జాతీయ వార్తలు

శనిసింగనాపూర్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మద్‌నగర్, ఏప్రిల్ 2: మహారాష్టల్రోని శనిసింగనాపూర్ శనీశ్వరుని ఆలయం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలకు ఆలయంలో ప్రవేశించే హక్కు ఉందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో పెద్దఎత్తున మహిళలు శనీశ్వరుని ఆలయం వద్దకు చేరుకున్నారు. తృప్తి దేశాయ్ నేతృత్వంలోని భూమాతా బ్రిగేడ్ నాయకత్వంలో మహిళలు ఆలయ ప్రవేశం చేయబోగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తృప్తి ఆరోపించారు. ఆలయ ప్రవేశం మహిళల ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయస్థానం పేర్కొందని ఆమె వివరించారు. శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించకపోతే కోర్టు ధికారం కింద ముఖ్యమంత్రిపై కేసు పెడతామని ఆమె ప్రకటించారు. తమను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని దేశాయ్ చెప్పారు. శనివారం ఉదయం శనీశ్వరుడి ఆలయానికి వచ్చిన బ్రిగేడ్ కార్యకర్తలు, మహిళలను స్థానికులు, ఆలయ అధికారులు అడ్డుకున్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా గుడిచుట్టూ వలయంలా నిలబడి ఆపేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆలయ ప్లాట్‌ఫాం వంద మీటర్ల దూరంలో నిలిపివేశారు. అయితే ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి తృప్తి ఆమె అనుచరులు విశ్వప్రయతం చేశారు. కోర్టు ఆదేశాలు అమలుచేయడంతో అధికారులు విఫలమయ్యారంటూ ఆమె ధర్నాకు దిగారు. కాగా శనిసింగనాపూర్ ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్టు అడిషనల్ ఎస్‌పి పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. మహిళలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడం, స్థానికుల ప్రతిఘటించడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలు మోహరించారు. ‘సిఎం దేవేందర్ ఫడ్నవీస్ జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశాలమేరకు మహిళలను ఆలయంలో ప్రవేశించడానికి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఆయనపై కేసు పెడతాం’ అని తృప్తి దేశాయ్ వెల్లడించారు. పూణే నుంచి వాహనాల్లో వచ్చిన 25 మంది బ్రిగేడ్ కార్యకర్తలు గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. శనీశ్వరుడి ఆలయంలోకి వెళ్లడానికి వీలుగా జిల్లా అధికారులు, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆమె కోరారు. ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన తృప్తి దేశాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.