసుకున్నట్టు తెలిసింది. దీనిపై రామలింగారెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోమవారం వరకూ రాజకీయాలపై తానేమీ మాట్లాడదలచుకోలేదని ఆయన చెప్పారు. రామలింగారెడ్డి కుమార్తె, శాసన సభ్యురాలు సౌమ్యారెడ్డి కూడా ఆ సమావేశం విషయం తనకు తెలియదని అన్నారు. ‘నేను కాంగ్రెస్ వాదిని. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. మా నాన్న రాజీనామా చేశారు. దానికి సంబంధించిన ప్రశ్నలేమైనా ఉంటే ఆయనే్న అడగండి’ అని ఆమె అన్నారు. ఇలా ఉండగా తాజా రాజీకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప స్పందించారు. ‘కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం ముదిరింది. దీనిపై ఎవరికీ ఎలాంటి గందరగోళం లేదు. ప్రభుత్వం ఏ క్షణాన్నైనా కూలిపోవడం ఖాయం‘అని అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ఈ దశంలో బలపరీక్ష అర్ధరహితం అని ఆయన చెప్పారు. కాగా రెబల్స్ రాజీనామాలు ఆమోదించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం విదితమే. మంగళవారం వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది.

చిత్రం...కర్నాటక రాజకీయ సంక్షోభం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నేపథ్యంలో
శనివారం షిర్టీ సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు జరుపుతున్న రెబల్ ఎమ్మెల్యేలు