జాతీయ వార్తలు

హిందీని రుద్దబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, సెప్టెంబర్ 18: ప్రాంతీయ భాషలకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీని బలవంతంగా రుద్దబోమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హిందీ రెండో భాషగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఇటీవల తాను చేసిన ప్రకటనపై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేశారు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ హిందీని బలవంతంగా అమలు చేయబోమని ఆయన అన్నారు. ప్రాంతీయ భాషలు మరింత బలపడాలన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ‘నేను కూడా హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి వచ్చాను. నేను గుజరాతీ. అక్కడ గుజరాతీ భాషే మాట్లాడతారు. హిందీ కాదు.. ఇంతకుముందు హిందీ దివస్ సందర్భంగా నేను చేసిన ఉపన్యాసాన్ని అందరూ వినాలి. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి’ అని అన్నారు. పిల్లలెవరైనా తమ మాతృభాషలో చదువు నేర్చుకుంటేనే ఉన్నత స్థితికి వెళ్తారని ఆయన అన్నారు. మాతృభాష అనేది హిందీ మాత్రమే అయి ఉండాలన్న నిబంధన ఏదీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాలు లేదా ప్రాంతాల భాషే అక్కడి మాతృభాష అవుతుందని ఆయన అన్నారు. కొంతమంది
ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని అనుకుంటారని ఆయన చెప్పారు. అయితే, దేశంలో ఒకే భాష ఉంటే బాగుంటుందనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. తాను కేవలం ఒక విజ్ఞప్తిని మాత్రమే చేశానని అన్నారు. ఒక దేశానికి ఒక భాష ఉండాలని తాను అభిప్రాయపడడంలో తప్పేమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ప్రాంతీయ భాషలు, దేశ భాషతో దేశం తులతూగాలని అనుకుంటున్నారా? లేదా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాదిరి మారిపోవాలని అనుకుంటున్నారా? అని అమిత్ షా ప్రశ్నించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందినవారిని తాను కలుసుకున్నపుడు వారి మాతృభాష ఏదని అడుగుతానని చెప్పారు. వారి నుంచి వౌనమే సమాధానం అవుతుందని ఆయన అన్నారు. అంటే, ఆ రెండు దేశాల్లోనూ స్థానిక భాషలన్నీ నాశనమై ఇంగ్లీష్ మాత్రమే మిగిలిపోయిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి మన దేశానికి రాకూడదని ఆయన అన్నారు. ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాజభాష ఉంటే మరింత మంచిదని తన అభిప్రాయమని ఆయన అన్నారు. ఇందులో ఆందోళనకు గురికావాల్సిన అంశమేదీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
*చిత్రం... కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా