జాతీయ వార్తలు

ఉగ్రవాదం అంతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిల్లో కూడా జాతీయ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేయదని హోం శాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. సోమవారం లోక్‌సభలో జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు అమిత్ షా బదులిస్తూ ఉగ్రవాదులను ఏరివేసేందుకే ఈ చట్టాన్ని ఉపయోగిస్తాం.. దీనికి మతంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు మతం ఉండదు.. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే చూడాలితప్ప మతాలను జోడించవద్దని స్పష్టం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థను మరింత పటిష్టం చేయటం వలన ముస్లింలపై కేసులు పెరుగుతాయంటూ ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణను అమిత్ షా తీవ్రంగా ఖండిస్తూ పై విషయం చెప్పారు. శ్రీలంకలో తమిళ ఉగ్రవాదం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరిపై కేసులు పెట్టిందని అమిత్ షా ఆయనను ప్రశ్నించారు. ‘ఒవైసీగారు ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టకూడదు.. ఇలా చేయడం వలన ఉగ్రవాద నాయకులకు మరింత ఊతం లభిస్తుంది’ అని అమిత్ షా అన్నారు. గతంలో ‘పోటా’ చట్టాన్ని రద్దు చేయటం మంచిది కాదనేది తన అభిప్రాయమని అన్నారు, పోటా చట్టాన్ని రద్దు చేయటం వల్లే దేశంలో ఉగ్రవాదం బాగా పెరిగిపోయిందని ఆయన చెప్పారు. దానివల్లే 2004 నుండి 2008 వరకు దేశంలో ఉగ్రవాదం విలయతాండవం చేసింది.. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని అమిత్ షా తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 2004లో పోటా చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం రద్దు చేసిందని అమిత్ షా ఆరోపించారు. ముంబాయి బాంబు పేలుళ్లలో ఉగ్రవాదులు విలయతాండవం చేశారు. అందుకే యూపీఏ ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయవలసి వచ్చిందని అన్నారు. పోటా చట్టం రద్దు కాకుంటే ముంబాయి పేలుళ్లు జరిగేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పోటా దుర్వినియోగానికి గురి కాలేదు.. ముస్లింలపై మాత్రమే దర్యాప్తు జరుగుతుంది.. హిందువులపై జరగదంటూ ఒవైసీ చేసిన విమర్శలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ‘ఒవైసీకి తెలియనిది ఏమిటంటే తమిళ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కఠినంగా వ్యవహరించటం’ అని హోం శాఖ మంత్రి బదులిచ్చారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయటంలో మతాన్ని చూడటం జరగదు.. జరగకూడదని అన్నారు. మనం లోక్‌సభలో ఇంతటి తీవ్రమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఇష్టానుసారం మాట్లాడడం ఎంతమాత్రం మంచిది కాదు.. బైట తీవ్రమైన ప్రభావం ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలని ఆయన ప్రతిపక్షానికి స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నైతిక ధైర్యం పెరిగే విధంగా మన ప్రసంగాలు ఉండకూడదని అమిత్ షా స్పష్టం చేశారు. సభ ఈ అంశంపై ఏకాభిప్రాయంతో వ్యవహరించకపోతే ఉగ్రవాదం, ఉగ్రవాదులు బలపడతారని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం అంశంపై అమిత్ షాకు ఒవైసీకి మధ్య వేడి వాడి చర్చ జరిగింది. ‘మేం చెప్పేది వినాలి’ అని అమిత్ షా చేయి చూపిస్తూ ఆవేశంతో చెప్పగా.. ఒవైసీ స్పందిస్తూ ‘మీరు ఎవరిని బెదిరిస్తున్నారు’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను అదుపు చేసేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లుకు అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా మద్దతు ఇవ్వాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని మన రాయబార కార్యాలయాలను ఎవరైనా పేల్చివేస్తే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేసేందుకు ఈ సవరణ బిల్లు వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లలోని మన రాయబార కార్యాలయాలపై దాడులు జరిగితే దర్యాప్తు చేసేందుకు వీలు లేకుండాపోయింది.. ఇక మీదట ఆ పరిస్థితి ఉండదని అన్నారు. మనమంతా ఐకమత్యంతో వ్యవహరించటం ద్వారా దేశానికి, ప్రపంచానికి ముఖ్యంగా ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశం పంపించవలసిన అవసరం ఉన్నదని అమిత్ షా స్పష్టం చేశారు.
దేశాన్ని ఉగ్రవాదం నుండి కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థను మరింత పటిష్టం చేస్తోందని హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్‌ఐఏ కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఏర్పాటు చేయటం ద్వారా కేసులను దర్యాప్తు చేస్తోందన్నారు. రాష్ట్రాల వ్యవహారంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరిస్తుందనేది బాలాకోట్ దాడులు స్పష్టం చేశాయని ఆయన తెలిపారు. ఎన్‌ఐఏ మరింత సమర్థంగా పని చేసేందుకే సవరణలు ప్రతిపాదించామని ఆయన తెలిపారు. లోక్‌సభ ఆ తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపించింది.