జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియమత్‌పూర్/దుర్గాపూర్, ఏప్రిల్ 2: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ బాటలోనే నడుస్తున్నారని శనివారం ఇక్కడ ధ్వజమెత్తారు. ‘మోదీజీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్, వామపక్ష కూటమి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. తాను ఒక్కడినే నాయకుడిని అన్న తీరులో మోదీ వ్యవహరిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను ప్రజలపై రుద్దడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కేంద్రం నాగ్‌పూర్ నుంచి వస్తున్న ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రధాని యత్నిస్తున్నారని రాహుల్ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ బాటలోనే నడుస్తూ రాష్ట్రంలో ఏకపక్ష పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘నేను పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో మాట్లాడినప్పుడు మమతా బెనర్జీ తీరుపై ఏకరువుపెట్టారు. ఆమెకు తోచినట్టే.. ఆమె అనుకున్నవే అమలు చేస్తున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకోవడం లేదని తృణమూల్ ఎంపీలు వాపోయారు’ అని రాహుల్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితే బిజెపిలోనూ ఉందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లో స్టింగ్ ఆపరేషన్ సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో అలాంటి పరిస్థితులే తలెత్తినా మిన్నకుండిపోయారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తుంగలో తొక్కారని రాహుల్ ఆరోపించారు. శారదా చిట్స్ కుంభకోణంపై ఉదాసీనంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకాన్ని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారని రాహుల్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో నియంతృత్వ పాలన సాగుతోందని దుర్గాపూర్ సభలో రాహుల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ ఉమ్మడి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని బతికించండి: సిపిఎం
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి, ప్రతిపక్ష నేత సూర్యకాంత మిశ్రా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు ఎన్నికల సభలో మాట్లాడిన మిశ్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. మమత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు శ్రమించి వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను మమతా బెనర్జీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్ష కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.