జాతీయ వార్తలు

కోరితే సైన్యాన్ని పంపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాల్ (హర్యానా): తమ భూభాగంలో ఉగ్రవాదులు విచ్చిలవిడిగా సంచరిస్తున్నా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హర్యానాలోని కర్నాల్‌లో ఆదివారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సైనికపరంగా సహాయపడేందుకు భారత్ సిద్ధంగా ఉందని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందుకు మేము అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. మా సైన్యాన్ని కూడా పంపి, మీకు తోడ్పడతాం’ అని రాజ్‌నాథ్ పాక్ ప్రధానికి సూచించారు. కాశ్మీర్ విషయంలో ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న విమర్శల్లో ఎలాంటి పస లేదని పేర్కొన్న రక్షణ మంత్రి ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఆయన చేసిన ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రస్తావించారు. కాశ్మీర్ విషయంలో భారత్‌ను తీవ్రంగా హెచ్చరించిన ఆయన అణు యుద్ధం జరిగితే, దాని పర్యవసానాలను ప్రపంచ దేశాలు అనుభవించాల్సి వస్తుందని కూడా ఐరాసలో అన్నారని రాజ్‌నాథ్ తెలిపారు. అయితే, అదే సదస్సులో మాట్లాడిన మోదీ ప్రపంచ దేశాల అభివృద్ధి, శాంతి సంస్థాపన ఆవశ్యకతనే ప్రస్తావించారని అన్నారు. కాశ్మీర్ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ మరచిపోవడమే మంచిదని పేర్కొన్న రాజ్‌నాథ్ సింగ్ ‘ఆయన ఎంతగా పాకులాడినా కూడా జరిగేది ఏమీ ఉండదు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్‌పై ఒత్తిడి తీసుకురాజాలదు’ అని అన్నారు. రెండు దేశాల సిద్ధాంతంలో
భాగంగా 1947లో భారత్‌ను రెండు భాగాలుగా విభజించారని, అదే 1971లో పాకిస్తాన్ కూడా రెండు ముక్కలైన విషయాన్ని మరచిపోకూడదని రాజ్‌నాథ్ పాక్ ప్రధానికి గుర్తు చేశారు. ఇదేరకమైన పరిస్థితి కొనసాగితే పాకిస్తాన్ పతనాన్ని, మరింతగా ముక్కలు కావడాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని రాజ్‌నాథ్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాని అదే పనిగా ప్రస్తావించడం, ముఖ్యంగా 370 అధికరణ రద్దు నేపథ్యంలో భారత ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానానికి తాను పూజలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించడంపై రాజ్‌నాథ్ విరుచుకుపడ్డారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రతిపక్ష పార్టీ పొరుగున ఉన్న పాకిస్తాన్‌కు లేనిపోని శక్తిని అందిస్తోందని ఆయన అన్నారు.

*చిత్రం...హర్యానాలోని అసంద్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్