జాతీయ వార్తలు

అఖిలేశ్‌దే సైకిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో పుట్టిన ముసలం అంతిమంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడినే ముంచేసింది. నిట్టనిలువునా చీలిన సమాజ్‌వాదీ పార్టీ చిహ్నమైన సైకిల్ కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగిన పోరాటంలో తనయుడిదే పైచేయి అయ్యింది. తానే వ్యవస్థాపకుడిని, తనదే సైకిల్ అంటూ బల్లగుద్దిమరీ చెప్పిన అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు చుక్కెదురైంది. మెజారిటీ తనదేనంటూ ఎన్నికల కమిషన్ ముందు అఫిడవిట్లతో సహా రుజువు చేసుకున్న ములాయం కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్‌కే సైకిల్ దక్కింది. అఖిలేశ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ వర్గమే నిజమైన సమాజ్‌వాదీ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. పార్టీ అధికార చిహ్నమైన సైకిల్ గుర్తును కూడా ఆ వర్గానికే కేటాయిస్తున్నట్టు సోమవారం తీర్పునిచ్చింది. సైకిల్ గుర్తు తమకు దక్కడంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అఖిలేశ్ వర్గానికి అనుకోని వరమే అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జాతీయ కనె్వన్షన్ డెలిగేట్ల సంఖ్యను పరిశీలిస్తే అఖిలేశ్ యాదవ్‌కే పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్న విషయం తేటతెల్లమవుతోందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నిజానికి గత శుక్రవారమే ఈ అంశాన్ని విచారించినా, తుది ఉత్తర్వును నేడు జారీ చేసింది. మరికొన్ని గంటల వ్యవధిలో యూపీ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జారీకానున్న తరుణంలో అధికారికంగా సైకిల్ గుర్తు అఖిలేష్‌కే దక్కడం ఆ వర్గంలో ఎనలేని ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులకు పార్టీ గుర్తు కీలకం. ఇరువర్గాలు సైకిల్ గుర్తు కోసం ఈసీ ముందు బలంగానే ఈనెల 13న తమ వాదనలు వినిపించాయి. దాదాపు ఐదు గంటలకుపైగా అఖిలేష్, ములాయం వర్గాల వాదనలను ఎన్నికల కమిషన్ విన్నది. తమ పరిశీలనలో ఉన్న అన్ని అఫిడవిట్లను లోతుగా పరికించిన మీదట పూర్తి మెజారిటీ మద్దతు కలిగిన అఖిలేష్ యాదవ్‌తో నిజమైన సమాజ్‌వాదీ పార్టీ అంటూ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో యూపీలో అఖిలేష్ వర్గాలు పండగ చేసుకున్నాయి. బాణసంచా పేలుస్తూ, వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ తమ ఆనందాన్ని చాటుకున్నాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన తీర్పుపట్ల సమాజ్‌వాదీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి ఓ బలమైన లౌకిక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ తీర్పు ఉపకరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఓ గ్రాండ్ ఫ్రంట్‌గా తాము ఏర్పడే అవకాశం ఉందన్న సంకేతాలను ఆయన అందించారు. అఖిలేష్ యాదవ్‌కే సమాజ్‌వాదీ పార్టీ సైకిల్ గుర్తును కేటాయించడానికి తాము పరిశీలించిన అంశాల గురించి, గతంలో సుప్రీం కోర్టు సాధిక్ అలి కేసులో ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకున్నట్టు 46 పేజీల ఉత్తర్వులో ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అఖిలేష్ యాదవ్ వర్గం మొత్తం 228మంది ఎమ్మెల్యేల్లో 205మంది అఫిడవిట్లను, 68మంది ఎమ్మెల్సీల్లో 56 మంది మద్దతు పత్రాలను, 24మంది ఎంపీల్లో 15మంది విధేయతను, 46మంది జాతీయకార్యవర్గ సభ్యుల్లో 28మంది మద్దతు పత్రాలను తమకు అందించిందని, అదేవిధంగా 5731మంది జాతీయ డెలిగేట్లలో 4.4వేల మంది తమవైపే ఉన్నారన్న ధ్రువీకరణ పత్రాలను కూడా అఖిలేష్ వర్గం సమర్పించిందని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ములాయం సింగ్ వర్గం పార్టీ చిహ్నం కోసం గట్టిగా వాదించినప్పటికీ, ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన అఫిడవిట్లను దాఖలు చేయలేదని ఈసీ తెలిపింది. ఇందుకు కారణం అసలు సమాజ్‌వాదీ పార్టీ చీలిపోలేదని, అలాంటప్పుడు ఎన్నికల చిహ్నానికి సంబంధించిన వివాదమే ఉండదని ములాయం వర్గం వాదించటమే.

చిత్రం..సైకిల్ గుర్తు అఖిలేశ్‌కే దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న మద్దతుదారులు