జాతీయ వార్తలు

వైద్య రంగ పరిరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వైద్యారోగ్య రంగ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో వైద్యులు, ఆసుపత్రులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆరోగ్య శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించి ఒక బిల్లును కూడా రూపొందించింది. వైద్యులపై దాడులు, ఆసుపత్రుల విధ్వంసం, ఇతర ఆరోగ్య రంగ సిబ్బందిపై దాడులకు చెక్ పెట్టాలని భావిస్తూ బిల్లును రూపొందించినట్లు ఈ విభాగానికి చెందిన అధికారులు వెల్లడించారు. వైద్య సేవలు అందించే సిబ్బంది, క్లీనిక్‌ల పరిరక్షణ బిల్లు -2019 ప్రకారం వైద్యులు, వైద్య రంగ నిపుణులు, ఆసుపత్రుల విధ్వంసానికి పాల్పడే నిందితులకు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఈ రంగంపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య రంగ పరిరక్షణే బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచించింది.. ఈమేరకు న్యాయ శాఖ సైతం బిల్లును ఆమోదించింది. హోం శాఖ సైతం బిల్లుపై సంప్రదింపులు జరిపింది. అయితే, ఈ రంగ పరిరక్షణపై ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని హోం శాఖ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రంగంపై జరుగుతున్న విధ్వంసంపై ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదంటూ హోం శాఖ బిల్లును తోసిపుచ్చింది. అయితే, ఐపీసీ, సీఆర్‌పీసీలు ఈ రంగ పరిరక్షణకు సరిపోతాయని ఆ శాఖ అభిప్రాయపడింది. ‘చట్టం తేవాలని భావిస్తే.. ఇటు న్యాయవాదులు, పోలీసులు సైతం తమ రంగాలకు కూడా పరిరక్షించాలని పట్టుబడతాయి’ అని హోం శాఖ పేర్కొన్నట్లు తెలిపారు. వైద్యులపై దాడులకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఇందులో భాగంగా పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయిల నష్టపరిహారం సైతం చెల్లించే విధంగా రూపకల్పన చేస్తూ బిల్లును తయారు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే, ఆసుపత్రులు ఇతర ఆస్తులను ధ్వంసం చేసే వారికి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని.. 50 వేల నుంచి ఐదు లక్షల రూపాయిల వరకు జరిమానాను సైతం విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఆస్తులపై విధ్వంసానికి పాల్పడే వారికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మార్కెట్ ధరకు అనుగుణంగా రెండు రెట్లు అధికంగా జరిమానాను విధించాలని బిల్లులో పేర్కొన్నారు. నిందితుడు నష్టపరిహారాన్ని చెల్లించలేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం 1890 ప్రకారం బకాయిపడిన లాండ్ రెవెన్యూ నుంచి కూడా రికవరి చేయవచ్చు. బిల్లు ప్రకారం ఆరోగ్య రంగ నిపుణుల్లో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, అంబులెన్స్ డ్రైవర్లు ఇందులోకి వస్తారు. ఈ బిల్లు రూపకల్పనకు ఎనిమిది మంది సభ్యుల సబ్ కమిటీని నియమించింది. వీరిలో ఎంసీఐ ప్రతినిధులతో పాటు, ఐఎంఏ, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు చెందిన నైపుణ్యం కలిగిన రిటైర్డ్ అధికారి తదితరులున్నారు.