జాతీయ వార్తలు

బాబోయ్.. వేధిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ పక్షం నాయకుడు కనకమేడల రవీంద్రకుమార్, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యుడు మద్దాలి గిరిధర్‌రావు, శాసన మండలి సభ్యుడు శ్రీనివాసరావు, గుంటూరు టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజేయులు, బీ.ఏసుబాబు, ఎం.రాజరత్నం తదితర నాయకులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం వీరు జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోంది.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరిచిన వారిని, మద్దతు ఇచ్చిన వారిని కూడా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది.. తప్పుడు కేసులు పెడుతోందని వారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మానవ హక్కులను కాలరాస్తోందని.. జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని గల్లా జయదేవ్, ఇతర నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగమంతా ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యుల వద్ద మోకరిల్లుతోందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడిపిస్తున్న సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానల్ ద్వారా తెలుగుదేశం నాయకులపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు.. తమ అవినీతిని దాచుకునేందుకు ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, ఇతర నాయకులు తెలుగుదేశం,
ఇతర ప్రత్యర్థి పార్టీల నాయకులపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని వారు చెప్పారు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించిన అనంతరం పోలీసుల ద్వారా దర్యాప్తు చేయించి దెబ్బకొడుతున్నారని వారు ఆరోపించారు. తప్పుడు ఆరోపణలను తమ పత్రిక, చానల్‌లో చూపించటం ద్వారా ప్రత్యర్థులపై బురద చల్లుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినందుకే శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని వారు జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడికి ఇచ్చిన వినతిపత్రంలో ఆరోపించారు. కోడెల శివప్రసాద్‌పై 18 తప్పుడు కేసులు పెట్టినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అదుపు చేసి రాష్ట్రంలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.