జాతీయ వార్తలు

ఒరిగిన మహావృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి కోసం ఎవరైనా 223 మంది ఆత్మహత్య చేసుకుంటారా? ఒకరి కోసం ఎవరైనా నాలుక కోసుకుంటారా? ఒకరు జైల్లో ఉంటే బయటకు వచ్చే వరకూ పూజలు చేస్తారా? ఉపవాసాలు చేస్తారా? - అలా చేశారంటే ఆ వ్యక్తి ఓ మహా సమ్మోహనశక్తి అయి ఉండాలి. మరెంతో ప్రజాభిమానం సంపాదించుకుని ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు... పురుచ్చితలైవి. తమిళనాట ‘అమ్మ’... జయలలిత!
సాధారణ సినిమా నటి స్థాయి నుంచి తమిళనాడు రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వరకూ ఎదిగిన ఆమె ప్రస్థానం, విజయం ఒక్కరోజులో వచ్చిందేమీ కాదు. సినీ జీవితం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినా ఆమెకు అవమానాలు తప్పలేదు. అయినా వాటిని భరించి, సహించి కసి-పట్టుదలతో.. ఎంజీఆర్‌ను పురచ్చితలైవర్ (విప్లవ కథానాయకుడు)గా పిలుచుకున్న జనం నోటితో పురచ్చితలైవి (విప్లకనాయకి)గా కీర్తించుకోవటం బహుశా జయలలితకే చెల్లింది. ద్రవిడ రాజకీయాల్లో ఒక మహిళ ఈ స్థాయికి చేరడానికి ఆమెలో ఉన్న కసి, పట్టుదల, ఎదుర్కొన్న అవమానాలే కారణం. ఎంజీఆర్ భౌతికకాయం వద్ద ఆమెను తోసివేసిన పార్టీ నేతలే ఆనక ఆమె పాదాక్రాంతులయ్యారు.
జయలలిత అంటేనే ఒక సంచలనం. ఒక ప్రభంజనం. ఒక విప్లవం. ఒక తిరుగుబాటు. అన్నీ కలగలిపితేనే జయలలిత.
భారత రాజకీయాల్లో ఒకప్పుడు కొంతకాలం పాటు ఇందిరాగాంధీనే నియంతగా భావించేవారు. ఎమర్జెన్సీ అనుభవాల తర్వాత ఆమె తన పద్ధతి మార్చుకున్నారు. ఆ తర్వాత సోనియానూ అలాగే భావించేవారు. కానీ జయలలిత కనుమూసే వరకూ నియంతగానే బతికారు. ఎవరైనా ప్రధానమంత్రి వద్దకు వెళితే అక్కడి కుర్చీలో కూర్చోవలసిందే. కానీ జయ పద్ధతి రివర్సు. ప్రత్యేకంగా తనకోసం చేయించుకున్న కుర్చీని ఆమె తనవెంట తెప్పించుకోవలసిందే. జయలలితతో రాజకీయ మిత్రత్వం నెరపాలంటే చాలా ధైర్యం కావాలి. అగ్రపార్టీలయినా ఆమె దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఆగ్రహిస్తారో, ఎందుకు అనుగ్రహిస్తారో ఆమెకే తెలియదు కాబట్టి. కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన ఆమె, తర్వాత ఎన్డీఏకు దన్నుగా నిలిచారు. మళ్లీ అదే వాజపేయి సర్కారును పుట్టిముంచిన ఘనత కూడా ఆమెకే దక్కింది.
తమిళ రాజకీయాలు, పాలనలో ఆమెది ఒక ప్రత్యేక మార్కు. పేదలంటే వల్లమాలిన అభిమానం. తానంటే ప్రాణాలు కూడా తృణప్రాయంగా అర్పించే ఆ నిరుపేదల కోసం ఆమె చేపట్టిన పథకాలు కోకొల్లలు. మిగిలిన ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతల మాదిరిగా ఆమె మంత్రులు, పార్టీ నేతలను కలవరు. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా బయట గది నుంచి ఇంటర్‌కమ్‌లో మాట్లాడాల్సిందే. మంత్రులు ఆమెతో మాట్లాడిన సందర్భాలు వేళ్లమీద లెక్కబెట్టాల్సిందే. చాలామంది మంత్రులు అసలు ఆమెతో మాట్లాడిన సందర్భాలు కూడా లేవంటే ఆశ్చర్యమేమీ కాదు. ఆమెకు నచ్చకపోతే ఏ మంత్రి అయినా మరుసటి రోజు మాజీ కావలసిందే. అడిగే ధైర్యం కాదు, కనీసం నిరసన ప్రకటించే దమ్ము కూడా ఎవరికీ ఉండదు. అందరిపైనా వ్యక్తిగత నిఘా ఉంటుంది. అందుకే ఆ పార్టీలో నెంబర్‌టూ ఉండరు. ఆ స్థానం కూడా ఆమెదే.
జయలలిత సాధ్యమైనంతగా ఎవరికీ తలవంచే తత్వం కాదు. ఓటమి అంగీకరించే నైజమూ కాదు. ఎవరినీ అంత సులభంగా నమ్మే వ్యక్తిత్వమూ కాదు. నిండు సభలో డిఎంకె సభ్యులు తనను అవమానించిన తర్వాత సభ ముఖమే చూడలేదు. నిండుసభలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. డిఎంకె అధినేత కరుణానిధిని పంచె ఊడుతున్నా పట్టించుకోకుండా అర్ధరాత్రి అరెస్టు చేయించారు.
జయలలిత కక్ష కడితే అలాగే ఉంటుంది. ఐఏఎస్ అధికారి చంద్రలేఖ విషయంలోనూ అంతే. బహుభాషా నటుడు కమల్‌హాసన్‌నూ విడిచిపెట్టలేదు. బహుశా జయలలిత నియంతృత్వాన్ని చూసే సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉండాల్సి వచ్చిందేమో.
తన నీడను కూడా తాను నమ్మని జయకు అనుచరులే తప్ప, సహచరులు లేరు. జయలలిత ఒంటరి. వివాహం కూడా చేసుకోకుండా, పెంపుడు కొడుకు సుధాకరన్‌కు అప్పట్లోనే 10 కోట్లతో అంగరంగవైభవంగా పెళ్లి చేసి గిన్నిస్‌బుక్ రికార్డుకెక్కారు. కిలోలకొద్దీ బంగారం, అంతకుమించి వెండి, వందల సంఖ్యలో ఖరీదైన చెప్పులు, కొన్ని వేల చీరలు, జీవితంలో సగమై నిలిచిన శశికళ.. అందరినీ, అన్నింటినీ విడిచి.. దశాబ్దాలపాటు అన్నాడిఎంకెను అంతా తానై వెలిగించి, దక్షిణ భారత రాజకీయాల్లో 33 ఏళ్లపాటు నిర్నిరోధంగా వెలిగి, తమిళనాట మహావృక్షమై విస్తరించిన జయలలిత రాజకీయ ప్రస్థానం అపోలో ఆసుపత్రిలో విషాదంగా ముగిసింది. మిగిలిందల్లా ఆమె పేదల కోసం ప్రవేశపెట్టిన లెక్కలేనన్ని సంచలన పథకాలే. ఇప్పుడు ‘అమ్మ’ పోయస్‌గార్డెన్‌లో లేదు. పేదల కోసం అమలుచేస్తున్న లెక్కలేనన్ని పథకాల్లో సజీవంగా ఉంది.