జాతీయ వార్తలు

సుష్మ నుంచి ఎంతో నేర్చుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సుష్మా స్వరాజ్ ప్రజలకు సన్నిహితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం ప్రొటోకాల్స్‌కే పరిమితమైన ఈ శాఖ తీరులో పరివర్తన తీసుకుని వచ్చి ఎక్కడ ఉన్నా ప్రజల అవసరాలకు స్పందించే విధంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో తాను తొలిసారిగా చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్న మోదీ ‘అప్పటికప్పుడు మాట్లాడకండి, ముందుగా రాసుకుని వచ్చిన పాఠానే్న చదవండి’ అని గట్టిగా కోరినట్లు తెలిపారు. గత వారం మరణించిన సుష్మాస్వరాజ్ సంతాపం తెలిపేందుకు మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మకు నివాళి అర్పించిన మోదీ తాను ఎంతగానో ఆమె నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. తొలి సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల తర్వాత 2014లో తాను ఐరాస జనరల్ అసెంబ్లీ నిర్వహించి మాట్లాడానని మోదీ తెలిపారు. ‘నేను మర్నాడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాలి, ఈ ప్రసంగంపై మనం కూర్చొని చర్చించుకోవాలి’ అని సుష్మకు తెలియజేశానని అన్నారు. అప్పుడు ఆమె మాట్లాడిన సుష్మ ‘మీ ప్రసంగం ఎక్కడ ఉంది? అని అడిగారు, నాకు ప్రసంగాలు రాసుకునే అలవాటు లేదు’ అని చెప్పానని మోదీ గుర్తు చేసుకున్నారు. రాసుకుని వచ్చిన ప్రసంగాన్ని చదవడం తనకు ఇబ్బందిగా ఉంటుందని సుష్మకు తెలియజేశానని, దానిపై స్పందించిన ఆమె ‘ఐక్యరాజ్య సమితిలో మీరు భారత దేశం గురించి మాట్లాడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేందుకు కుదరదు’ అని స్పష్టం చేశారని అన్నారన్నారు. తాను ప్రధాన మంత్రి అయినప్పటికీ తనకు ఆమె ఆ సలహా ఇచ్చారని మోదీ తెలిపారు. ఒక వ్యక్తికి ఎంతగా వాగ్దాటి ఉన్నా కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయని మోదీ పేర్కొన్నారు. ఆ విధంగా తాను సుష్మా స్వరాజ్ నుంచి తొలి పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపారు. తాను సరైనదే అనుకున్న విషయాన్ని ఆమె చాలా గట్టిగా చెప్పేవారని అన్నారు. ఇతర దేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న విషయం గురించి, అలాగే తన శాఖకు సంబంధించిన అంశాల గురించి సుష్మస్వరాజ్ వెంటనే స్పందించే వారని, ఆ విధంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వరూపానే్న మార్చేశారని మోదీ అన్నారు. కేవలం 77 మాత్రమే ఉన్న పాస్ పోర్టు సేవా కేంద్రాలు 505కు పెరిగాయని మోదీ తెలిపారు. జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే ఆమె మరణించారని, ఈ నిర్ణయం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు ఆనంద శర్మ, జేడీయూ నేత రాజీవ్ రంజన్, ఎల్‌జీపి నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్‌లు మాట్లాడారు.

చిత్రం...సుష్మా స్వరాజ్ సంతాపం సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ