జాతీయ వార్తలు

పంతం నెగ్గిన ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్జాపూర్/లక్నో, జూలై 20: యూపీ నరమేధ బాధిత కుటుంబీకులను కలుసుకుంటే తప్ప కదిలేదంటూ భీష్మించు కూర్చున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. కొన్ని గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రియాంకకు మధ్య కొనసాగిన వివాదం శనివారం పరిష్కృతమైంది. సోన్‌భద్రా ఊచకోత ఘటనలో బాధిత కుటుంబీకులు వచ్చి ప్రియాంకను కలుసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ కుటుంబీకులను కలుసుకున్న అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీనికి ముందు రాష్ట్రంలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక నిర్బంధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరిపారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ నిర్బంధంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోంభద్రాలో గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను మీర్జాపూర్ జిల్లాలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా ఆమె ఛౌనర్ అతిధి గృహంలోనే బందీగా ఉన్నారు. శనివారం ఉదయం సోంభద్రా బాధిత కుటుంబాలు గెస్ట్‌హౌస్‌కు వచ్చి ప్రియాంకతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడ ఉద్వేగపూరిత వాతావరణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన పుట్టెడు దుఖంతో వచ్చిన బాధితులను కాంగ్రెస్ నాయకురాలు ఓదార్చారు. వాళ్ల కష్టాలు విన్నారు. బాధితులు మంచి నీళ్లు ఇచ్చి వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. ప్రియతమ నాయకురాలిని కలిసిన బాధితులు ఆమెతో ఫొటోలు దిగారు. ఇలా ఉండగా బాధితులను కలిసే వరకూ తిరిగి వెళ్లేది లేదని ప్రియాంక భీష్మించుకు కూర్చున్నారు. శుక్రవారం ఆమెను ఒప్పించడానికి స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలుదఫాలు చర్చలు జరిపినా ఆమె అంగీకరించలేదు. బాధితులతో మాట్లాడాకే తిరిగివెళ్లనని, అవసరమైతే జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని బాగాపొద్దుపోయాక ప్రియాంక ట్వీట్ చేశారు. మరోపక్క గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆమె వరుస ట్వీట్లు సంధించారు. పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారణాసి ఏడీజీ బ్రిజ్ భూషణ్, కమిషనర్ దీపక్ అగర్వాల్‌ను రాయబారానికి పంపారు. బాధితులతో భేటీ కుదరదని వెనక్కి వెళ్లాలని ప్రియాంకను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘నా పర్యటన చట్టవ్యతిరేకమైంది కాదు. నేను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించడం లేదు. బాధితులను పరామర్శించాకే వెనుదిరుగుతా’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రియాంక ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. శుక్రవారం రాత్రి 1.15 గంటలకు మిర్జాపూర్‌లోని ఛౌనర్ గెస్ట్‌హౌస్‌కు అధికారులు చేరుకున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. కాగా ప్రియాంక నిర్బంధం అక్రమం, చట్ట వ్యతిరేకమని ఆమె న్యాయవాదులు ఆరోపించారు. ‘అధికారులు గెస్ట్‌హౌస్‌కు వచ్చి నాతో గంటసేపుమాట్లాడారు. నన్ను ఎందుకు బందీగా ఉంచిందీ సంబంధిత పత్రాలు చూపలేకపోయారు’అని ప్రియాంకా గాంధీ మరో ట్వీట్ చేశారు. ప్రియాంకతోనే ఉన్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు అజయ్ కుమార్ లల్లూ అతిధి గృహానికి విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారని మండిపడ్డారు. తెల్లవారుజామున 4.30 గంటలకు పార్టీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కాగా ప్రియాంకు అధికారులు ఎలాంటి అల్పాహారం అందించలేదు. స్థానికులు, పార్టీ నాయకులే ఈ ఏర్పాట్లు చూశారు. ఇలా ఉండగా రాజధాని లక్నోలోని జీపీఓ పార్కులోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు రాత్రంతా నిరసన తెలుపుతునే ఉన్నారు. ప్రియాంకకు సంఘీభావంగా అక్కడే కూర్చుని ఉన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షూ అవస్థీ వెల్లడించారు.

చిత్రం... మీర్జాపూర్‌లో శనివారం తనను కలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక