జాతీయ వార్తలు

2021లో మహాద్భుతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 21: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్ళు గడువున్నప్పటికీ ఇప్పటికే ఆసక్తికర రీతిలో రాజకీయ వేడి పెరుగుతోంది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట ఓ అద్భుతమే జరుగుతుందని సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. తన సహ నటుడు ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్‌హసన్‌తో రజనీకాంత్ చేతులు కలిపి రానున్న ఎన్నికల్లో పోటీచేయవచ్చునన్న బలమైన సంకేతాల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. సొంతంగా పార్టీ పెడతానని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించిన రజనీకాంత్ ‘ఒకవేళ మేము అధికారంలోకి వస్తే కమల్‌హసన్ పార్టీతో అధికారాన్ని ఏవిధంగా పంచుకోవాలనే దానిపై ఇప్పటికిప్పుడే ఎలాంటి చర్చలు ఉండవు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే ఈ అంశం గురించి మాట్లాడుకుంటాం. అప్పటివరకు దీని ప్రస్తావనే మా మధ్య ఉండదు’ అని వెల్లడించారు. విమానాశ్రయంలో తనను కలిసిన విలేఖరులతో ఆయన అనేక అంశాలు మాట్లాడారు. మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓ మహాద్భుతానే్న సృష్టిస్తారని, రాష్ట్ర రాజకీయగతినే మార్చివేస్తారని ఓ ప్రశ్నకు జవాబుగా రజనీకాంత్ తెలిపారు. ద్రవిడ పార్టీల పట్టు బలంగా ఉన్న తమిళనాడులో రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు ఎంతమాత్రం సాగవంటూ అన్నాడీఎంకే సీనియర్ నాయకుడొకరు చేసిన వ్యాఖ్యలపై రజనీకాంత్ తీవ్రంగానే స్పందించారు. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు, కమల్‌హసన్ వామపక్ష ఆలోచనలు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతమాత్రం పొసగవని అన్నా డీఎంకే పత్రిక ఓ వ్యాసాన్ని కూడా రాసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఒకవేళ ఈ రెండు పార్టీలు చేతులు కలిపి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్నకు ‘వాటిగురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే దీని ప్రస్తావన వస్తుంది’ అని బదులిచ్చారు.
అలాగే తాను పార్టీ పెట్టిన తర్వాత తన కార్యకర్తలతో, నేతలతో మాట్లాడాల్సి వుంటుందని, అప్పటివరకు ఇలాంటి అంశాల జోలికి వెళ్లనని రజనీ వెల్లడించారు.

*చిత్రం... సూపర్‌స్టార్ రజనీకాంత్