జాతీయ వార్తలు

హమ్మో.. 400 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, డిసెంబర్ 17: దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బైటపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సూరత్‌కు చెందిన కిశోర్ భజియవాలా అనే ఫైనాన్షియర్‌పై నిఘాపెట్టిన అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిపినప్పుడు కళ్లు చెదిరేలా కోట్ల రూపాయల నగదు, బంగారం, విలువైన ఆస్తుల పత్రాలు లభించాయి. వీటన్నిటి విలువ 400 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. భజియవాలా కమిషన్‌పై భారీ మొత్తంలో పాతనోట్లను మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ 1.33 కోట్ల నగదు, 7 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండి ఉన్నాయి. 1.33 కోట్ల నగదులో 95 లక్షలు కొత్త 2 వేల నోట్లు ఉన్నాయి. మిగతావి రద్దయిన నోట్లు, 50, 20, వంద రూపాయల నోట్లు. ఇవికాక 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఆయన ఇంటినుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 13న ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉద్నాగామ్‌లోని తన కార్యాలయం నుంచి భజియవాలా కమిషన్‌పై భారీ ఎత్తున రద్దయిన నోట్లను మార్పిడి చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఐటి అధికారులు ఆయనపై నిఘా పెట్టారు. ఈనెల 13న ఆదాయం పన్ను శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇనె్వస్టిగేషన్ విభాగం అధికారులు ఆయన కార్యాలయంపై దాడి చేసి రూ. 23లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సూరత్ పీపుల్స్ సహకార బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల్లో భజియవాలా తన పేరిట, కుటుంబీకుల పేరిట 30కి పైగా బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు, 16 లాకర్లు కూడా ఉన్నట్టు దాడుల్లో కనుగొన్నారు. భజియవాలా అప్పులిచ్చిన వారి వివరాలతో కూడిన ఒక డైరీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డైరీలో ఆయన కోడ్‌వర్డ్స్‌లో రాసుకున్నాడని, వీటిని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నామని ఐటి అధికారులు తెలిపారు. ఇదేకాకుండా బంగళాలు, ఫ్లాట్లు, ఇళ్లు, షాపులు, వ్యవసాయ భూములకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లను కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 31ఏళ్ల క్రితం సౌరాష్టన్రుంచి ఉద్నాగామ్‌కు వలస వచ్చిన భజియవాలా అప్పు తీసుకున్న డబ్బుతో పెట్టిన చిన్న టీ దుకాణంతో జీవనం ప్రారంభించి ఫైనాన్షియర్‌గా మారి అంచెలంచెలుగా కోట్లకు పడగలెత్తినట్టు తెలుస్తోంది. ఆయనకు స్థానిక రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో సంబంధాలున్నాయని తెలుస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన రోజు తర్వాతి రోజున భజియవాలా నోట్లు నింపిన సంచులతో పట్టణంలోని సూరత్ జిల్లా సహకార బ్యాంక్ శాఖలోకి వెళ్లినట్టు చెప్తున్నారు. బ్యాంక్‌లోని సిసి కెమెరా దృశ్యాలను స్వాధీనం చేసుకున్న ఐటి అధికారులు భజియవాలాను ప్రశ్నించగా ఆయన సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో దాడులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.