జాతీయ వార్తలు

ఏపీ వైపూ చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మరోసారి కోరారు. మంగళవారం అమిత్ షాను కలిసిన జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన వివిధ పథకాలు, ప్రాజెక్టులు, సమస్యలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాల గురించి కూడా అమిత్ షాతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి జరిపిన ముఖాముఖి చర్చల్లో వచ్చిన ఇతర కీలకాంశాలు ఏమిటనేది వెల్లడించేందుకు పార్టీ వర్గాలు నిరాకరించాయి.
పరిశ్రమలు, సేవా రంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ రెండు రంగాల వాటా 76.2 శాతం నుండి 68.2 శాతానికి పడిపోయిందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలుగుతామని ఆయన హోం మంత్రితో చెప్పారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కాకుండా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూడాలని ఆయన అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. 2014-15 సంవత్సరం రెవెన్యూ లోటును కాగ్‌తో చర్చించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ లోటు భర్తీ గురించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రూ.22,948 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కేంద్రం నుండి తమకు ఇంకా రూ.18,969 కోట్లు రావలసి ఉన్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నిధులను వెంటనే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖకు అదేశాలు జారీ చేయాలని ఆయన అమిత్ షాను కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలనీ, ప్రకాశం జిల్లా రాయపట్నంలో పోర్టు నిర్మాణం పనిని వెంటనే చేపట్టాలని అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్
ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని జగన్ కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వవలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.16వేల కోట్లను కేటాయించాలని కోరారు. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని ఆయన అమిత్ షాతో చెప్పారు. పోలవరం హెడ్ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టనె్నల్ పనుల్లో రూ.58కోట్లను ఆదా చేశామని అన్నారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలు తరలించే ప్రాజెక్టు గురించి కూడా జగన్ హోం మంత్రితో చర్చించారు. కృష్ణా నదిలో గడిచిన 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1.230 టీఎంసీ నుండి 456 టిఎంసీలకు పడిపోయింది. మరోవైపు గోదావరి నదిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ప్రతి సంవత్సరం 2,780 టీఎంసీ జలాలు సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణా జలాలపై ఆధారపడిన రాయలసీమ, కృష్ణా డెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు గోదావరి వరద జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టవలసిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని జగన్ హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారతాయని జగన్ వివరించారు. జగన్మోహన్‌రెడ్డి చెప్పినదంతా సావకాశంగా విన్న అమిత్ షా తాను చేయగలిగింది చేస్తానని హామీ ఇచ్చారు.

*చిత్రం... ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శాలువా కప్పి అభినందనలు తెలుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి