జాతీయ వార్తలు

అవినీతిపరులంతా ఏకమయ్యారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరట్, ఫిబ్రవరి 4: పెద్దనోట్ల రద్దుతో తాను ఆటకట్టించిన అవినీతిపరులంతా ఇప్పుడు తనను గద్దె దించడానికి ఒక్కటవుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ-కాంగ్రెస్ పొత్తుపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆయన నిన్నటిదాకా ఒకరినొకరు విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బిజెపి ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్కామ్‌కు కొత్త భాష్యం చెప్పారు. స్కామ్‌లకు వ్యతిరేకంగా బిజెపి పోరాడుతోందని, స్కామ్ అంటే సమాజ్‌వాది పార్టీ (ఎస్), కాంగ్రెస్ (సి) అఖిలేశ్ యాదవ్ (ఎ), మాయావతి (ఎం) అని, మీకు స్కామ్ కావాలో, బిజెపి కావాలో తేల్చుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతేకాదు బిజెపి అభివృద్ధి అజెండా కావాలో, నేరగాళ్లకు ఆశ్రయం ఇచ్చే, ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడే, భూ మాఫియా, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహించేవారు కావాలో నిర్ణయంచుకోవాలని కూడా ఆయన అన్నారు.
దాదాపు గంటకుపైగా ప్రసంగించిన మోదీ రాష్ట్రంలో నెలకొన్న అవినీతి, అరాచక పరిస్థితి, బంధుప్రీతి గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి బిజెపిని గెలిపించాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ తనను ప్రధానిని చేసిందని, రాష్ట్ర రుణం తీర్చుకోవాలని తాను అనుకుంటున్నానని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రంతో చేయి కలిపే ప్రభుత్వం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలపై ధ్వజమెత్తిన ప్రధాని, గతంలో కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం సాగించిన విషయాన్ని గుర్తుచేశారు. రాత్రికి రాత్రి ఆ రెండు పార్టీలు దగ్గర కావడానికి ఇప్పుడు ఏం జరిగిందని ప్రశ్నించారు. కాగా, రైతులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన మోదీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న, సన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తామని తమ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లోనే చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నిటినీ చెల్లిస్తామని కూడా ఆయన పునరుద్ఘాటించారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు గొడవ చేయడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ టికెట్లు అమ్ముకోవడం ద్వారా వసూలు చేసిన కరెన్సీ నోట్లతో తమ గదులను నింపుకున్న వారంతా కూడా ఆ సొమ్మునంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా చేసిన తనపై మండిపడుతున్నారనే విషయం తనకు తెలుసునని, అయినప్పటికీ ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేదాకా విశ్రమించబోనని సభకు హాజరయినవారి హర్షధ్వానాల మధ్య అన్నారు. సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కుటుంబంలో జరుగుతున్న గొడవలన్నీ ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు.

చిత్రం..మీరట్‌లో శనివారం బిజెపి నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని గజమాలతో సత్కరిస్తున్న బిజెపి నేతలు. చిత్రంలో యుపి బిజెపి అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ వౌర్య, లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ తదితరులు.