జాతీయ వార్తలు

కాలుష్యం కాటు.. ఏది రూటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: భారత్‌లో కాలుష్యం ఏటేటా ఓ అనివార్యమైన సమస్యగానే మారుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో ప్రాణావసరమైన ఆక్సిజనే కొరవడే రీతిలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఈ వాయు కాలుష్య సమస్య జనారోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజకీయంగా పెనుగులాటకూ దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం ఏమిటన్న అంశంపై మేధావులు దృష్టి సారించారు. చైనా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనుసరిస్తున్న విధానాలను, టెక్నాలజీ పరమైన సదుపాయాలను సమకూర్చుకోగలిగితే కాలుష్యాన్ని ముఖాముఖి ఢీకొనవచ్చునని, వాయు నాణ్యతను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని చెబుతున్నారు. మనకంటే చాలా ముందుగానే చైనా వంటి దేశాలు వాయు కాలుష్యంతో సతమతమయ్యాయి. విధానపరంగా టెక్నాలజీపరంగా పటుతరమైన చర్యలు తీసుకుని ఈ సమస్యను అధిగమించడమే కాకుండా ప్రజారోగ్యానికి కొండంత అండగా నిలిచాయి. ఇంధన వినియోగంలో కఠిన నిబంధనలు పాటించడం, బొగ్గు ఆధారిత పరిశ్రమల ద్వారా వెదజల్లే కాలుష్యాన్ని నియంత్రించడం, కాలుష్య ఉద్ఘారాలను అదుపు చేయడం వంటి చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఉత్తర చైనాలోని నన్‌జింగ్ ప్రాంతంలో ఓ కృత్రిమ అడవినే సృష్టించాయి. ఈ అడవి ఏటా 25 టన్నుల కార్బన్‌డైఆక్సయిడ్‌ను పీల్చుకోవడమే కాకుండా రోజుకు 60 కిలోల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఉత్తర చైనాలో ప్రయోగాత్మకంగా 100 మీటర్ల ఎత్తయిన పొగమంచు టవర్‌ను నిర్మించారు. దీనివల్ల చైనాలో గుణాత్మక రీతిలోనే వాయు నాణ్యత పెరిగిందని చైనా శాస్త్ర పరిశోధన అకాడమీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వీరి పర్యవేక్షణలోనే ఈ ప్రాజెక్టు అమలవుతోంది. చైనాతోపాటు ఇతర దేశాలు కూడా కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని, వాటిని భారత్ అమలు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ భవిత్ భక్షి తెలిపారు. అయితే, ఇందుకు కాలుష్యం ఎక్కడ నుంచైతే విసర్జితమవుతోందో ఆ మూలాలనే అరికట్టాల్సి ఉంటుందని, అలాగే కారుల్లో కన్వర్టర్లను అమర్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తే ఈ సమస్య తీవ్రత గణనీయంగా తగ్గుతుందని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీలు, రిఫైనరీల నుంచే అత్యధిక స్థాయిలో కాలుష్య ఉద్ఘారాలు విసర్జితమవుతాయని, వీటిపై గట్టి దృష్టి సారించి కాలుష్య మార్గాలను ఆదిలోనే మూసివేసే టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు. అలాగే అనేక దేశాల్లో పొల్యూషన్ ట్రేడింగ్ పథకాలు కూడా అమలవుతున్నాయి. ఈ పర్మిట్లను సదరు సంస్థలు కొనాల్సి ఉంటుంది. వీరు తమ ఉత్పాదక ప్రక్రియలను ప్రక్షాళన చేసుకుంటే అదనపు పర్మిట్లు కూడా వీరికి అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కాలుష్యమయమైన నగరాల్లో చైనాది మొదటి స్థానం. అయితే, ఈ సమస్యను సదరు రాష్ట్రాలు అతి తక్కువ వ్యవధిలోనే అధిగమించాయని, ముఖ్యంగా బీజింగ్ అనూహ్య రీతిలోనే వాయు నాణ్యతను గణనీయంగా మెరుగుపరచుకోగలిగిందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ టెషన్ సెరీన్ తెలిపారు. ఓ వర్ధమాన దేశంలోని ఓ అతిపెద్ద నగరం ఆర్థిక వృద్ధికి ఆటంకం లేకుండా పర్యావరణ పరిరక్షణ సమతూకాన్ని సాధించగలగడం ఇతర దేశాలూ అనుసరించదగ్గ అంశమని తెలిపారు. 1998లో బొగ్గు వినియోగం, మోటారు వాహనాల కారణంగా బీజింగ్ కాలుష్యమయంగా మారిపోయింది. అయితే, గత 15 ఏళ్ల కాలంలో టెక్నాలజీతోపాటు ఇతర పథకాలను అమలు చేసిన చైనా కాలుష్యాన్ని, ప్రమాదకర ఉద్ఘారాల విసర్జనను అరికట్టగలిగిందని తెలిపారు. 2013 నాటికి వాయు కాలుష్య కారక కారణాలు గణనీయంగా తగ్గిపోయాయని, ఇందుకు కారణమయ్యే కార్బన్ మోనాక్సయిడ్, సల్ఫర్ డయాక్సయిడ్‌లను జాతీయ ప్రామాణిక స్థాయికి చైనా ప్రభుత్వం తీసుకురాగలిగిందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం తెలిపింది. వాయు కాలుష్యాన్ని తొలగించి, నాణ్యతను పెంచడంలో బీజింగ్ అనుసరించిన విధానాలు భారత్ సహా అన్ని దేశాలకూ ఆచరణీయమని ఐరాస అధికారి జోషి మూయా తెలిపారు. అలాగే బీజింగ్ ఒలింపిక్స్‌కు ముం దు అనేక పరిశ్రమలను చైనా మూసివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా పారిస్ విషయానికొస్తే ప్రస్తుతం ఢిల్లీలో అమలవుతున్న బేసి-సరి తరహాలో అక్కడ కూడా వారాంతపు రోజుల్లో, చారిత్రక స్థలా ల్లో కార్లపై నిషేధం అమలవుతోందని తెలిపారు. 2030 నుంచి ఆమ్‌స్టార్‌డమ్ నగరంలో పెట్రోలు, డీజిల్ కార్లు, మోటార్ సైకిళ్లను నిషేధించబోతున్నారు. అలాగే కోపెన్‌హయాన్‌లో కార్ల కంటే అక్కడి ప్రజలు బైక్‌ల వినియోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
*చిత్రం... ఢిల్లీలో ఆదివారం కాలుష్యం తీవ్రతను తగ్గించేందుకు ‘యాంటీ స్మాగ్ గన్’ ద్వారా గాలిలోకి నీటిని వెదజల్లుతున్న దృశ్యం