జాతీయ వార్తలు

పనిమనిషి కొడుకుని.. ప్రధానినయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహూ(ఎంపీ), ఏప్రిల్ 14: బాబాసాహెబ్ అంబేద్కర్ సాధారణ మనిషి కారని.. ఆయన ధైర్యానికి, పట్టుదలకు ప్రతిరూపమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సమానత్వం, గౌరవం కోసం ఆయన పోరాటం సాగిందని మోదీ కొనియాడారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ జన్మస్థలం మహూలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ‘‘ ఇల్లిల్లూ తిరిగి గినె్నలు కడుగుకునే ఒక సామాన్య స్ర్తి కడుపున పుట్టిన బిడ్డ ఈరోజు ప్రధానమంత్రి కాగలిగాడంటే అదంతా అంబేద్కర్ వల్లే సాధ్యపడింది’’ అని మోదీ అన్నారు. అంబేద్కర్ పుట్టిన ప్రదేశంలో ఆయనకు జోహారు అర్పించే అవకాశం రావటం తన అదృష్టమని మోదీ అన్నారు. పుట్టిన నాటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలో ఎవరిపట్లా ప్రతీకారం తీసుకోవాలని భావించకపోవటం ఆయన గొప్పతనమని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘గ్రామోదయ్‌సే భారత్ ఉదయ్’(గ్రామాభ్యుదయం నుంచి భారత అభ్యుదయం) కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. గ్రామాల పునాదులు బలంగా ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దేశాభివృద్ధి అనేది కొన్ని పట్టణాలు, పారిశ్రామిక వేత్తలవల్లో కాదన్నారు. 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ ఏడాది బడ్జెట్ మొత్తం గ్రామాలకు, రైతులకు అంకితమిచ్చామని మోదీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా 18వేల గ్రామాలు విద్యుత్తు సౌకర్యం లేకుండా అంధకారంలో మగ్గుతుండటం సిగ్గుచేటని ఆయన అన్నారు. పేదలకు అవసరమైనన్ని కార్యక్రమాలు చేయటంలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. ‘ఈ రోజు పేదలు.. పేదలు అంటూ అరుస్తున్న వాళ్లు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న సమయంలో పేదల కోసం ఏం చేశారు’అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఓటు బ్యాంకు గురించే నిత్యం ఆలోచించే వారు సమాజాన్ని విడగొట్టడం మినహా చేసిందేమీ లేదని ఆరోపించారు. దళితుల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చటానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మోదీ తెలిపారు. ‘ ఇవన్నీ మోదీ ఎందుకు చేస్తున్నారంటూ కొందరు చాలా ఆందోళనతో ఉన్నారు. కానీ ఇదంతా అంకితభావానికి సంబంధించిన అంశం. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన దారిలో సామాజిక సౌభ్రాతృత్వాన్ని సాధించటం నా లక్ష్యం. ఆయన పాదాల దగ్గర పనిచేయటం నేను గర్వంగా భావిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని 26, అలీపూర్ రోడ్‌లో అంబేద్కర్ చివరగా నివసించిన ఇంట్లో స్మారకాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కనీసం గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ఈ పనినైనా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

చిత్రం అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం మహూలో గురువారం నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ