జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీ గుప్పిట బెంగాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్‌సీ) చేపడతారన్న వార్తల నేపథ్యంలో జనంలో కలకలం మొదలైంది. రాజధాని కోల్‌కతాతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకున్నారు. ప్రభుత్వ, మున్సిపల్ ఆఫీసుల కిటకిటలాడాయి. జనన ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు బారులుతీరడం కనిపించింది. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందనక్కర్లేదని సీఎం భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలో ప్రకటించిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితా నుంచి హిందూ బెంగాలీల పేర్లు తొలగించడంతో ఇక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో మరో ఇద్దరు ఎన్‌ఆర్‌సీ భయంతో ఆత్మ హత్యలు చేసుకున్నారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఇలా ఉండగా గురువారం కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిచ్చాయి. ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని అనుబంధ కార్యాలయాలు, రాష్ట్రంలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసులు(బీడీఓ) వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. జనన పత్రాలతోపాటు భూ సంబంధ, మిగతా ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసులకు తరలివచ్చారు.‘నా బర్త్ సర్ట్ఫికెట్ కోసం కేఎంసీకి వచ్చాను. అంతకు ముందు ఎప్పుడో తీసుకున్న బర్త్ సర్ట్ఫికెట్ కనిపించడం లేదు. ఎన్‌ఆర్‌సీకి జనన ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలని అంటున్నారు. అందుకే ఉదయమే ఇక్కడకు వచ్చాను’ అని 75 ఏళ్ల అజిత్ రాయ్ తెలిపారు. వృధ్యాప్యంలోనూ ఆయన కేఎంసీ ఎదుట వేచి ఉండడం గమనార్హం. 55 ఏళ్ల బిమల్ మండల్ భూ సంబంధిత పత్రాల కోసం ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆఫీసు వద్ద లైన్లో నిలబడ్డారు. తన తల్లిదండ్రులకు చెందిన ఐదు దశాబ్దాల నాటి భూ పత్రాలు సేకరించే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేదు. ప్రభుత్వ ఆఫీసులు, పంచాయతీ కార్యాలయలా జనసమర్ధంగా మారిపోయాయి. ‘సరైన పత్రాలు అందించకపోతే విదేశీయులుగా ప్రకటిస్తారు. ఎప్పుడో మా తాతల కాలం నాటి పత్రాలు ఇప్పుడు ఎక్కడ నుంచి సంపాదించాలి?’అని 25 ఏళ్ల ఖాలిక్ మొల్లా ప్రశ్నించాడు. అతడు దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో జరిగిన వివిధ సంఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. పాత ధ్రువీకరణ పత్రాలు సంపాదించలేదన్న బెంగతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మిగతా నాలుగురు డాక్యుమెంట్ల కోసం గంటల తరబడి లైన్‌లలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. పంచాయతీ ఆఫీసుల వద్ద వేలాది మంది క్యూల్లో నిలబడి వారి వంతు వచ్చేవరకూ వేచి చూస్తున్నారు. ఇలా ఉండగా అస్సాంలోని ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు తొలగించారు. అందులో 12 లక్షల మంది హిందువులే కావడం గమనార్హం. ఆగస్టు 31న ఎన్‌ఆర్‌సీ తుది జాబితాను ప్రకటించారు.‘బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలుకాదు. కాబట్టి ఎవరూ భయపడ వద్దని ప్రజలకు చెబుతున్నాం. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఒక్క వ్యక్తి జోలికి వచ్చినా ఊరుకోం’ అని కోల్‌కతా మేయర్, సీనియర్ మంత్రి ఫరిద్ హకీం వెల్లడించారు. ఎన్‌ఆర్‌సీ పేరుతో బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోందని, అయితే పశ్చిమ బెంగాల్‌లో వాళ్ల ప్రయత్నాలు సాగనీయమని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం తీవ్రంగా హెచ్చరించారు. అయితే హిందువుల్లో భయాలు సృష్టించడానికే తృణమూల్ పార్టీ నేతలు ఎన్‌ఆర్‌సీ జపం చేస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు.
భయం వద్దు: మమత
కోల్‌కతా: ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలుకు అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విస్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి సేకరిస్తున్న వివరాలు రానున్న జనాభా లెక్కల్లో భాగమేనని, వీటికి ఎన్‌ఆర్‌సీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ ప్రజలు సాధించుకున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించేందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ రిజిస్ట్రీని తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు. రేషన్ కార్డుల కోసం జరుగుతున్న జనగణనకు వక్రభాష్యం చెబుతున్నారని, దీనినే ఎన్‌ఆర్‌సీగా ప్రచారం చేస్తున్నారని మమత ధ్వజమెత్తారు. ఈ రకమైన వదంతులను, కట్టుకథలను నమ్మవద్దని పేర్కొన్న ఆమె ‘ఎన్‌ఆర్‌సీపై ఎలాంటి భయం వద్దు. రాష్ట్రంలో దీనిని అమలు చేయనిచ్చేదే లేదు’ అని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పశ్చిమబెంగాల్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీయులంతా భారతీయ పౌరులేనని, వీరిని రాష్ట్రం నుంచి పంపించే ప్రసక్తే లేదని ఆమె తెలిపారు. బెంగాలీ పునరుత్థాన యోధుడు, కవి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 200వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మమతా బెనర్జీ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు విద్యాసాగర్, నేతాజీ, వివేకానందలను విశ్వసించాలని, దేశంలో అందరూ ఒకటేనన్న పరిపూర్ణ విశ్వాసంతో మెసలాలని మమత తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని, అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను వెనక్కి పంపిస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్న నేపథ్యంలో మమత వారిపై ఎదురుదాడికి దిగారు.

*చిత్రం...పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ