జాతీయ వార్తలు

‘ఉరీ’ కారకులను శిక్షించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఉరీ ఉగ్రదాడి పట్ల దేశ ప్రజల్లో వ్యక్తమయిన ఆగ్రహం 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో భారతీయుల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని గుర్తు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉగ్రదాడికి కారకులైన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. అంతేకాదు సైన్యం మాటలు మాట్లాడదని, పరాక్రమాన్ని మాత్రమే ప్రదర్శిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఉరీ ఉగ్రవాద దాడిలో 18 మంది సైనికులను కోల్పోయాం. వీర మరణం పొందిన సైనికులకు వందనం చేస్తున్నా’ అన్న మాటలతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత రెండు నెలలుగా హింసతో అట్టుడుకుతున్న కాశ్మీర్ ప్రజల సమస్యల పరిష్కారానికి శాంతి, సమైక్యత, సహజీవనమే మార్గాలన్న సందేశాన్ని సైతం ప్రధాని ఇస్తూ. చర్చలద్వారా అన్ని సమస్యలను పరిష్కరించగమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఉరీ ఘటనను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచి పోలేరన్న ప్రధాని ఈ ఘటన బాధిత కుటుంబాలనే కాదు.. మొత్తం దేశ ప్రజల మనసులను గాయపరిచిందన్నారు. ‘అందుకే దాడికి బాధ్యులైనవారిని తప్పకుండా శిక్షించడం జరుగుతుందని దాడి జరిగిన రోజున చెప్పిన మాటనే ఇప్పుడు సైతం పునరుద్ఘాటిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. భారత జవాన్లపట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, సైన్యం మాట్లాడదని, పరాక్రమాన్ని మాత్రమే ప్రదర్శిస్తుందని, అందుకే 125 కోట్ల భారతీయులు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. మన జవాన్లను చూసి తాను గర్విస్తున్నానన్నారు. ఉరి ఉగ్రదాడిపై దేశం యావత్తు ఆగ్రహంతో ఉడికిపోతోందని, ఈ సందర్భంగా ఓ విద్యార్థి తనకు పంపిన సందేశాన్ని గుర్తు చేశారు. ఉరి దాడి తర్వాత తానూ దేశానికి ఏదయినా చేయాలన్న బలమైన కోరిక కలిగిందని, ఎంతో ఆలోచించిన తర్వాత దేశానికి తనవంతు సేవగా ప్రతిరోజూ చదువుకోసం అదనంగా మూడు గంటలు కేటాయించాలన్న నిర్ణయం తీసుకున్నానని ఆ విద్యార్థి తన సందేశంలో తెలిపాడని మోదీ చెప్పారు. ఇలాంటి ఆవేశమే 1965 యుద్ధం సమయంలోను దేశ ప్రజల్లో కనిపించిందని, దేశానికి సేవ చేసేలా సామాన్యుల్లో స్ఫూర్తి నింపడానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఇచ్చారని చెప్పారు. ప్రధానంగా కాశ్మీర్ ప్రజలనుద్దేశించి మాట్లాడాలనుకుంటున్నట్లు ప్రధాని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులను కాశ్మీర్ యువకులు బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతేకాదు తమ భవిష్యత్తుకు ఏం కావాలో కూడా వారు తెలుసుకున్నారని చెప్పారు. అందుకే వారు దేశ వ్యతిరేక శక్తులకు దూరమవుతున్నారని, శాంతిమార్గంలో నడవడం మొదలు పెట్టారని అన్నారు.
రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లను మోదీ అభినందించారు. దీపా మాలిక్ విజయం మహిళల్లో ఎంతో స్ఫూర్తి నింపిందని, జజారియా బంగారు పతకం సాధించి దేశం గర్వించేలా చేశాడని అన్నారు. అన్నిటికన్నా మించి ఈ విజయాలు దివ్యాంగుల పట్ల ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా మార్చి వేశాయని చెప్పారు. రెండేళ్ల క్రితం తాను ప్రారంభించిన స్వచ్ఛ్భారత్ ఉద్యమం పరిశుభ్రత పట్ల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిందని, చిన్నారులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ స్వచ్ఛ్భారత్‌ను విజయవంతం చేయడానికి కృషి చేశారన్నారు. గత రెండేళ్లలో 2.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని, ఏడాదిలో మరో కోటిన్నర మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతుందని చెప్పారు. భారత్‌ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. తన చిరునామా బ్రిటీష్ కాలం నాటి రేస్‌కోర్స్‌రోడ్డునుంచి లోక్ కళ్యాణ్ మార్గ్‌కు మారడం గురించి కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, ఇది తమ ప్రభుత్వం ఎవరికోసమైతే పని చేస్తోందో ఆ సామాన్యులకు ఇచ్చిన నివాళిగా అభివర్ణించారు.